సైనా నెహ్వాల్ షాకింగ్ న్యూస్…వివాహబంధానికి విడాకులతో గుడ్​బై

Saina Nehwal marriage breakup : ఇండియన్ బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి సైనా నెహ్వాల్​ అభిమానులను షాక్ గురిచేసి వార్త పంచుకున్నారు. తన భర్త పారుపల్లి కశ్యప్​తో వివాహ సంబధానికి ముగింపు చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఇన్​స్టాగ్రామ్​లో ఈ మేరకు సైనా ఓ పోస్టును పెట్టారు. ఈ నిర్ణయం తన జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుందని, బాగా ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

బ్యాడ్మింటన్ ఆటలో స్టార్ గా ఎదిగిన సైనా, మాజీ షట్లర్ కశ్యప్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి​ 2018లో వీరి వివాహం పెద్దల అంగీకారమే జరిగింది. పెళ్ళైన తొలిరోజుల్లో హైదరాబాద్​లోని పుల్లెల గోపిచంద్​ అకాడమీలో ఇద్దరు కలిసి శిక్షణ కూడా పొందారు. ఒలింపిక్​ లో సైనా కాంస్య పతకం, ప్రపంచ నెంబర్​ వన్​ ర్యాంకింగ్​తోపాటుగా, ప్రపంచ ఐకాన్​ నిలిచారు. అలాగే సైనా భర్త కశ్యప్​ ప్రపంచ టాప్​ 10లో నిలవటంతోపాటు 2014 కామన్వెల్త్​ క్రీడల్లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు.

హరియాణా నుండి అంతర్జాతీయస్ధాయికి సైనా క్రీడాజీవితం

హరియాణా రాష్ట్రానికి చెందిన సైనా 2008లో BWF ప్రపంచ జూనియర్​ ఛాంపియన్​షిప్​ను కైవసం చేసుకున్నారు. అనంతరం తొలిసారిగా ఒలింపిక్స్​లో మెరిసింది. 2008లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో క్వార్టర్​ ఫైనల్స్​కు చేరిన తొలి భారతీయ మహిళగా గుర్తింపుపొందింది. అలాగే ​హాంకాంగ్‌కు చెందిన అప్పటి ప్రపంచ ఐదో నంబర్ వాంగ్ చెన్‌ను తన ఆటతో మట్టికరిపించింది. ఇండోనేసియాకు చెందిన మరియా క్రిస్టిన్ యులియాంటి చేతిలో ఓటమిని చవిచూసింది.

2009లో సైనా అద్భుత క్రీడా ప్రతిభను గుర్తించి అర్జున అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2010లో ఆమెకు లభించాయి. బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించటంతోపాటుగ, అనేక ట్రోఫీలు, పతకాలను గెలిచింది. క్రీడల్లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్‌ను కలిగిన భారత ఏకైక మహిళా క్రీడాకారిణి కావడం విశేషం. అథ్లెట్లుగా దేశానికి చెందిన అనేక మంది ఎదగడానికి ఆమె ఆదర్శంగా చెప్పవచ్చు.

కశ్యప్​ కెరీర్ గురించి చెప్పాల్సి వస్తే

2014 కామన్వెల్త్ క్రీడల్లో కశ్యప్ బంగారు పతకాన్ని సాధించాడు. ఒక భారతీయ బ్యాడ్మింటన్ ఆటగాడు 32 సంవత్సరాల తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించడం మొట్టమొదటిసారి. మాజీ ఛాంపియన్లు ప్రకాష్ పదుకొనే, పుల్లెల గోపీచంద్​ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న తొలి భారతీయ బ్యాడ్మింటన్ ఆటగానిగా కశ్యప్ నిలిచాడు. 2013లో ప్రపంచ ర్యాంకింగ్ లో ఆరో స్థానానికి ఎదిగాడు. అయితే తరచూ గాయాల కారణంగా తనస్ధానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.

విడిపోవాలన్న నిర్ణయం ఎందుకు ?

సుదీర్ఘంగా ఇద్దరి మధ్య విడిపోవాలన్న చర్చ జరిగిందని, ఆ తర్వాతనే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సైనా చెప్పుకుంది. ఇద్దరి మధ్య ఈ విషయంలో పరస్పరం ఒక అవగాహనకు వచ్చామని , ఈ తరుణంలోనే విడిపోవాలన్న నిర్ణయం తీసుకున్నామని ఎక్స్ లో పోస్ట్ చేసింది. విడాకులకు గల కారణాలను ఆమె బహిరంగంగా వెల్లడించలేదు. అయితే ఈ ఇద్దరు జంట విడిపోతున్నారని తెలిసి అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

×