
Monsoon Animal Diseases : వర్షకాల సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్ లో మన జీవనంలో అంతర్భాగమైన పశువుల విషయంలో పలు జాగ్రత్తులు తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరి. ప్రస్తుత వర్షాకాలంలో పశువులు, గొర్రెలు ఇతర మూగజీవాలకు అనేక రకాల వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అన్నదాతలు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పశువులు, జీవాలకు వచ్చే వ్యాధులను గుర్తించిన వెంటనే సకాలంలో వాటికి చికిత్స అందించాలి. అందుబాటులో ఉన్న పశువైద్యాధికారిని సంప్రదించి వారిచ్చే సూచనలు, సలహాలు పాటిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు రాకుండా కాపాడవచ్చు.
పశువుల్లో వచ్చే సమస్యలు ;
మేకలు, గొర్రెలు బ్లూటింగ్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువ. ఇలాంటి సమయంలో వాటికి జ్వరం,మూతి వాపు పెదవుల వాపు, నోటి లోపల పుండ్లు, ఒంట్లో నీరు చేరడం, మేత తినకపోవటం వంటి లక్షణాలు స్పష్టంగా రైతులు గమనించవచ్చు. వీటి నివారణకు సాయంత్రం సమయంలో గొర్రెల మందలో వేపాకు పొగ పెట్టటం మంచిది. అలాగే వైద్యులు సూచించిన మేరకు బ్లూ టాక్స్ మరియు టిక్కిల్ మందులు పిచికారి చేయాలి. తడిగా ఉండే ప్రాంతంలో కాకుండా పొడి గా ఉండే ప్రాంతంలో వాటిని మేతకు తీసుకువెళ్లాలి.
కాళ్ల పుండ్లు వ్యాధి ;
మూగజీవులకు కాళ్లు పుండ్లు, గీట్టల మధ్య చీము చేరుతుంది. అలాగే గొర్రెలు కుంటుతూ నడుస్తుంటాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే జీవాలను బురద ప్రాంతంలో తీసుకు వెళ్ళరాదు. పొడి ప్రాంతంలోనే మేత మేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
గొంతు వాపు వ్యాధి ;
పశువులకు సోకే వ్యాధుల జాబితాలో ఇది కూడా ఒకటి. గొంతు వాపు వ్యాధి ప్రమాదకరం. ఈ వ్యాధిని గోరక వ్యాధి అని అంటారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మజీవుల వస్తుంది. ఈ సందర్భంలో కలుషితమైన నీరు , మేత తినటం, అలాగే పశువులకు రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ వ్యాధులు వస్తాయి. గొంతు వాపు వ్యాధి బారిన పడిన పశువులు ను మిగిలిన పశువులు తో కలపకుండా వేరు చేయాలి. ఇలా చేయటం వల్ల మిగిలిన వాటికి కూడా వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్ట వచ్చు. ఒకే పాకలో మిగిలిన వాటితో ఉంచకుండా వేరు చేయటం ఉత్తమం. పశువులు వర్షాలకు తడవకుండా తగిన షెడ్ లు నిర్మించుకోవాలి.
వర్షాలు పడే జూలై, ఆగస్టు నెలలో వ్యాధి నిరోధిక టీకాలు వేయించాలి. వాటిలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందేలా తగిన పౌష్టికాహారం అందించాలి. వ్యాధి సోకిన పశువులను మిగిలిన వాటి నుంచి వేరు చేయటంతోపాటు, వాటిని ఉంచే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
చీటిక వ్యాధి ;
గొర్రెల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి. ఈ వ్యాధి సోకిన గొర్రెలు నీరసించిపోతాయి. కళ్ళముందే చూస్తుండగానే క్షణాల వ్యవధిలో గిలగిలా కొట్టుకుని చనిపోతుంటాయి. వర్షాలకు ముందే గొర్రెలకు ఈ వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవటం మంచిది. వ్యాధి సోకిన గొర్రెలను గొర్రెల మంద నుండి వేరు చేసి ఉంచటం ద్వారా ఇతర గొర్రెలకు వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు.