చిట్టిపొట్టి ఆవులు…చూడటానికి భళా…వీటి ధర ఎంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం సమీపంలోని నాడీపతి గోశాలలో చూడటానికి ముచ్చటగా ఉన్న పొట్టి బుజ్జి ఆవులు, ఎద్దులు సందడి చేస్తున్నాయి. ప్రపంచంలోనే అరుదైన జాతి అవుల ఉత్పత్తికి నాడీపతి గోశాల ప్రసిద్ధి గాంచింది. ప్రస్తుతం ఈ ప్రదేశానికి సందర్శకుల తాకిడి అధికమైంది. పొట్టి ఆవుల జాతుల్లో కెల్ల మరింత పొట్టిగా ఉండే ఈ మినియేచర్‌ ఆవులకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

ఇప్పటి వరకు పొట్టి జాతులుగా చెప్పబడే పుంగనూరు ఆవుల ఎత్తు మూడు అడుగుల వరకు ఉంటుంది. అయితే చూడ్డానికి అచ్చం బొమ్మల్లాగే కనిపించే ఈ మినియేచర్‌ ఆవుల ఎత్తు మాత్రం అడుగు, రెండున్నర అడుగులు ఉన్నాయి. నాడీపతి నానో రకమైతే అడుగు ఎత్తులో ఉండగా , మైక్రో మినియేచర్ రెండున్నర అడుగులు ఉన్నాయి. తెలుపు, నలుపు, ఎరుపు, గోధుమ వంటి వివిధ రకాల రంగుల్లో ఈ చిట్టి,పొట్టి ఆవులు చూడ్డానికి ముద్దొచ్చేస్తున్నాయి. సాధారణ ఆవుల మాదిరిగానే పాలు కూడా ఇస్తాయి. ఒక్కో ఆవు ప్రతిరోజు లీటరు మొదలు రెండు లీటర్ల వరకు పాలను ఇస్తున్నాయి.

నాడీపతి వైద్యుడు పెనుమత్స కృష్ణంరాజు పరిశోధన ఫలితం ;

అదే సమయంలో ఈ పొట్టి జాతి ఆవుల జీవిత కాలం సాధారణ ఆవులకన్నా ఎక్కువేనని కాకినాడకు చెందిన నాడీపతి వైద్యుడు పెనుమత్స కృష్ణంరాజు అంటున్నారు. కనుమరుగైపోతున్న పొట్టి జాతి ఆవుల్ని సంరక్షించాలన్న ఆలోచనతో దాదాపు 18 ఏళ్ల క్రితం నాడీపతి వైద్యుడు పెనుమత్స కృష్ణంరాజు పరిశోధనలు మొదలు పెట్టారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి జాతి ఆవుని సృష్టించాలన్నదే ఆయన లక్ష్యం. ఇందుకోసం కాకినాడలోని లింగంపర్తి దగ్గర అయిదు ఎకరాల్లో గోశాలను ఏర్పాటు చేశారు.

తొలినాళ్ళల్లో చిత్తూరుకు చెందిన పుంగనూరు, కేరళ వేచూరు రకాలతోపాటు మల్నాడు గిద్ద, బోనీ, మినీ మౌస్‌ లాంటి రకరకాల పొట్టి జాతులను సేకరించారు. వీటితో బ్రీడింగ్ చేయటం ద్వారా మినియేచర్ ఆవులను పుట్టించాడు. అయితే తన పరిశోధనల్లో చాలా సంవత్సరాల తరువాత మూడు అడుగుల ఉన్న ఆవును అడుగు ఎత్తున్న ఆవును పుట్టించగలిగాడు. దీనికి ముద్దుగా డ్వార్ఫ్‌ ఆవు జాతిగా నామకరణం చేశాడు. దాదాపు 3000 ఆవుల్ని బ్రీడింగ్‌ చేస్తూ ఈ మైక్రో, నానో పొట్టి ఆవుల్నీ, ఎద్దుల్నీ సృష్టించినట్లు ఆయన చెబుతున్నారు.

మైక్రో, నానో ఆవులు అన్ని ప్రదేశాలకు అనుకూలం ;

ఆరుబయటతోపాటు, ఇంట్లోకూడా వీటిని పెంచుకోవచ్చు. వీటిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ…అంతేకాకుండా ఇంట్లో అందరికి త్వరగా మచ్చికవుతాయి. ఈ పొట్టి ఆవుల ధర జత దాదాపు రూ.లక్ష నుంచి పది లక్షల వరకూ ఉంది. ఈ ఆవుల్ని పెంచుకునేందుకు పల్లెవాసులే కాదు ప్రస్తుతం పట్టణ వాసులు ఆసక్తి చూపిస్తున్నారు. చెంగు చెంగున పరుగులు తీస్తున్న ఈ ఆవుల్ని చూసి అందరూ తెగ ముచ్చటపడిపోతున్నారు.

ఆవుల గురించి చరిత్ర ఏంచెబుతుంది ;

ప్రాచీన కాలంలో ప్రతి ఇంట్లో ఒక ఆవు, వ్యవసాయానికి ఒక ఎద్దు తప్పనిసరిగా ఉండేవి. శాస్త్రప్రకారం ఆవు అంటే చంద్రుడు, అలాగే చంద్రుడు అంటే స్త్రీ అని కూడా చెప్తారు. అందువల్ల స్త్రీ ఇంట్లో ఉండాలన్న భావన అనాడు ఉండేది. అలాగే కుక్క అంటే కుజుడు, ఇది రక్షకుడి ప్రాతినిధ్యం. కాబట్టి కుక్క ఇంటి బయట ఉండాలి. అయితే ప్రస్తుత కాలంలో, కుక్కల్ని లోపలికి తెచ్చి, ఆవులను బయటికి పంపించాం మనం.

మినియేచర్ తో మళ్ళీ ఇంట్లోకి ఆవు ;

పురాతన కాలంలో ఇళ్లన్నీ పెద్దవిగా ఉండేవి. ఇప్పుడు ఇళ్లు చిన్నవవడంతో పెద్ద ఆవులను పెట్టడం కష్టంగా మారింది. అయితే ప్రస్తుతం ఈ చిన్నపాటి ఆవులను అభివృద్ధి చేయడంతొ ప్రతి ఇంట్లో, అపార్ట్‌మెంట్‌ల్లో కూడా వీటిని పెంచేందుకు వీలుగా ఉంటుంది. మన పాత సంప్రదాయాన్ని తిరిగి ప్రతి ఇంట్లో తీసుకువచ్చేందుకు ఇది ఒక ముందడుగనే చెప్పాలి.

ఇక చివరిగా చెప్పాలంటే గంగిగోవు పాలూ, గరిటెదైనా చాలు అన్న నానుడి ప్రకారంగా, ఈ చిన్న ఆవుల పాలు తక్కువ మోదాలు ఉన్నప్పటికీ, అవి ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనవి. పొట్టి వాడు గట్టి వాడన్నట్లు ఈ చిన్నపాటి ఆవులకు జీవనకాలం ఎక్కువగా ఉండటంతోపాటుగా అన్ని వాతావరణాలకు ఈ ఆవు సెట్టవుతుంది.

×