
ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన జిల్లా రజక ఆత్మీయ మహాసభ రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చకు దారితీసింది. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేలా కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని సభలో ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి హాజరై రజక వర్గ ప్రతినిధుల విన్నపాలను స్వీకరించారు.
డిమాండ్ వెనుక కారణాలు
రజక వర్గం ప్రస్తుతం బీసీ జాబితాలో ఉన్నప్పటికీ, సామాజికంగా మరియు ఆర్థికంగా ఇంకా వెనుకబాటుతనంలోనే ఉన్నామని నాయకులు పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని, ఎస్సీ జాబితాలో చేర్చితేనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు.
కేంద్రం ఒప్పుకుంటుందా?
ఎవరినైనా ఎస్సీ జాబితాలో చేర్చడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. రాష్ట్ర సిఫార్సు తర్వాత రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా పరిశీలన, జాతీయ ఎస్సీ కమిషన్ అభిప్రాయం, చివరికి పార్లమెంట్ ఆమోదం అవసరం. కాబట్టి ఇది వెంటనే తీసుకునే నిర్ణయం మాత్రం కాదు. దీర్ఘకాలిక ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. సామాజిక,ఆర్థిక డేటా ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఎస్సీ వర్గాల స్పందన ఎలా ఉండనుందో?
ఇది సున్నితమైన అంశం కావడంతో ఇప్పటికే ఉన్న ఎస్సీ వర్గాల్లో ఆందోళనలు తలెత్తే అవకాశం ఉంది. రిజర్వేషన్ పోటీ పెరిగే అవకాశంపై కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీసీ వర్గాలపై ప్రభావం పడుతుందా
రజకులు ఎస్సీ జాబితాలోకి మారితే, బీసీ కోటాలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇతర బీసీ వర్గాల్లో మిశ్రమ స్పందన వచ్చే అవకాశాన్ని కూడా రాజకీయ వర్గాలు పరిశీలిస్తున్నాయి.
మంత్రి ఏమన్నారంటే
మంత్రి పార్థసారథి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతోందని ఆయన తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏం చేయాలి?
కొత్త డిమాండ్ తెరముందుకు వచ్చిన నేపధ్యంలో ప్రభుత్వం అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి, నిష్పక్షపాత సామాజిక-ఆర్థిక సర్వే నిర్వహించాలి. రాజ్యాంగ, చట్టపర పరిమితులను పరిశీలిస్తూ కేంద్రంతో సమన్వయం పెంచాలి. ఎస్సీ, బీసీ వర్గాల మధ్య విభేదాలు రాకుండా సమతుల్య దృక్పథంతో ముందుకు సాగడం అవసరం.
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిమితులు, రాజకీయ వ్యూహాలు కలిసి ఉన్న క్లిష్టతరమైన అంశం. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఎస్సీ వర్గాలు అంగీకరిస్తాయా? లేక ఇది రాజకీయ చర్చగానే మిగిలిపోతుందా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి దాకా వేచిచూడాల్సిందే…