
Monsoon Diseases : వర్షాకాలంలో ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. అంతకు ముందు వరకు వేడి వాతావరణం, ఉక్క పోత, అధిక ఉష్ణోగ్రతల్ని దాటుకుని కాస్తా చిరుజల్లులతో సేదతీరుతుంటాం. ఈ వాతావరణం మనసుకి హాయిగా అనిపించినా ఆరోగ్యాన్ని మాత్రం ప్రమాదంలో నెట్టేస్తుంది. ఈ సమయంలోనే మన శరీరంలోని ఇమ్యూనిటీ బలహీనపడుతుంది. వర్షాకాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అనారోగ్య సమస్యల్ని ఎలా దూరం చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ప్రస్తుతం వర్షాల సీజన్ ప్రారంభమైంది. వాతావరణ మార్పుల కారణంగా రోజురోజుకి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ దాడికి గురి చేస్తుంటాయి. అవేంటో చూద్దాం…
వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధులు
జలువు, జ్వరం ; ఈ వర్షాకాలంలో సాధారణంగా వచ్చే సమస్యల్లో జలుబు, జ్వరం కామన్. వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తుంటాయి. వీటి కారణంగా జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. అసలు సమస్య వచ్చిన వెంటనే డాక్టర్‌ని సంప్రదించి చికిత్స తీసుకోవటం ఉత్తమం.
మలేరియా ; వర్షకాలంలో మలేరియా జ్వరాలు అధికంగా ఉంటాయి. వర్షం పడినప్పుడు నీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోయి ఉంటుంది. దీని వల్ల దోమల సంచారం పెరుగుతుంది. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వస్తాయి. అధిక జ్వరం, వణుకు, మరియు చలి, తలనొప్పి, కండరాల నొప్పి,అలసట, వికారం, వాంతులు, విరేచనాలు. వంటి లక్షణాలు కనిపిస్తాయి. దోమల కుట్టకుండా నిద్రించేటప్పుడు దోమతెరలు ఉపయోగించడం, శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచే దుస్తులు ధరించడం, దోమల నివారణ మందులు ఉపయోగించాలి.
డెంగ్యూ ; డెంగ్యూ జ్వరం పెద్ద సమస్యగా మారింది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమవుతుంది. అధిక జ్వరం, తలనొప్పి, కండరాలు మరియు కీళ్ళ నొప్పులు, చర్మం దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో రక్తస్రావం, అవయవాల వైఫల్యం సంభవించే అవకాశాలు ఉంటాయి. ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూడాలి. ఇంటి లోపల దోమతెరలను ఉపయోగించటంతోపాటుగా, దోమలను తరిమికొట్టే స్ప్రేలు ఉపయోగించటం మంచిది.

టైఫాయిడ్ ; టైఫాయిడ్ జ్వరం, సాల్మొనెల్లా టైఫీ అనే బాక్టీరియా వల్ల వస్తుంది. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిచెందుతుంది. జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, మలబద్ధకం, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటాయి. సరైన పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని పాటించడం, పరిశుభ్రత పాటించడం వల్ల సమస్యని దూరంగా ఉంచవచ్చు.
హెపటైటిస్ ; హెపటైటిస్ అనేది కాలేయానికి వచ్చే వ్యాధి. వైరస్ ల కారణంగానే వస్తుంది. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల వస్తుంది. హెపటైటిస్ లో A, B, C, D, మరియు E రకాలు ఉన్నాయి. కలుషితాహారం, నీటి వల్ల హెపటైటిస్ ఎ సమస్య వస్తుంది. జ్వరం, వాంతులు, దద్దుర్లు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. సరైన పరిశుభ్రతను పాటించడం ద్వారా దీనిని రాకుండా చూసుకోవచ్చు.
వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు :
*పోషకాహారం తీసుకోవాలి.
*ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి.
*కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
*దోమలు పెరగకుండా చుట్టూ ఉన్న పరిసరాలను క్లీన్ చేసుకోవాలి.
*దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి.
*అల్లం, వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాలి.
జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స పొందటం మంచిది.
గమనిక ; ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి సరైన చికిత్స పొందటం మంచిది.