విధేయతకు పట్టం…గజపతి రాజుకు గవర్నర్ గిరి

Goa Governor Ashok gajapathi raju : తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. గోవా గవర్నర్ గా ఉన్న శ్రీధరన్ పిళ్లై స్థానంలో అశోక్ గజపతిరాజుకు అవకాశం కల్పించారు. ఆమేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.

7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఇలా 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగి ఉన్నారు. 2014-2018లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రిమండలిలో వాణిజ్య పన్నులు, ఆబకారీ, శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ వంటి శాఖల్లో మంత్రిగా పనిచేశారు.

విజయనగరం రాజవంశం చివరి మహారాజైన పూసపాటి విజయరామ గజపతిరాజు కుమారుడే అశోక్ గజపతి రాజు. సింహాచలం ఆలయం, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వంటి సంస్థల ద్వారా దానధర్మాలు చేస్తూ పేదప్రజలకు అపద్భాంధవునిగా నిలిచారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక మిత్రపక్షంగా ఉండటంతోపాటు, అశోక్ గజపతి రాజు క్లీన్ ఇమేజ్ ఆయనకు గవర్నర్ పదవి దక్కటానికి కారణమైంది.

ప్రధాని మోదీకి కూడా అశోక్ గజపతిరాజుపై మంచి అభిమానం ఉంది. నాలుగేళ్ల పాటు కేంద్ర విమానయాన మంత్రిగా చేసిన సందర్భంలో అంత సింపుల్‌గా.. నిజాయితీగా ఉండే నేతలు అరుదని ప్రధాని మోదీ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి.

వయసు పైబడటంతోపాటు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి తన రాజకీయ వారసురాలిగా గత ఎన్నికల సమయంలో కుమార్తెకు అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ కి దూరంగా ఉన్నారు. విజయనగరం ఎంపీగా కలిశెట్టి అప్పల్నాయుడు పోటీ చేయగా ఆయనకు మద్దతుగా ప్రచారం చేసి గెలిపించారు. అలాగే విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన కుమార్తె అదితి గపతిరాజు కు టిక్కెట్ కేటాయించటంతో ఆమె విజయంసాధించారు.

అశోక్ గజపతిరాజుకు గవర్నర్ గా అవకాశం కల్పించేందుకు చంద్రబాబు(chandrababu) ప్రయత్నిస్తున్నారని మహానాడు సందర్భంలోనే పార్టీ నేతలంతా చర్చించుకున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుండి కంభంపాటి హరిబాబు కూడా గవర్నర్ గా కొనసాగుతున్నారు.

×