ఆ పేరు ఎత్తేందుకే భయపడుతున్న ఎమ్మెల్యేలు , మంత్రులు?…ఏపి ప్రజల్లో పెరుగుతున్న భయాందోళన?

Fear of Jagan : 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితంచేసి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు. అధికారం కోల్పోయినా తన నిరంకుశ వైఖరిలో ఏమార్పుతెచ్చుకోని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికార దాహాంతో పరితపిస్తున్నాడు. తిరిగి అధికారంలోని ఎలాగైనా రావాలన్న అకాంక్షతో ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వస్తున్నాడు. అధికార కూటమిపై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేస్తున్నారు. అలాగే పాలనలో కీలకమైన పోలీసు, అధికార యంత్రాంగాన్ని బెదిరించే విధంగా అనుసరిస్తున్న వైఖరి ఏపి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

జగన్ మాటలతో ప్రజల్లో కల్లోలం ;

మళ్లీ తాను అధికారంలోకి వస్తానంటూ జగన్ వ్యాఖ్యలు, ఆయన గత పాలనను అనుభవించిన ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చోటు చేసుకున్న అకృత్యాలు, అభివృద్ధి ముసుగులో కక్షసాధింపులు, రాజకీయ వేధింపులు ప్రజలు మరవలేకపోతున్నారు. అప్పట్లో ప్రజలు తామ బాధలను స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్ధితి కూడా ఉండేది కాదు. ఒక వేళ ధైర్యం చేసి నోరు విప్పితే తప్పుడు కేసులు నమోదు చేయటంతోపాటు, వేధింపులకు గురిచేసి చివరకు బలవన్మరణాలకు పాల్పడే విధంగా హింసించేవారు. ప్రజలు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో ఆనాటి జగన్ పాలన ఉండేది. ప్రస్తుతం జగన్ తాను తిరిగి అధికారంలోకి వస్తానంటూ ప్రకటన చేసినప్పుడల్లా అనాటి అప్రజాస్వామిక పాలనను గుర్తు చేసుకుని వణికి పోతున్నారు. జగన్ వ్యాఖ్యలు వింటుంటేనే తమ వెన్నులో వణుకు పుట్టుతోందని పలువురు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల మౌనం ఎందుకు ?

జగన్ చేస్తున్న ప్రకటనలు, విమర్శలపై కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు గట్టిగా స్పందించకపోవడం ప్రస్తుతం పార్టీ క్యాడర్‌లో అసంతృప్తికి దారి తీస్తోంది. జగన్ పేరు ఎత్తటానికి కూడా కొందరు ఎమ్మెల్యేలు భయపడుతున్నారన్న ఆరోపణలు సొంత శిబిరం నుంచే వస్తున్నాయి. వైసీపి అరాచకపాలకు చరమగీతం పాడేందుకు తెలుగుదేశం, జనసేన, బిజెపి క్యాడర్ అనాటి వైసీపీ ప్రభుత్వ కేసులు, వేధింపులకు భయపడకుండా తెగువచూపి పోరాటపఠిమను ప్రదర్శించారు. పార్టీ అధినాయకత్వం అదేశాను సారం గత ఎన్నికల్లో తమ పార్టీలు సిట్లు ఇచ్చిన అభ్యర్ధులను ఎమ్మెల్యేలుగా గెలించుకునేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైసీపికి ఎదురు నిలిచారు. అయితే అలాంటి వారు సైతం తమ పార్టీల ఎమ్మెల్యేలు జగన్ అంతలా రెచ్చిపోతున్నా కనీసం ఆయన చేస్తున్న విమర్శలకు ధీటుగా స్పందించకపోవటంపై మండిపడుతున్నారు. కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సమాధానం ఇవ్వటం లేదన్న విమర్శలు సొంత పార్టీల క్యాడర్ నుండే వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. తిరిగి తాను అధికారంలోకి వస్తానని ఒకవైపు చెప్తుండటంతో ఆయా పార్టీల క్యాడర్ కూడా ఒకింత భయాందోళన చెందుతున్నారు. గత ఐదేళ్ళ పాలనలో తాము అనుభవించిన కష్టాలు మర్చిపోలేక ఒకవేళ తిరిగి జగన్ అధికారంలోకి వస్తే తమ పరిస్ధితి ఏంటా అన్న ఆలోచనలో పడ్డారు. లీడర్లే కే పట్టకపోతే క్యాడర్ గా మేము మాత్రం ఏంచేస్తామన్న నిట్టూర్పులు వినిపిస్తున్నారు.

చంద్రబాబు పాలనపై ప్రజల ఆశలు…జగన్ ప్రకటనలతో ప్రజల్లో భయాందోళనలు

చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావడంతో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉందని ఆశపడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు పాలనను గాడిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు, రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు రాత్రింపగలు కష్టపడుతున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. జగన్ పాలనలో నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణంతోపాటు, పోలవరం వంటి అనేక ప్రాజెక్టులను తిరిగి పట్టాలెక్కించటం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విభజన తరువాత దిక్కులేని రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుపుతారన్న భరోసాతో ఉన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గత వైసీపీ పాలనలోని ఆగడాలకు చెక్ పెడతాననే నమ్మకాన్ని కలిగించారు.

అయితే జగన్ ప్రస్తుం చేస్తున్న రాజకీయ వ్యాఖ్యల్లో ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు మా బ్రతుకులు బాగు చేసి రాష్ట్రంలో పాలన గాడిలో పెడతాడని , అలాగే సైకోల ఆగడాలకు కళ్ళేం వేస్తాడని భావిస్తే ఆయన ఆపనిచేయకుండా సైకోలను ఏంచేయాలో ప్రజలే ఆలోచించుకోవాలని అంటుండటం వారికి విచిత్రంగా అనిపిస్తుంది. అధికారం చంద్రబాబు చేతికి ఇస్తే ఆయనేమో ఇలా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ మెడలు వంచటం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వల్ల కావటం లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల్లో కలిగించిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అధికార కూటమి నేతలపైనే ఉంది. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవటానికి కేవలం అభివృద్ధి పనులు చేస్తే సరిపోదు, ప్రజల్లోని భయాందోళనలు పోగొట్టాల్సి అవసరం ఉంది.

జగన్ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాల్సిన సమయం ఇదే ;

ప్రస్తుతం జగన్ చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వకపోతే, ప్రజల్లో సందేహాలు మరింత పెరిగే అవకాశముంది. జగన్ మళ్లీ వస్తానంటూ చేస్తున్న ప్రకటనలపై ధీటైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కూటమి సర్కారు బలమైన పునాదులపై ఉందన్న నమ్మకాన్ని అధికార పక్షం ప్రజల్లో కలిగించాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సమయాత్తమౌతున్న వారంతా ప్రస్తుతం జగన్ వైఖరిని నిశితంగా గమనిస్తున్నారు. పెట్టుబడులు పెట్టాలా వద్దా..పెడితే తమ భవిష్యత్తు ఏవిధంగా ఉంటుందన్న అనుమానాలు వారి మెదడును తొలిచి వేస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలోని నేతలు ధైర్యంగా స్పందించకపోతే, ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని పరిపాలనను సమర్థవంతంగా కొనసాగించడమే కాక, మళ్లీ జగన్ పాలన రాదన్న ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత ఇప్పుడు అధికార పార్టీ నేతలదే.

×