
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల స్థాయి దిగజారుతున్న కొద్దీ, ప్రజాస్వామ్య విలువలు కూడా అంతే వేగంగా క్షీణిస్తున్నాయన్న ఆందోళన రాజకీయ వర్గాల్లో నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, వాటి తరువాత చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు ఇవన్నీ ఒక వ్యక్తి ఆవేశ పూరిత వ్యాఖ్యల ఫలితమేనన్న అభిప్రాయం అందరిలో ఉంది. ఇది ఒక రాజకీయ పార్టీ సంస్కృతికి ప్రతిబింబమా? లేక ఆ సంస్కృతికి నాయకత్వం వహిస్తూ ప్రొత్సహిస్తున్న అధినేత వైఖరికి నిదర్శనమా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
తొలి నుండి వైసీపీ అనుసరిస్తున్న రాజకీయ వైఖరిని గమనిస్తే, ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం, అసభ్య పదజాలంలో సంయమనం కోల్పోవడం, ప్రజాసమస్యల వంటి అంశాల కంటే వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం వారికి ఆనవాయితీగా మారిపోయింది. ఈ ఆనవాయితీ అంబటి రాంబాబుతో మొదలుకాలేదు, ఆయనతో ముగియదు కూడా….. పార్టీ నేతల మాటల్లో కనిపిస్తున్న దూకుడు వెనుక అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరే అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లో మౌనం కూడా ఒక సందేశమే. ముఖ్యంగా పార్టీ అధినేత స్థాయిలో ఉండి, అంబటి చేసిన వ్యాఖ్యలపై స్పందించకపోవడం చూస్తుంటే ఇదే మా రాజకీయ పద్ధతి అన్న అర్థాన్ని ఇచ్చినట్లని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంబటి వ్యాఖ్యలపై పార్టీ అంతర్గతంగా ఎలాంటి హెచ్చరికలు చేయకపోవటం, కనీసం ఆపార్టీ నేతల్లో ఆత్మపరిశీలన కనిపించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది.
ఇక్కడ మరో కీలక కోణం రాంబాబు ఎపిసోడ్ లో దాగుందనే చెప్పవచ్చు. తిరుమల లడ్డూ వ్యవహారం వైసీపీని రాజకీయంగా ఇబ్బంది పెట్టింది. ఈనేపధ్యంలోనే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రజల మందు దోషిగా నిలబడ్డ వైసీపీ అదే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఉద్దేశపూర్వకంగా అంబటి చేత ఈ వ్యాఖ్యలు చేయించిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చిన్న గీత చెరపాలంటే మరో పెద్దగీత గీయటం…ఇష్యూను డైవర్ట్ చేయటానికి మరొక పెద్ద ఇష్యూను సృష్టించటం అన్నది వైసీపికి వెన్నతో పెట్టిన విద్య. ఆ వ్యూహంలో భాగంగానే అంబటి చేత వ్యాఖ్యలు చేయించారా? అన్న సందేహాలు కలగటం సహజమే. గత అనుభవాలు చూస్తే, వివాదాల నుంచి తప్పించుకునేందుకు వైసీపీ కొత్త వివాదాలను ఆయుధంగా మార్చుకోవడంలో ధిట్ట అన్న విమర్శలు కొత్తేమి కాదు.
అయితే, ఈ తరహా వ్యూహాలు తాత్కాలికంగా అజెండాను మార్చగలిగినా, దీర్ఘకాలంలో పార్టీకి లాభం చేకూరుస్తాయా? అన్నది అసలు ప్రశ్న. వ్యక్తిగత రాజకీయ విమర్శల, వింత పోకడలు ప్రజాస్వామ్యంలో ప్రమాదకర సంకేతాలుగా చెప్పుకోవాలి. అవి రాజకీయాలను మరిత దిగజారుస్తాయి, హింసకు దారితీస్తాయి. చివరికి ప్రజల్లో రాజకీయ వ్యవస్థపైనే విరక్తిని పెంచేస్ధాయి వెళతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్టిమేట్ గా వాటి పర్యవసానాలు ఏ పార్టీ అయినా చివరికి మూల్యం చెల్లించక తప్పదు.
ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఈ దశలో ప్రజల్లో సానుభూతి, విశ్వాసం సంపాదించాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో దూకుడు మాటలు, వివాదాస్పద వ్యూహాలు పార్టీపై ప్రజల్లో సింపతీ క్రియేట్ చేయటనాకి బదులు బాధ్యతలేని, ప్రమాదకరమైన రాజకీయ పార్టీగా, చిత్రీకరించే ప్రమాదం ఉంది. అధినేత ఎలా ఉంటే, నేతలు అలాగే ఉంటారు అన్న సామెత పదేపదే నిజమవుతుంటే, అది వైసీపీకి దీర్ఘకాలంలో మైనస్‌గా మారే అవకాశం ఉంది.
మాటలు రాజకీయ ఆయుధాలే. కానీ ఆ ఆయుధాలను అదుపు లేకుండా వాడితే, ఒక్కో సందర్భంలో పార్టీ చేతిలోనే పేలుతాయి. అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఒక వ్యక్తి అహంకార ఫలితమా? లేక పార్టీ స్థాయి వ్యూహమా? అన్నది పక్కనపెడితే, ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఈ పరిణామాలు వైసీపీ రాజకీయ దిశను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇప్పటికైనా పార్టీ ఆత్మపరిశీలనకు సిద్ధపడుతుందా? లేక ఇదే మాటల రాజకీయాలను కొనసాగిస్తుందా? అన్నదే రాబోయే కాలంలో వైసీపీ భవిష్యత్తును నిర్ణయించనుంది.