ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పాలన : మంత్రులు–కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం

అమరావతి, ఫిబ్రవరి 9: అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళ్తోందని, వాటి అమలులో అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తి బాధ్యతతో పని చేయాలని సీఎం ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాకులో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖల పనితీరుపై విస్తృతంగా చర్చించారు. 2026–27లో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు కార్యాచరణపై సీఎం కీలక దిశానిర్దేశం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్ వినియోగంపై కూడా సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా హాజరయ్యారు.

నెలవారీ సమీక్షలతోనే ఫలితాలు

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాలను నెలవారీగా సమీక్షించుకోవాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని బేరీజు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నెలా రెండు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ, ఎస్ఐపీబీ ద్వారా ప్రాజెక్టులకు వేగంగా ఆమోదాలు ఇస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంచార్జ్ మంత్రులు కూడా అదే వేగంతో పనిచేయాలని సూచించారు.గత 19 నెలల్లో రాష్ట్రాన్ని అగాధం, అంధకారం నుంచి బయటకు తీసుకువచ్చామని, వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టామని సీఎం వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

సంక్షేమ పథకాలు అవసరమే

‘సూపర్ సిక్స్’ పథకాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందాయని సీఎం తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా రూ.10 వేల కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. స్త్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాల వల్ల ఇప్పటివరకు 4.29 కోట్ల ప్రయాణాలు జరిగాయని తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.6,310 కోట్ల ఆర్థిక సహాయం అందించామని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రూ.58 వేల కోట్ల మేర చేయూత ఇచ్చామని పేర్కొన్నారు. పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమేనని స్పష్టం చేశారు.

రైతు, గ్రామీణ అభివృద్ధిపై దృష్టి

రాయలసీమలో హార్టికల్చర్ హబ్, కోస్తా ప్రాంతాల్లో ఆక్వా కల్చర్ అభివృద్ధికి చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. రైతు ఆత్మహత్యలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. రూ.1,100 కోట్ల మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామని, ధాన్యం కొనుగోళ్లకు రూ.10 వేల కోట్లను 48 గంటల్లోనే చెల్లించామని వెల్లడించారు.రాజముద్రతో కూడిన డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాలను క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లతో రైతులకు అందిస్తున్నామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటివరకు రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

పరిశ్రమలు, టెక్నాలజీ, పెట్టుబడులు

అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేసినట్టు సీఎం తెలిపారు. విశాఖలో గూగుల్‌తో పాటు ఇతర సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయని, మొత్తం 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు రాబోతున్నాయని చెప్పారు. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా తయారీకి కార్యాచరణ ప్రారంభమైందన్నారు.175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, రూ.20 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 23 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్టు వెల్లడించారు.

విద్య, ఆరోగ్యం, మానవ వనరుల అభివృద్ధి

మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేశామని సీఎం తెలిపారు. 5,757 మంది కానిస్టేబుళ్ల నియామకం పూర్తి చేసి, వారి స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచినట్టు చెప్పారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్‌కేర్ అమలు చేస్తామని, యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య భీమా కల్పిస్తామని ప్రకటించారు.పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా విద్యా విధానం ఉండాలని సూచించారు.

పాలనలో వేగం పెరగాలి

పాలనలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ రావాలని సీఎం అధికారులను కోరారు. అవుట్‌డేటెడ్, అవసరం లేని చట్టాలను సమీక్షించి సరళీకరించాలన్నారు. టెక్నాలజీని భూతంలా కాకుండా ఫ్రెండ్లీగా ఉపయోగించుకోవాలని, వాట్సాప్ గవర్నెన్స్‌ను మరింత విస్తరించాలని సూచించారు.

టీమ్ స్పిరిట్‌తో లక్ష్య సాధన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పడిందని సీఎం తెలిపారు. అంతా టీమ్ స్పిరిట్‌తో పని చేసి, 2026–27లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

×