అంబటిది మాటల అహంకారమా… రాజకీయ వ్యూహమా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంబటి రాంబాబు గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పేరు వినగానే వివాదాలకు, నోటిదూలతనానికి కేరాఫ్ అడ్రస్ గా ఎవరిని అడిగిన చెప్పేస్తారు. ఆయన మాటల శైలి, వ్యాఖ్యల తీవ్రత, ప్రత్యర్థులపై దూకుడు స్వభావం ఇవన్నీ తొలినుంచే ఆయనను వార్తల్లో నిలిపాయని చెప్పుకోవాలి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, వాటి అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు మాత్రం అంబటి రాంబాబు రాజకీయ జీవితంలో చూసి ఉండరని చెప్పొచ్చు.

రాజకీయాల్లో విమర్శలు సహజమే. కానీ విమర్శలకు, వ్యక్తిగత దూషణలకు మధ్య ఉన్న సరిహద్దును అంబటి తరచూ దాటుతున్నారన్న అభిప్రాయం ఆయన సొంత పార్టీలోనే ఎప్పటినుంచో వినిపిస్తోంది. నోరు ఉంది కదా అని ఎవరి మీదైనా మాట్లాడొచ్చు అన్న అహంకార ధోరణి ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించేది. తాను ఏం మాట్లాడినా తనను ఎవరు ఏమి చేయలేరన్న భావన, తాను న్యాయవాదిని చట్టంలో ఉన్న లొసుగులు అన్నీ అవపోసన పట్టానన్న అహంభావం ఆయనలో బలంగా ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ఆయన పదునైన మాటలతో రాజకీయ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతూ , ఎదుటి వారిని కించపరిచేవిధంగా, వెటకారంగా మాట్లాడతారన్న విమర్శలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు టిడిపి శ్రేణులను తీవ్ర అగ్రహావేశాలకు గురిచేశాయి. పార్టీ అధినేతపై వ్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యలను వారు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఫలితంగా అంబటి ఇంటిని చుట్టుముట్టడం, నివాసం, కార్యాలయం, కార్లు, ఫర్నీచర్ ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అరెస్టు సమయంలో గుడ్లు, రాళ్లు విసరడం పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో స్పష్టమౌతుంది. అంబటి లాంటి వ్యక్తులు చట్టసభల్లో అనేక పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉండీ, రాజకీయాల్లో పరిణితి చెందిన నేతగా వ్యవహరించకుండా, గలీజు మాటలతో చిల్లర వ్యక్తిగా వ్యవహరించటం ప్రజాస్వామ్యంలో ఆందోళనకరమైన పరిణామమేనని ప్రజలు భావిస్తున్నారు.

కానీ ఈ ఘటన మొత్తం ఒక కోణంలో మాత్రమే చూడలేము. ఎందుకంటే ఇక్కడ అసలు కీలకమైన ట్విస్ట్ వైసీపీ అంతర్గత రాజకీయాల్లో దాగుందనే చెప్పుకోవాలి. గతంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటికి వ్యతిరేకంగా పనిచేసిన వర్గం, ప్రస్తుతం వైసీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న బార్గవ రెడ్డి అనుచరులే అంబటి కార్యాలయం, కారుకు నిప్పు పెట్టినట్టు వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారింది. కర్ణుడి చావుకు సవాలక్షా కారణాలన్నట్టు అంటి ఇంటిపై దాడి వ్యవహారం ఆయన సొంత పార్టీలోని ప్రత్యర్ధులకు కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. సొంతపార్టీలో ఉన్న వర్గపోరు, ఆధిపత్య పోరు ఈ హింసాత్మక ఘటనలకు మరింత కారణమైందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

సత్తెనపల్లి ఎమ్మెల్యేగా అంబటి ప్రాతినిద్యం వహించిన సమయంలో అక్కడి వైసీపీ రాజకీయాలు ఎప్పటినుంచో వర్గ విభేదాలతో నిండిపోయాయి. అక్కడి రెడ్డి సామాజిక వర్గం గత ఐదేళ్ళ కాలం అంబటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. తన ప్రాభవం కోసం అంబటి రాంబాబు అక్కడి రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా ఎదగకుండా ఉక్కుపాదం మోపటం కూడా ఆసామాజికవర్గం అంబటిపై కక్ష పెంచుకోవటానికి కారణమనే చెప్పాలి. అంబటి రాజకీయ వైఖరితో విసుగుచెందిన అసంతృప్తి వర్గాలు, సరైన సమయం కోసం ఎదురు చూడసాగాయి. నిన్నటి పరిణామాలతో టిడిపి క్యాడర్ అంబటి ఇంటి వద్ద చేస్తున్న ఆందోళన కార్యక్రమాలను అవకాశంగా మలుచుకున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అంబటి చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రత్యర్థులకు మాత్రమే కాదు, సొంత పార్టీలోని అసంతృప్త వర్గాలకు కూడా ఆయుధంగా మారాయన్న వాదన వినిపిస్తోంది. మాటల నియంత్రణ లేకపోవడం, నాయకత్వ స్థాయిలో సంయమనం పాటించకపోవడం రాజకీయాల్లో ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఈఘటనతో ఒక విషయం మాత్రం స్పష్టమైంది. రాజకీయాల్లో మాటలు కూడా ఆయుధాలే. ఆమాటల వాడుకను బట్టే ఫలితాలు ఉంటాయి. అంబటి రాంబాబు విషయంలో ఆ మాటలే ఇప్పుడు ఆయనకు రాజకీయంగా మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఈ పరిణామాల తర్వాతైనా ఆయన తన రాజకీయ శైలిని మార్చుకుంటారా? లేక ఇదే దూకుడు కొనసాగిస్తారా? అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.

×