ఫిబ్రవరి 11 అసెంబ్లీ సమావేశాలు: వైసీపీ 11 మంది ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠ!

ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, రాజకీయ వర్గాల్లో ఒక కీలక ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 11 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు హాజరవుతారా? లేక అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటారా? అన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

ఇటీవల కాలంలో వైసీపీ నేతలు అనుసరిస్తున్న రాజకీయ వైఖరిని పరిశీలిస్తే, అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై చర్చించటం కంటే అసెంబ్లీ బయట అనవసరమైన రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు అధికార కూటమి నుంచి తీవ్రంగా వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి 11 వ తేది నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనుండటం, వైసీపీకి చెందిన ఎమ్మెల్యులు అసెంబ్లీకి వచ్చి తిరుమల లడ్డూ వ్యవహారంపై ఆధారాలతో చర్చ చేస్తారా? లేక సభలోకి అడుగుపెట్టకుండా సమావేశాలను బహిష్కరించి, బయట నుంచే ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తారా? అనే సందేహం అందరిలో కలుగుతుంది.

లడ్డు వివాదాన్ని అసెంబ్లీలో ఎదుర్కొనే ధైర్యం ఉందా?

తిరుమల లడ్డు అంశం అత్యంత సున్నితమైనది. ప్రజల విశ్వాసం, భక్తి, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న అంశంపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. అయితే ఈ అంశాన్ని అసెంబ్లీలో అధికారికంగా చర్చించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే కూటమి పార్టీలకు చెందిన టిడిపి, జనసేన, బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ అంశంపై చర్చించేందుకు వైసీపీ సిద్ధంగా ఉందా? అన్న అనుమానం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

ఎందుకంటే, సభలో మాట్లాడాలంటే ఆధారాలు అవసరం…అధికారిక రికార్డులు, ప్రభుత్వ సమాధానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవపట్టించేలా మీడియా హెడ్‌లైన్స్ కోసం చేసిన వ్యాఖ్యలకు అసెంబ్లీ కి వచ్చి చర్చచేస్తే వారి లోగుట్టు బట్టబయలయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సభకు హాజరుకావటం అన్నది వైసీపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అంబటి రాంబాబు వ్యవహారంతో మరింత ఇరకాటంలో వైసీపీ

ఇటీవల అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత చోటు చేసుకున్న ఉద్రిక్త పరిణామాలు, చివరకు ఆయన అరెస్ట్,ఈ ఘటనలన్నీ వైసీపీ పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయనే చెప్పుకోవాలి. ఈ అంశాలన్నీ అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరైతే, కూటమి ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి గట్టి ఎదురుదాడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎదురుదాడిని తప్పించుకునేందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే, “ప్రజా సమస్యలపై చర్చించడానికి భయపడుతున్నారు” అనే విమర్శలు వైసీపీకి తప్పవు. ఈ పరిణామం వైసీపీకి ఒకింత సంకట పరిస్ధితిగానే భావించాలి.

ఇప్పటికే అధికార కూటమి ప్రభుత్వం, ఆయా పార్టీల నేతలు వైసీపీ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని, సభ బయట రాజకీయాలు చేస్తూ చట్టసభల గౌరవాన్ని మంటగలుపుతున్నారన్న ఆరోపణలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

మొత్తానికి, వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరై కూటమి ప్రభుత్వం పై పోరాడాలా? లేక సభ బయట నుండే తమ విమర్శల రాజకీయాన్ని కొనసాగించాలా? అన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్న ప్రధాన సవాలు. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు కనిపిస్తారా లేదా అన్నది, వైసీపీ రాజకీయ వ్యూహానికి స్పష్టత ఇచ్చే అంశంగా నిలవబోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి అసెంబ్లీ సమావేశాలను వైసీపీ అవకాశంగా మలచుకోబోతుందా…లేదంటే రాజకీయ పరిక్షను ఎదుర్కోబోతుందో వేచిచూడాల్సిందే…

×