
అమరావతి: పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో వైఎస్సార్సీపీ చేస్తున్న అబద్ధాల ప్రచారం నిజాల ముందు నిలబడలేక సతికలబడుతుంది. ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరించేందుకు వైసీపీ ప్రయత్నించింది. దొంగే.. దొంగ…దొంగ అన్నట్లు వైసీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. వాస్తవాలను వక్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రభుత్వ సంస్థల నివేదికలు, వైసీపి ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న విధాన నిర్ణయాలు పరిశీలిస్తే ఇది తెలిసి చేసిన నిర్లక్ష్యం కాదు… పద్ధతి ప్రకారమే జరిగిన నేరం అన్న అభిప్రాయం బలపడుతోంది.
నివేదికలు ఏమి చెబుతున్నాయి?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి ని పరీక్షలకు పంపింది. నెయ్యి శాంపిల్స్‌ను ఎన్డీడీబీ (NDDB) ల్యాబ్‌కు పంపగా కీలక నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్డీడీబీ నివేదిక ప్రకారం, లడ్డూలో వాడింది అసలు నెయ్యి కాదని, రసాయనాలతో తయారైన పదార్థం ఉపయోగించారని…జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని నివేదిక స్పష్టంగా నిర్ధారించింది. ఈ నివేధిక ఏదో రాజకీయ పార్టీ ఇచ్చిన ప్రకటన కాదు… దేశంలో అత్యంత విశ్వసనీయమైన ల్యాబ్ ఇచ్చిన శాస్త్రీయ ఆధారంగా చెప్పుకోవాలి.
వైసీపీ ‘క్లీన్ చిట్’ వాదనలో పసేలేదు ;
ఈ నివేదికల అనంతరం వైఎస్సార్సీపీ నేతలు ఎన్డీఆర్ఐ (NDRI) నివేదికను చూపిస్తూ తమకు క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం ప్రారంభించారు. అయితే ఈ వాదనలోనే కీలక లోపాలు బయటపడ్డాయి. ఎన్డీఆర్ఐ సంస్థ స్వయంగా తన నివేదికలో జంతు కొవ్వు అవశేషాలను గుర్తించే సామర్థ్యం తమ వద్ద లేదని స్పష్టం చేసింది. అంటే, గుర్తించలేని అంశంపై ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని కల్తీ జరగలేదని చెప్పడం వైసీపీ ప్రజలను తప్పుదారి పట్టించడమేనని విశ్లేషకులు అంటున్నారు.
2022 నివేదికను ఎందుకు దాచారు?
ఈ వ్యవహారంలో వైసీపీ మరుగునపెట్టిన అంశం ఏమిటంటే 2022లోనే సీఎప్టీఆర్ఐ (CPTRI) నివేదిక లడ్డూలో కల్తీ జరుగుతోందని నిర్ధారించింది. అయితే, ఆ నివేదికను ప్రజల ముందు పెట్టలేదు సరికదా….కల్తీని అడ్డుకోలేదు….బాధ్యులపై చర్యలు సైతం తీసుకోలేదు…అప్పటి టీటీడీ పాలకవర్గం సీఎప్టీఆర్ఐ నివేదికను తొక్కిపెట్టిందన్న ఆరోపణలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నెయ్యి కల్తీ వ్యవహారం మాకు తెలియకుండానే జరిగిందన్న వైసీపీ వాదన నమ్మశక్యం కాకుండా మారింది.
విధాన నిర్ణయాలే కల్తీకి దారితీశాయా?
2019లో నెయ్యి కొనుగోలు టెండర్ల నిబంధనల్లో చేసిన మార్పులు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. పాలు లేకుండానే నెయ్యి తయారు చేసే విధానానికి అవకాశం కల్పించేలా నిబంధనలు సడలించారని ఆరోపణలు ఉన్నాయి. దీని ఫలితంగా, నకిలీ నెయ్యి, రసాయన పదార్థాలు, నాణ్యతలేమి లడ్డూ తయారీకి దారి తీసినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలు అన్నింటి నిశితంగా పరిశీలిస్తే ఇది యాదృచ్ఛికంగా జరిగిందనే దాని కంటే పథకం ప్రకారమే జరిగిన వ్యవహారం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజకీయ దాడిగా మార్చే ప్రయత్నం;
లడ్డూ కల్తీ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలిచేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. దేవాలయ పవిత్రత, భక్తుల మనోభావాల వంటి అంశాలను పక్కనపెట్టి, ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన వివాదమన్న వాదనను తెరపైకి తెస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం, ఇది రాజకీయ ప్రతీకారం కోసం కాదు….భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకే వాస్తవాలను బయటపెడుతున్నాం అని స్పష్టం చేస్తోంది.
నిజం వర్సెస్ అబద్ధపు ప్రచారం ;
ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే, ఒక వైపు ల్యాబ్ నివేదికలు, వైసీపీ ప్రభుత్వంలో జరగిని విధాన పరమైన నిర్ణయాలు,
మరో వైపు తాము ఎంపిక చేసుకున్న నివేదికలతో చేసిన అబద్ధపు ప్రచారం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజాలను ఎదుర్కోవడం కంటే, వైసీపీ అబద్ధాల ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్న భావన ప్రజల్లో బలపడుతోంది.
తిరుమల లడ్డూ కల్తీ అంశం రాజకీయ ఆరోపణలకే పరిమితం కావడం లేదు. ఇది దేవాలయల్లో పారదర్శకత, భక్తుల విశ్వాసం, ప్రభుత్వ బాధ్యత వంటి కీలక ప్రశ్నలను ముందుకు తెస్తోంది. ఈ వ్యవహారంలో చివరికి నిజమే బయటపడుతుందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. ఎందుకంటే, అబద్ధపు ప్రచారాన్ని కొంతకాలం చేయవచ్చేమో… కానీ నిజాన్ని శాశ్వతంగా దాచలేం… ఈ విషయాన్ని వైసీపీ నేతలు గుర్తెరిగితే ఉత్తమం.