
*బలమైన ఆర్థిక వనరు జనాభానే
*జనాభా నిర్వాహణకు ఉత్తమ పాలసీలు అమలు
*ప్రభుత్వ ఆఫీసుల్లో చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం
*జనాభా ఎక్కువ ఉన్న దేశాలపై ప్రపంచం ఆధారపడే పరిస్థితి
*ఖర్చులు పెరగడం, ఆదాయం లేకపోవడం పెరుగుదలకు సమస్య
*నాడు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించా.. నేడు జనాభా నిర్వహణ అవసరమని చెబుతున్నా
*భవిష్యత్తులో మానవ వనరులు కొరత రాకుండా ఉండాలంటే.. రాష్ట్రంలో ఫెర్టిలిటి రేట్ పెరగాలి
-ప్రపంచ జనాభా దినోత్సవం అమరావతి సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి:- దేశానికి బలమైన ఆర్థికవనరు జనాభేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జనాభా పెరుగుదలకు త్వరలో మంచి పాలసీ తీసుకొస్తామన్నారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని చెప్పిన గురజాడ అప్పారావు స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివాలయం వద్ద ప్రపంచ జనాభా దినోత్సవంపై మొదటి అమరావతి సమ్మిట్‌కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనాభా నిర్వహణా విధానం ప్రతి కుటుంబం ముఖ్యం-మీ అభిప్రాయం మార్గదర్శనం అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన సర్వేను సీఎం ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రత్యుత్పత్తి రేటు పెరగాలి :
సమైక్యాంధ్రలో జనాభా నియంత్రణను ఉద్యమంలా చేపట్టామని, ఇప్పుడు జనాభా నిర్వహణ అవసరమని చెబుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అగ్రదేశాలతో భారత్ పోటీ పడుతోందంటే దానికి జనాభానే కారణమని అన్నారు. 2004కు ముందు సీఎంగా ఉన్నప్పుడు జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలు ఇచ్చాను. ఇద్దరు పిల్లల కంటే ఎక్కుమంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని చేస్తూ చట్టాన్ని తెచ్చాను. ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులుగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది.
మన బలం మానవ వనరులు :
ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారు. కానీ జనాభా ఉన్న దేశాలవైపే అగ్రరాజ్యాలు చూడాల్సి వస్తోంది. జనాభా ఎప్పటికీ భారం కాదు…అదే మనకు తిరుగులేని ఆస్తి. ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో అభివృద్ధి సాధ్యమా అనే పరిస్థతి నుంచి ఆ జనాభానే మనకు అడ్వాంటేజ్‌గా మారింది. 140 కోట్ల జనాభా కలిగి ఉన్న మన దేశం చైనాను కూడా వెనక్కు నెట్టింది’ అని ముఖ్యమంత్రి అన్నారు.
యువశక్తి తగ్గి…వృద్ధులు పెరుగుతున్నారు :
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జనాభాతో పాటు జననాల రేటు తగ్గిపోతోందని , యువశక్తి తగ్గిపోయి వృద్ధులు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఏ దేశంలోనైతే వయోజన సమస్య వస్తుందో అక్కడ వృద్ధిరేట్ నిలిచిపోతుంది. భవిష్యత్‌లోనూ సమస్యలు వస్తాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సంతానోత్పత్తి రేట్ పడిపోతోంది. జనాభా సమతుల్యత సాధించాలంటే 2.1 రేట్ ఉండాలి. అప్పుడే జనన మరణాలు సమతుల్యంగా ఉంటాయి’ అని సీఎం వివరించారు.
ఖర్చులు పెరుగుతున్నాయని పిల్లల్ని కనడం లేదు :
జనాభా తగ్గిపోతే వృద్ధి రేటు పడిపోతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదలపై సమావేశంలో పోల్ నిర్వహిస్తే ఇద్దరు పిల్లలుండాలని 67.41 శాతం మంది, ఒకరే ఉండాలని 12.34 శాతం మంది, ముగ్గురు పిల్లలుండాలని 19.88 శాతం మంది అభిప్రాయపడ్డారని వివరించారు. పిల్లలను కనడానికి యువత ఆస్తకి చూపడం లేదని, చాలా మంది భార్యాభర్తలు పిల్లలను వద్దనుకునే పరిస్థితికి వచ్చారని అన్నారు. ఖర్చులు పెరుగుతాయని పిల్నల్లి కనడానికి ఇష్టపడటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి :
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, రానురాను అవి కనుమరుగవుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘గత కొన్నేళ్ల వరకు ఇంట్లో ప్రతి ఒక్కిరికీ 5 కేజీల చొప్పున బియ్యం ఇచ్చేవాళ్లం. ఐదుగురు ఉంటే 25 కేజీలు ఇచ్చేవాళ్లం. అంతకంటే ఎక్కువమంది ఉంటే బియ్యం ఇచ్చేవాళ్లం కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక కుటుంబంలో పది మంది ఉన్నా 50 కేజీల కంటే ఎక్కువ ఇచ్చేదానిపై ఆలోచిస్తున్నాం. దక్షిణ భారత దేశంలో జనాభా తగ్గిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్‌లో పార్లమెంటు సీట్లు పెరుగుతాయి.. కానీ దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలకు సీట్లు తగ్గిపోతాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. ’ అని అన్నారు.
మహిళల కష్టాన్ని గుర్తించాం..
తాను మహిళా పక్షపాతిని, కొందరు మగవాళ్లు ఇంటి బాధ్యత అంతా ఆడవాళ్లదే అన్నట్టు వ్యవహరిస్తారని, అది సమంజసం కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆడ, మగ ఇద్దరూ సమానమేమనని, మగవారితో సమానంగా మహిళలు పనిచేస్తున్నారని అన్నారు. ‘సాఫ్ట్ వేర్ రంగంలో భర్తల కంటే భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది. మహిళా శక్తి గుర్తించి న్యాయం చేసిన టీడీపీ. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. మహిళా యూనివర్సిటీ పెట్టారు. ఇంటికే పరిమితమైన మహిళల కోసం నేను డ్వాక్రా, మెప్మా సంఘాలు పెట్టి ఆర్థిక చేయూత అందించాను. నా తల్లి కట్టెల పొయ్యిపై వంట చేసేప్పుడు పడిన కష్టం చూసి ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదని దేశంలోనే మొదటిసారిగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. మహిళలకు కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. ఆర్టీసీ కండక్టర్లుగా నియమించాం.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.
సభికులతో ముఖాముఖి..
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తొలి సదస్సుకు వచ్చిన వారితో ముఖ్యమంత్రి కాసేపు మాట్లాడారు. జనాభా నిర్వహణపై వాళ్ల అభిప్రాయాలు అడిగారు. ఈ క్రమంలో కొందరు తమ అభిప్రాయాలు చెప్పడంతో పాటు.. కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. పిల్లలను కనే వరం భగవంతుడు మహిళలకు ఇచ్చాడు.’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, మైనా మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సుహానీ జలోటా, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఎమ్.ప్రకాశమ్మ, ప్రొఫెసర్ సంజయ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.