తిరుమల లడ్డూ కల్తీపై కూటమి సీరియస్: వైఎస్సార్సీపీ అబద్ధాలకు ఫుల్ స్టాప్!

అమరావతి: పవిత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం రాజకీయంగా కాకుండా భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ పాలనలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ నివేదిక స్పష్టంగా నిర్ధారించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ అంశంపై వైఎస్సార్సీపీ చేస్తున్న దుష్ప్రచారానికి కలసికట్టుగా చెక్ పెట్టాలని కూటమి నేతలు నిర్ణయించారు.

సీఎం నివాసంలో కీలక భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి అగ్రనేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, ఆనం రాంనారాయణ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, పార్థసారథి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా ఉన్నతాధికారులు తమ వద్ద ఉన్న పూర్తి వివరాలను నేతలకు వివరించారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన లడ్డూ కల్తీ వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఎన్డీడీబీ నివేదికలో షాకింగ్ నిజాలు ;

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి శాంపిల్స్‌ను ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపించగా, కీలక నిజాలు వెలుగులోకి వచ్చాయని నేతలు వెల్లడించారు. లడ్డూలో అసలు నెయ్యే లేదని….రసాయనాలతో తయారైన పదార్థం వాడారని….జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని ఎన్డీడీబీ నివేదిక స్పష్టంగా నిర్ధారించింది. సిట్ నివేదిక కూడా ఇదే విషయాలను సమర్థించిందని నేతలు తెలిపారు.

2022లోనే కల్తీ నిర్ధారణ…..ఎందుకు దాచారు?

ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, 2022లోనే సీఎప్టీఆర్ఐ నివేదిక లడ్డూలో కల్తీ జరుగుతోందని నిర్ధారించిందని తెలిపారు. అయినప్పటికీ నాటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆ నివేదికను తొక్కిపెట్టారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కల్తీని 2024 వరకూ కొనసాగించిందని విమర్శించారు.

2019లో నెయ్యి కొనుగోలు టెండర్ల నిబంధనలను సడలించడంతోనే కల్తీకి బీజం పడిందని మంత్రి వివరించారు. పాలు లేకుండానే నెయ్యి తయారు చేసే విధానానికి అవకాశం కల్పించారని చెప్పారు.

ఎన్డీఆర్ఐ “క్లీన్ చిట్” ఇచ్చిందంటూ తప్పుదారి

వైఎస్సార్సీపీ ఎన్డీఆర్ఐ నివేదిక ఆధారంగా తమకు క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేయడాన్ని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. జంతు కొవ్వు అవశేషాలను గుర్తించే సామర్థ్యం తమ వద్ద లేదని ఎన్డీఆర్ఐ సంస్థ స్వయంగా తన నివేదికలో పేర్కొందని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. లడ్డూ నాణ్యత పరిశీలన కమిటీలో ఉన్న ఇద్దరు వ్యక్తులే ఎన్డీఆర్ఐలో కూడా పనిచేయడం గమనార్హమని చెప్పారు.

సీఎం చంద్రబాబు హెచ్చరిక

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జరిగిన అపవిత్రాన్ని సరిచేయడం దేవుడు కల్పించిన మహా సంకల్పంగా భావిస్తున్నామని అన్నారు. ప్రసాదాన్ని అపవిత్రం చేయడానికి దేవుడినే లెక్కచేయలేదని మండిపడ్డారు. ఘోరమైన నేరం చేసి మళ్లీ ఎదురుదాడి చేస్తే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

అలిపిరి బాంబు బ్లాస్ట్‌లో తనకు లభించిన పునర్జన్మ దేవుడి మహిమేనని పేర్కొంటూ, వేంకటేశ్వరస్వామి విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తేల్చిచెప్పారు.

పవన్ కళ్యాణ్, మాధవ్ వ్యాఖ్యలు

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, భగవంతుడిపై పగ పట్టి ఏడుకొండల్ని రెండు కొండలుగా చిత్రీకరించిన నేపథ్యం వైఎస్సార్సీపీదని విమర్శించారు. భగవంతుడితో పెట్టుకున్నవాడు సర్వనాశనం అవుతాడని వ్యాఖ్యానించారు. హిందూ ధర్మ రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టంగా ఉందన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, సాక్షి పత్రిక కథనాల ఆధారంగా వైఎస్సార్సీపీ తమకు తామే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం దుర్మార్గమని విమర్శించారు. అన్యమతస్థుల ప్రాబల్యాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే కుట్రలకు కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందని స్పష్టం చేశారు. సింథటిక్ నెయ్యితో రూ.250 కోట్ల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు.

కూటమి స్పష్టత

తిరుమల లడ్డూ కల్తీ అంశం రాజకీయ ప్రతీకారం కోసం కాదని, భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకే వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నామని కూటమి నేతలు స్పష్టం చేశారు. దేవాలయాల పవిత్రత, భక్తుల మనోభావాల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడేది లేదన్నారు. వైఎస్సార్సీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని కలసికట్టుగా ఎదుర్కొని, నిజాలను ప్రజలకు తెలియజేస్తామని కూటమి స్పష్టంచేసింది.

×