
ఒకప్పుడు దేశం గర్వించిన ఉక్కు కర్మాగారం…ఇటీవల వరకూ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. అయితే ప్రస్తుతం ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమ…లాభాల బాట పట్టింది. లాభాల బాట పట్టటం అనేది ఇదేదో సాధారణ ఆర్థిక పురోగతి కాదు, ఒక రాజకీయ సంకల్పం, పాలనా సామర్థ్యానికే నిదర్శనం. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి సాధించిన ఒక ఘనవిజయం… విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL) నష్టాల ఊబి నుండి లాభాల బాట ఎలా పట్టిందో ఈ కధనంలో తెలుసుకుందాం..
ఒకప్పుడు అప్పులు, నష్టాలతో కుదేలైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మళ్లీ ఆశాజ్యోతిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ సహకారంతో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) లాభాల బాట పట్టింది. 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని ఆర్జించడం ద్వారా విశాఖ ఉక్కు తాను పునర్జీవం పోసుకున్నానంటూ స్పష్టమైన సంకేతం ఇచ్చింది.
గత కొన్నేళ్లుగా ఆర్థిక ఒత్తిళ్లు, ఉత్పత్తి పరిమితులు, విధానపరమైన సమస్యలతో సతమతమైన ఈ పరిశ్రమ, గత ఏడాదిన్నరలో అనూహ్యమైన మార్పును చవిచూసింది. ఒకప్పుడు రోజుకు 9,215 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తికే పరిమితమైన ప్లాంట్, ప్రస్తుతం రోజుకు 19,401 టన్నుల ఉత్పత్తి చేస్తోంది. మూడు బ్లాస్ట్ ఫర్నెస్‌లు పూర్తిస్థాయిలో పనిచేయడంతో ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరిగింది.
ఉత్పత్తితో పాటు సామర్థ్య వినియోగంలోనూ విశాఖ ఉక్కు రికార్డు స్థాయికి చేరుకుంది. గత ఏడాది కేవలం 45 శాతానికి పరిమితమైన ప్లాంట్ కెపాసిటీ యుటిలైజేషన్, ప్రస్తుతం 94 శాతానికి చేరడం పరిశ్రమ సామర్ధ్యానికి నిదర్శనంగా మారింది. ఈ మార్పు వెనుక ప్రభుత్వ విధానాల్లో స్పష్టత, నిర్వాహణలో క్రమశిక్షణ, కార్మికుల సమిష్టి కృషి కారణమనే చెప్పాలి.
పన్నులు, విద్యుత్ బకాయిలు, నీటి సరఫరా వంటి కీలక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం సాధ్యమైంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ స్టీల్ ప్లాంట్ నిలదొక్కుకునేందుకు కీలక ఆధారంగా మారింది. ఫలితంగా RINL ఆర్థిక స్థితి మెరుగుపడి, క్రెడిట్ రేటింగ్ కూడా పెరిగింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుత్థానం వెనుక రాజకీయ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం బలపడటం వల్లే ఈ మార్పు సాధ్యమైందని వారు చెబుతున్నారు. కేవలం నష్టాల నుంచి బయటపడటం మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా నిలకడగా లాభాలు సాధించే దిశగా పరిశ్రమను తీసుకెళ్లే వ్యూహాలు అమలవుతున్నాయని పేర్కొంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక చరిత్ర ఉందని, “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” ఉద్యమంతో ఏర్పడిన ఈ పరిశ్రమ రాష్ట్ర ప్రజల భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచింది. గత కొన్నేళ్లుగా నష్టాలు, అప్పులు, విధానపరమైన సమస్యలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న విశాఖ ఉక్కు, ప్రస్తుతం లాభాల బాట పట్టడం ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఒక ఆశాజనక ఉదాహరణగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తిరిగి గాడిలో పడటం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చే కీలక పరిణామంగా మారిందనే చెప్పాలి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ముందున్న సమస్య సొంత గనుల లేమి ;
దేశంలోని ఇతర స్టీల్ ప్లాంట్లతో పోలిస్తే విశాఖ ఉక్కు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సొంత గనులు లేకపోవటమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉన్న భిలాయ్, దుర్గాపూర్, రౌర్కెలా వంటి స్టీల్ ప్లాంట్లకు స్వంత ఇనుప ధాతు గనులు ఉండగా, విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం ఇప్పటికీ బయటనుండి వచ్చే ఐరన్ ఓర్ పైనే ఆధారపడుతోంది. దీంతో ముడి పదార్థాల ఖర్చు పెరిగి, ఉత్పత్తి వ్యయం అధికమవుతోందన్న వాదన ఉంది. గతంలో విశాఖ ఉక్కు నష్టాల్లోకి జారడానికి కూడా ఇదే ప్రధాన కారణంగా పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
ప్రస్తుతం లాభాల బాట పట్టిన తరుణంలోనే ఈ లోపాన్ని సరిచేస్తే, విశాఖ ఉక్కు దీర్ఘకాలికంగా నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సొంత ఇనుప ధాతు గనుల కేటాయింపు జరిగితే, ముడి పదార్థాల వ్యయం గణనీయంగా తగ్గి, ఉత్పత్తి ఖర్చులపై నియంత్రణ సాధ్యమవుతుందని చెబుతున్నారు. అప్పుడు తాత్కాలిక సాయాలపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధి దిశగా విశాఖ ఉక్కు ప్రయాణం చేయగలదని విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తే విశాఖ ఉక్కుకు దీర్ఘకాలిక మేలు జరుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం సాధించి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు స్వంత గనుల కేటాయింపుపై ముందడుగు వేస్తే, ఇప్పుడున్న విశాఖ ఉక్కు పునర్జీవం శాశ్వతంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సొంత గనుల కేటాయింపు వంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటే, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా బలమైన ఆధారంగా మారే అవకాశం ఉంది.
విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు ఎందుకు అవసరం?
విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL) దీర్ఘకాలికంగా లాభాల బాటలో నిలవాలంటే సొంత ఇనుప ధాతు గనుల కేటాయించటం అనివార్యం. ఇందుకు కారణాలు లేకపోలేదు. వాటి గురించి మనం ఒకసారి చర్చించుకుంటే
ముడి పదార్థాల ఖర్చు తగ్గింపు: ప్రస్తుతం విశాఖ ఉక్కు ఇతర ప్రభుత్వ,ప్రైవేట్ గనుల నుంచి ఇనుప ధాతువును కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. సొంత గనులు ఉంటే ముడి పదార్థాల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.
ఉత్పత్తిలో స్థిరత్వం: ఐరన్ ఓవర్ దిగుమతులపై ఆధారపడటం వల్ల సరఫరాలో అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉంది. సొంత గనులు ఉంటే ముడి పదార్థాల సరఫరా నిరంతరం కొనసాగి ఉత్పత్తి నిలకడగా ఉంటుంది.
పోటీ సామర్థ్యం పెరుగుతుంది: భిలాయ్, రౌర్కెలా, దుర్గాపూర్ వంటి ఇతర స్టీల్ ప్లాంట్లకు సొంత గనులు ఉండటంతో అవి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. విశాఖ ఉక్కుకు కూడా అదే స్థాయి పోటీ సామర్థ్యం లభిస్తుంది.
లాభాలలో స్థిరత్వం: ప్రస్తుతం లాభాల్లోకి వచ్చినా, ముడి పదార్థాల ధరలు పెరిగితే మళ్లీ నష్టాల ప్రమాదం ఉంటుంది. సొంత గనులు ఉంటే లాభాలు తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా కొనసాగుతాయి.
ప్రభుత్వ సాయాలపై ఆధారత తగ్గింపు: స్వంత వనరులు లభిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక ప్యాకేజీలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. స్వయం సమృద్ధి దిశగా RINL అడుగులు వేసేందుకు అవకాశం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం : విశాఖ ఉక్కు బలోపేతమైతే ఉపాధి, పారిశ్రామిక వృద్ధి, ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా మేలు చేస్తుంది.
లాభాల బాటలోకి వచ్చిన ఈ దశలోనే సొంత గనుల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది. కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తే, ఇది విశాఖ ఉక్కుకే కాదు, ఆంధ్రప్రదేశ్‌కు కూడా చారిత్రక నిర్ణయంగా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ఆదిశగా ఆలోచన చేసి కేంద్రప్రభుత్వంతో సంప్రదింపులు జరపటం మంచిది.