శ్రీశైలం వద్ద వింత గ్రామాలు…వాటి పేర్లు అలా ఎందుకు పెట్టారు?

పవిత్రమైన శైవక్షేత్రం శ్రీశైలం…ఈ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఈ రెండు గ్రామాల పేర్లు వినటానికి వెరైటీగా ఉంటాయి. అవే ఈగల పెంట, దొమల పెంట గ్రామాలు. నల్లమల అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అనేక గ్రామాలకు చివరన పెంట అనే పదం కామన్ గా ఉంటుంది. బహుశ గిరిజన జాతి ఉచ్ఛారణలో పెంట అంటే గ్రామం అన్నమాట. అయితే తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలానికి సమీపంలో ఉన్న ఈగల పెంట, దోమల పెంట పేర్లు మాత్రం కొంచెం ఆసక్తిని కలిగిస్తాయి. రాష్ట్ర విభజన తరువాత ఈ రెండు గ్రామాలు తెలంగాణా పరిధిలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోకి వెళ్ళాయి.

ఈగల పెంట, దోమల పెంట పేర్లు ఎలా వచ్చాయి;

ఈగల పెంట ;

ఈగల పెంట అనేది శ్రీశైలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది. గుబురైన చెట్లతో కూడిన అటవీ ప్రాంతం కావటంతో తేమ అధికంగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో ఈగలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని గిరిజన కుటుంబాలు అక్కడ నివాసం ఉండేవి. అయితే ఆప్రాంతానికి టూరిజంలో భాగంగా వెళ్ళేవారు అక్కడి ఈగల బెడదను తట్టుకోలేకపోయేవారు. ఈ పెంటలో (అంటే గ్రామం) ఈగల గోలేంటిరా బాబు అంటు విసుగు చెందేవారు. అయితే గిరిజనులు మాత్రం ఈగల బెడద ఉన్నప్పటికీ తమకు జీవనాధారమైన అడవి తోపాటు పుష్కలంగా నీటి సౌకర్యం ఉండటంతో వారు అక్కడే ఉండటానికి ఇష్టపడ్డారు. అలా కాల క్రమంలో ఈగల పెంటగా ఆ గ్రామానికి పేరు పడింది.

దోమల పెంట ;

దోమల పెంట కూడా నల్లమల అటవీ ప్రాంతంలో ఈగల పెంటకు సమీపంలోనే ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతం కావటం గుబురైన చెట్లతో నిండి ఉండటంతో నేలలో తేమ అధికంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న చెరువులు కారణంగా దోమలు ఎక్కువనే చెప్పాలి. నీటి సౌకర్యం ఉండటంతో దోమలు అధికంగా ఉన్నా గిరిజనలు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని తరాలుగా నివశిస్తున్నారు. ఆగ్రామానికి వెళ్ళేవారు దోమల బెడద కారణంగా రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టక ఇబ్బందులు పడేవారు. ఇలా ఆగ్రామానికి దోమల పెంటగా పేరు పడింది.

గ్రామాల పేర్లు విచిత్రంగా ఉన్న అక్కడి ప్రజల జీవనశైలి మాత్రం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో వారి జీవితం గడిచిపోతుంది. సంప్రదాయ వృత్తులను కొనసాగిస్తూ వేటాడటం, వన మూలికలు, పండ్లు సేకరించటం వంటివి ఈ గ్రామస్తుల జీవనాధారం. శ్రీశైలం వెళ్ళేవారు ఈగ్రామాల మీదగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆగ్రామాల మీదగా వెళుతున్న సమయంలో అక్కడ ఈగల పెంట, దోమల పెంట, సున్నిపెంట ఇలా గ్రామాల పేర్లు దర్శనమిస్తుంటాయి. ఈగల పెంట, దోమల పెంట బోర్డులు కనిపించిన వెంటనే ఇవేం పేర్లు రా బాబు..అని చాలా మంది అనుకుంటుంటారు. పెట్టటానికి పేర్లేవి దొరకనట్లు వీరు ఇలాంటి పేర్లు పెట్టుకున్నారెందుకు అన్న ప్రశ్న కూడా అందరిలో ఉదయిస్తుంది.

ఈ రెండుగామాల పేర్లను మార్చిన తెలంగాణా ప్రభుత్వం

అయితే ఎన్నో ఏళ్ళుగా పిలుస్తున్న ఈగల పెంట, దోమల పెంట గ్రామాల పేర్లను మార్పు చేస్తూ తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పవిత్రమైన శ్రీశైలం సమీపంలో ఉన్న ఈ గ్రామాల పేర్లు అక్కడికి వచ్చే టూరిస్టులు, యాత్రికులకు కొంచెం ఎబ్బెట్టుగా కనిపిస్తుండటంతో ఎప్పటి నుండే ఈ గ్రామాల పేర్లు మార్పు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే ప్రస్తుతం తెలంగాణా సియం గా ఉన్న రేవంత్ రెడ్డి ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాకు చెంది ఉండటంతో ఈపేర్లు మార్చాలన్న ఆలోచన చేశారన్న వాదన వినిపిస్తుంది. ఈ రెండు గ్రామాలు ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.

దోమల పెంటను బ్రహ్మగిరిగా, ఈగల పెంట ను కృష్ణ గిరిగా :

తెలంగాణా పంచాయితీ రాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామాలకు పేర్లు మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఆమేరకు దోమల పెంటను బ్రహ్మగిరిగా, ఈగల పెంట ను కృష్ణ గిరిగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్న ఈ గ్రామాల పేర్లను దేవుళ్ళ పేర్లతో ఉచ్ఛరించే విధంగా నామకరణం చేయటం పట్ల హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ పేర్లు పర్యాటకంగా టూరిస్టులను మరింత ఆకట్టుకునేందుకు దోహదం పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

×