
Lulu operations in AP : ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడి దారులు అడుగులు వేస్తున్నారు. ఏడాది క్రితం వరకు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకే భయపడిన ప్రముఖ కంపెనీలు ముఖ్య మంత్రి చంద్రబాబు పాలనా తీరుతో వారి దృష్టి ప్రస్తుతం ఏపి వైపు మళ్ళింది. ఏపి ప్రభుత్వం పెట్టుబడి దారులను ఆకర్షించే విధంగా అనుసరిస్తున్న పాలసీలు వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టాలను కుని గత ప్రభుత్వ వైఖరి కారణంగా ఆప్రతిపాదనలను విరమించుకున్న అనేక కంపెనీలు తిరిగి ఏపిలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందకు సమాయత్తమౌతున్నారు.
అలాంటి సంస్ధల్లో ప్రపంచ అగ్రగ్రామి సంస్ధ లులు గ్రూప్ కూడా ఒకటి… తాజాగా లులు సంస్ధ ఏపిలో తమ కార్యకలాపాలకు పచ్చజెండా ఊపింది. ఏపిలో మూడు చోట్ల లులు హైపర్ మార్కెట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఈ మాల్స్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ముందుగా విశాఖ, విజయవాడలో రూ.1,222 కోట్ల పెట్టుబడులు పెట్టబోనుంది. తద్వారా 1,500 మంది యువతకు ఉపాధి లభించనుంది.
ఇప్పటికే విజయవాడలో మాల్ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయింపు జరిగిపోయింది. త్వరలో లులు మాల్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపో స్థలాన్నిలులూకు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఈ స్ధలం సుమారు 5 ఎకరాల్లో ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా గొల్లపూడి వద్ద ఉన్న 5 ఎకరాల భూమిని ఆర్టీసీకి కేటాయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో లులు ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.
గవర్నర్‌పేట-2 డిపో ఉన్న స్థలంలో ఒకప్పుడు విజయవాడ బస్టాండ్, విజయవాడ-1 డిపో ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్ సియంగా ఉన్న సమయంలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నిర్మించి 1990లో ప్రారంభించారు. అనంతరం విజయవాడ-1 డిపోని కొత్త బస్టాండ్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు. ఆతరువాత గవర్నర్‌పేట-2 డిపోగా సిటీ బస్సుల అవసరాల కోసం వినియోగిస్తున్నారు. లులు గ్రూప్ ఏర్పాటుతో విజయవాడకు ఒక కొత్త బ్రాండ్ క్రియేట్ కానుందని అంతా భావిస్తున్నారు.