
Nimisha Priya Case : ఆమె ప్రాణాలకు చివరి ఘడియలు దగ్గరపడ్డాయి. మరికొన్ని గంటల్లోనే యెమెన్‌లో భారతీయ నర్సు నిమిష ప్రియను ఉరి తీయనున్నారు. బుధవారం నిమిషను ఉరి తీయనున్నారు. భారత ప్రభుత్వం అన్ని రకాలుగా ఆమెను రక్షించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. దీంతో చేసేదేమీ లేక భారత ప్రభుత్వం మౌనం వహించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అయితే ఆమె కుటుంబం మాత్రం నిమిషను రక్షించుకోవడానికి చేయని ప్రయత్నాలు అంటూ లేవు. లాయర్ కారణంగానే పరిస్థితి ఇంత దూరం వచ్చింది.
ప్రస్తుతం నిమిష ప్రియను కాపాడుకునేందుకు ఉన్నది ఒకే ఒక్క దారి. అదే ‘బ్లడ్ మనీ’ అని చెబుతున్నారు. మృతుడి కుటుంబం అడిగినంత డబ్బు ఇస్తే చివరి నిమిషంలోనైనా నిమిషకు ఉరి తప్పే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొన్ని నెలల క్రితమే నిమిష ప్రియ కుటుంబం బ్లడ్ మనీ కింద 10 లక్షల డాలర్లు సిద్ధం చేసింది. అయితే, నిమిష కుటుంబానికి, హతుడి కుటుంబానికి మధ్యవర్తిత్వం వహించిన లాయర్ మోసకారి అవతారం ఎత్తి పెద్ద మొత్తంలో ఫీజు డిమాండ్ చేశాడు. తన ఫీజు చెల్లించే వరకు బ్లడ్ మనీ చర్చలు జరపనని మొడిపట్టుపట్టాడు. దీంతో ఎప్పుడో పూర్తి కావాల్సిన బ్లడ్ మనీ చెల్లింపు వాయిదా పడుతూ వచ్చింది.

ప్రస్తుతం నిమిష ప్రియ కుటుంబం తరపున శామ్యుయెల్ జెరోమ్, షేక్ హబీబ్ హుమర్‌లు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. 10 లక్షల డాలర్లు వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిమిష కుటుంబసభ్యులు హతుడి కుటుంబానికి రాయబారం పంపారు. అయితే, మృతుడి కుటుంబం మాత్రం బ్లడ్ మనీ విషయంలో అంగీకారం తెలుపుతూ ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఉరికి గంటల ముందు హతుడి కుటుంబం బ్లడ్ మనీకి ఒప్పుకుంటుందా లేదా అన్నది ఓ పెద్ద ప్రశ్న. ఆ దేవుడే నిమిషను కాపాడాలంటూ కేరళ వాసులతోపాటు భారతీయులంతా వేడుకుంటున్నారు.