
chapatis good for health : అధిక బరువుతో బాధపడుతున్న వారు ఇటీవలి కాలంలో వెయిట్ లాస్ లో భాగంగా వ్యాయామాలతోపాటుగా రోజువారి ఆహారంలో చపాతీలు తీసుకుంటున్నారు. గోధుమపిండి లేదా జొన్నపిండితో చేసిన చపాతీలను తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అన్నం తినకుండా రొట్టెలు తినటం వల్ల బరువుతోపాటు, షుగర్ ను కంట్రోల్ లో పెట్టుకోవచ్చని అంటున్నారు.
చపాతీ తినటం వల్ల ప్రయోజనాలు ;
బరువు తగ్గటానికి : ఒక చపాతీలో కేలరీల విషయానికి వస్తే సుమారుగా 70-100కేలరీలు ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండినట్లు ఉంది అనవసరమైన తిండి తినకుండా నివారిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి, సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
అధిక ఫైబర్ : చపాతీలు గోధుమపిండితో తయారు చేస్తారు. ఇందులో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి మంచిది. చపాతీ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఉంచి తద్వారా అతిగా తినకుండా నిరోధిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు : అన్నం కంటే చపాతీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. డయాబెటిస్తో( Diabetics ) బాధపడుతున్న వారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకుంటే చపాతీలు మంచిది. అలాగే రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది.
పోషకాలు : చపాతీలు పోషకాలు అధికం. బి1, బి2, బి3, బి6, బి9, ఇ విటమిన్లతో పాటు ఐరన్, కాపర్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, అయోడిన్ కాల్షియం వంటి ఖనిజాలు చపాతీల్లో పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి రోజువారీ కావాల్సిన పోషకాలను భర్తీ చేస్తాయి. దీనిలో ఉన్న ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చర్మం ఆరోగ్యానికి : చపాతీల్లో ఉండే బి విటమిన్లు, జింక్, వంటి ఇతర ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో తోడ్పడతాయి.
శక్తినిస్తుంది : ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తినిస్తాయి. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు చపాతీలు తోడ్పడతాయి.
గుండె ఆరోగ్యం : గుండె ఆరోగ్యానికి చపాతీలు మంచిదని నిపుణులు అంటున్నారు. దీనిలో అతి తక్కువ కొవ్వులే ఇందుకు కారణమని పలు అధ్యయనాల్లో తేలింది.
చపాతీలు తినేవారు పాటించాల్సిన విధానం ;
చపాతీల్లో ఎక్కువ నూనె, నెయ్యితో చేసుకోవడం వల్ల బాడీలో అనవసర కొవ్వులు చేరతాయి. అందుకే తక్కువ నెయ్యి, నూనెను వాడడం మేలు. ఈ రెండూ లేకుండా పుల్కా చేసుకొని తింటే ఉత్తమం. గోదుమ పిండిలో మైదా కలవకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు ముడి గోధుమలు తీసుకొని స్వయంగా పిండి పట్టించుకొని చపాతీ చేసుకుంటే మంచిది. చపాతీకి కాంబినేషన్‌గా అన్ని రకాల కాయగూరలతో చేసిన కూరలు తీసుకోవడం వల్ల పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. క్యారెట్ ముక్కలు, బీన్స్, పాలకూర వంటి వాటిని ఉడికించి, గోధుమ పిండిలో కలుపుకొని చపాతీలు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక ; ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యుల సూచనలు సలహాలు పాటించటం మంచిది.