ఢిల్లీ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ

Meeting of Chief Ministers of Telugu States : గోదావరి బనకచర్ల ప్రాజెక్టు (Polavaram-Banachakarla Project) విషయంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ఢిల్లీలో రేపు భేటీకానున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ఇరు రాష్ట్రాల సియం లు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అవుతారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో బుధవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరుగనుంది. దీంతోపాటు ఇతర సమస్యల గురించి కూడా చర్చించనున్నారు. గోదావరి వరద జలాలను ఉపయోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది.. అయితే ఈ ప్రాజెక్ట్‌ను తెలంగాణ వ్యతిరేకిస్తుంది.

సమావేశ వివరాలను కేంద్ర జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కార్యాలయాలకు, సీఎస్‌లకు పంపారు. బనకచర్లతో పాటు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని సూచించారు. తొలుత ఈ సమావేశాన్ని ఈ నెల 11న నిర్వహించాలని అనుకున్నప్పటికీ 16వ తేదీకి వాయిదా వేశారు.. తాజాగా సీఎంలు ఇద్దరూ బుధవారం సమావేశం కావటానికి అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు, నీటి వివాదాల గురించి చర్చించడానికి కేంద్ర జలశక్తి మంత్రి ఛైర్మన్‌గా ఉన్న అపెక్స్ కౌన్సిల్ ఉంది.. రెండు రాష్ట్రాల సీఎంలు దీనిలో సభ్యులుగా ఉంటారు. అయితే, ఈ సమావేశాన్ని అపెక్స్ కౌన్సిల్ సమావేశంగా పరిగణించనున్నట్లు సమాచారం.

గోదావరిలో ప్రతి ఏటా 2,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. ఆ వృధా నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకోవడంలో తప్పేమిటని. ఎగువ రాష్ట్రం తెలంగాణ ఆ జలాలను వాడుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నది ఏపి వాదన. బనచకర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని.. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా ఆంధ్రప్రదేశ్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై రాజకీయం సరైందికాదని ఏపిలోని కూటమినేతలు వాదిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే కీలకమైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(Krishna River Ownership Board)ను విజయవాడకు తరలించే అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం లేకపోలేదు. బనకచర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ , ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రిని కలిసి తమ అభ్యంతరాలను తెలిపారు. బనకచర్లకు పర్యావరణ , కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వొద్దని లేఖలు సమర్పించారు. ఈ తరుణంలో రేవంత్, చంద్రబాబుల భేటి ఆందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది.

×