
మన శరీరానికి నీరు ప్రాణాధారం. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, జీర్ణక్రియ, రక్తప్రసరణ, పోషకాలు కణాలకు చేరడం వంటి ముఖ్యమైన ప్రక్రియలు అన్నీ నీటిపై ఆధారపడుతాయి. అయితే రోజుకు ఎంతమాత్రం నీరు తాగాలి? అన్న ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. వయసు, బరువు, వాతావరణం, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా అవసరం మారుతుంది అని నిపుణులు చెబుతున్నారు.
సాధారణ మార్గదర్శకాలు;
సాధారణంగా పెద్దలు రోజుకు సుమారు 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలని సూచిస్తున్నారు. ఇది సుమారు 8 నుంచి 12 గ్లాసుల వరకు ఉంటుంది. మహిళలు రోజుకు సుమారు 2 నుండి 2.5 లీటర్లు, పురుషులు 3 లీటర్ల వరకు తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
వాతావరణం, శ్రమపై ఆధారపడి మార్పులు;
వేసవి కాలంలో చెమట ఎక్కువగా రావడం వల్ల నీటి అవసరం పెరుగుతుంది. అలాగే కూలీ పనులు చేసే వారు, వ్యాయామం చేసే వారు, క్రీడాకారులు సాధారణ కంటే ఎక్కువ నీరు తాగాలి. శరీరం కోల్పోయే ద్రవాలను తిరిగి భర్తీ చేసుకోవటం అవసరం.
తక్కువగా తాగితే?
నీరు తక్కువగా తాగితే డీహైడ్రేషన్, తలనొప్పి, అలసట, మలబద్ధకం, మూత్రపిండ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలు కూడా రావచ్చు.
ఎక్కువగా తాగితే?
అత్యధికంగా నీరు తాగడం కూడా మంచిది కాదు. ఒకేసారి అధికంగా తాగితే శరీరంలోని ఉప్పుల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి రోజంతా కొద్దికొద్దిగా తాగడం ఉత్తమం.
సరైన విధానం;
ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగడం మంచిది.
రోజంతా 1–1.5 గంటల వ్యవధిలో నీరు తాగాలి.
దాహం వేసే వరకు వేచి ఉండకుండా ముందుగానే తాగడం మంచిది.
మూత్రం లేత పసుపు రంగులో ఉంటే శరీరానికి సరిపడా నీరు అందుతున్నట్లు భావించవచ్చు.
ప్రత్యేక జాగ్రత్తలు ; గర్భిణీలు, వృద్ధులు, కిడ్నీ లేదా గుండె సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు నీటి పరిమాణం నిర్ణయించుకోవాలి.
చివరగా చెప్పేదేంటంటే రోజుకు 8 గ్లాసులు నీరు తాగటం అన్నది సాధారణ సూచన మాత్రమే. వ్యక్తిగత అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగినంత నీరు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సరైన మోతాదులో నీరు తాగడం అనేది ఆరోగ్యకర జీవనశైలిలో మొదటి అడుగు అని వైద్యులు సూచిస్తున్నారు.