చంద్రబాబు నిర్ణయం సంకుచిత రాజకీయాలకు చెంపపెట్టు!

రాజకీయాల్లో విమర్శలు సహజం. పోరాటాలు సహజం. కానీ వాటిని దాటి నిలబడే విలువలే అసలైన రాజకీయాలు. ఆ సత్యాన్ని మరోసారి గుర్తు చేసింది గద్దర్ విగ్రహ ప్రతిష్ఠ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం. ప్రజా గాయకుడు గద్దర్ ఉద్యమానికి ప్రతీక. ఆయన పాటలు, ఆయన భావజాలం, ఆయన రాజకీయ వైఖరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ దృక్కోణానికి పూర్తిగా విరుద్ధం. గద్దర్ అనే వ్యక్తి కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే కాదు, సిద్ధాంత పరంగా గద్దర్, చంద్రబాబు ఇద్దరూ భిన్నద్రువాలు. అయినప్పటికీ, తనపై తీవ్ర విమర్శలతో కూడిన పాటలు పాడిన వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు విషయంలో చంద్రబాబు ఎలాంటి సంకుచిత రాజకీయ లెక్కలు వేయకపోవటమే విశేషం…

తెలుగు సమాజంలో గద్దర్ పేరు తెలియని వారుండరు. విప్లవ గాయకుడిగా, ప్రజా కళాకారుడిగా, అణగారిన వర్గాల గొంతుగా గద్దర్ తన జీవితాన్ని ఉద్యమాలకు అంకితం చేశాడు. గ్రామ గ్రామాన తిరుగుతూ, తుపాకీ కాదు పాటనే ఆయుధంగా చేసుకుని పాలక వ్యవస్థలపై పోరాటం చేసిన అరుదైన ప్రజాకవి గద్దర్. భూమి, కూలీ, దోపిడీ, అణచివేత ఇవన్నీ ఆయన పాటల్లో ప్రధాన అంశాలు. రాజ్యం ఎవరికి? అధికారం ఎవరి కోసం? అన్న ప్రశ్నలతో తన గాత్రంతో ప్రజల్లో చైతన్యం నింపాడు. గద్దర్ పాటలు వినోదం కాదు రాజకీయ వ్యవస్థపై ప్రత్యక్ష యుద్ధంగా నిలిచాయనే చెప్పుకోవాలి.

ఆ క్రమంలో గద్దర్ రాజకీయ విమర్శలు చివరకు వ్యక్తులను టార్గెట్ చేసే వరకూ వెళ్లాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గద్దర్ పాడిన పాటలు ప్రత్యక్షంగా చంద్రబాబు పాలనను లక్ష్యంగా చేసుకున్నాయి. చంద్రబాబు పేరు చెప్పి, పదునైన పదాలతో విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. గద్దర్ దృష్టిలో చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక పాలనకు ప్రతీక. తన పాట రూపంలో కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఎలుగెత్తారు.

గద్దర్ విగ్రహం విషయంలో రాజకీయ ద్వేషాలను పక్కనపెట్టి ;

గద్దర్ కుమార్తె వెన్నెల . గద్దర్ అభిమానులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక మేరకు ఆంధ్రా యూనివర్సిటీలో గద్దర్ విగ్రహం ప్రతిష్ఠకు అనుమతి ఇవ్వాలని, అలాగే ఆర్ట్ అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంట్‌కు గద్దర్ పేరు పెట్టాలని కోరుతూ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ వినతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించడం అన్నది ఒక పాలనా నిర్ణయంగా మాత్రమే చూడలేం. అది ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందనే చెప్పుకోవాలి.

రాష్ట్ర విభజనకు గద్దర్ భావజాలం, ఆయన ఉద్యమాలు ఒక కారణమన్న భావన ఆంధ్ర ప్రజల్లో నేటికి ఉంది. విభజన వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూసినప్పటికీ, ఆంధ్రులు గద్దర్ విగ్రహ ప్రతిష్ఠను తీవ్రంగా వ్యతిరేకించలేదు. ఎందుకంటే భావోద్వేగాలకంటే, వివేకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సంస్కారం ఆంధ్ర సమాజానికి ఉంది. రాజకీయంగా విభేదించినా, ఒక కళాకారుడి కృషిని గౌరవించటమే ఆంధ్రుల సంస్కారం.

ఇదే సమయంలో మరో విషయం కూడా మనం చెప్పుకోవాలి. తెలంగాణ వాదాన్ని ఒక రాజకీయ కవచంలా వాడుకుని, నాలుగు రోజుల మీడియా గుర్తింపు కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి మహానుభావుడి విగ్రహాన్ని వ్యతిరేకించిన ఘటనలు ఉన్నాయి. ఇవి ప్రజాస్వామ్యానికి అవమానంగా నిలుస్తాయి. ఎస్పీబీ గారు ఏ ఉద్యమానికి, ఏపార్టీకి చెందినవారు కాదు, ఏ ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన స్వరం తెలుగు జాతి మొత్తం గుండె చప్పుడు. అలాంటి వ్యక్తిని ప్రాంతీయ రాజకీయాల్లోకి లాగడం అంటే తమ రాజకీయ సంకుచితత్వాన్ని తామే బహిర్గతం చేసుకోవడమే.

ఇక్కడే తేడా స్పష్టంగా కనిపిస్తుంది;

ఒకవైపు తమను విమర్శించిన గద్దర్ విగ్రహానికి గౌరవ స్థానం కల్పించే చంద్రబాబు నాయుడు నాయకత్వం. మరోవైపు ఓ కళాకారుడి విగ్రహా ఏర్పాటును కూడా సహించలేని సంకుచిత మనస్తత్వాన్ని ప్రజలు నిశితంగా గమనించారు. సంస్కారం అన్నది విమర్శలలో కాదు ఆచరణలో కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించటంలో మరోసారి నిరూపితమైంది.

రాజకీయాలు తాత్కాలికం. ఉద్యమాలు కాలపరిమితం. కానీ కళాకారులకు గౌరవం ఇవ్వటం అన్నది, ప్రజలల్లో హృదయాల్లో మాత్రం శాశ్వతం. అదే ఆంధ్రుల బలం. అదే నిజమైన రాజకీయ పరిపక్వత. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని అటు గద్దర్ అభిమానించే తెలంగాణా సమాజమే కాదు, ఇటు కళాకారులకు పుట్టిల్లుగా ఖ్యాతి గాంచి, వారికి తగిన గౌరవమిచ్చే ఆంధ్ర సమాజం కూడా హర్షం వ్యక్తం చేస్తుంది.

ఇదే సందర్భంలో, జనజీవనంలో కలుస్తున్న మావోయిస్ట్లకు ఉపాధి కల్పించాల్సిందిగా గద్దర్ కుమార్తె వెన్నెల చేసిన వినతిపై కూడా చంద్రబాబు సానుకూలంగా స్పందించడం ప్రస్తావించాల్సిన అంశమే.

×