కళ్లకు, చర్మానికి, రోగనిరోధకశక్తికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్ ఇదే ?

Foods rich in Vitamin A : శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం విటమిన్ ఎ. దీనిని రెటినాల్ అని కూడా పిలుస్తారు. కంటి చూపు మొదలు రోగనిరోధక శక్తి , చర్మం ఆరోగ్యానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. కొవ్వులో కరిగే విటమిన్ గా దీనికి పేరుంది. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా సహజ రక్షణ వ్యవస్ధగా పనిచేయడానికి సహాయపడుతుంది. ముక్కుతోపాటు శరీరంలోని మరికొన్ని సున్నితమైన భాగాల్లో చర్మం పొరను రక్షించటంలో సహాయపడుతుంది. విటమిన్ ఎ క్యారెట్లు, బచ్చలికూర, గుడ్లు,పాల ఉత్పత్తులు వంటి అనేక రకాల ఆహారాలలో పుష్కలంగా దొరకుతుంది.

చికెన్ లివర్, మటన్ లివర్ వంటి వాటిల్లో విటమిన్ ఎ ఎక్కువగా లభిస్తుంది. అయితే గర్భంతో ఉన్న వారు విటమిన్ ఎ తోకూడిన ఆహారాలను ఎక్కువగా తీసుకోరాదు. బీటా కెరోటిన్ ఆహారాలను తీసుకోవటం ద్వారా విటమిన్ ఎని పొందవచ్చు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ కూరగాయలు, పాలకూర, క్యారెట్లు, చిలగడదుంపలు,ఎర్ర మిరియాలు వంటి వాటితోపాటుగా మామిడి, బొప్పాయి, నేరేడు పండు వంటి పసుపు పండ్లలో అధికంగా లభిస్తుంది.

రోజుకు సగటున 1.5 mg కంటే ఎక్కువ విటమిన్ A తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. అలా తీసుకుంటే ఎముకల పై తీవ్రప్రభావం పడే అవకాశం ఉంటుంది. పెద్దవయస్సు వారిలో ఎముకలు పెళుసుగా మారి విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మల్టీవిటమిన్ మాత్రలలో విటమిన్ ఎ ఉంటుంది. అలాగే ఫిష్ లివర్ ఆయిల్ వంటి ఇతర సప్లిమెంట్లలో కూడా విటమిన్ ఎ ఎక్కువగానే ఉంటుంది. ఆహార రూపంలో విటమిన్ ఎ తీసుకునే వారు విటమిన్ ఎ ఉన్న సప్లిమెంట్ తీసుకోకపోవటమే మంచిది.

మోనోపాజ్ దశకు చేరుకున్నమహిళలు, అలాగే ఆస్టియోపోరోసిస్ తో బాధపడుతున్న వృద్ధులు రోజుకు 1.5mg కంటే ఎక్కువ విటమిన్ A తీసుకోరాదు. పునరుత్పత్తిలో విటమిన్ ఎ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. విటమిన్ ఎ లోపం వల్ల పిల్లలలో పెరుగుదల ఉండదు. విటమిన్ ఎ లోపం కారణంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనమై ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది.

×