కిడ్నీ సమస్యను గుర్తించటం ఎలా? కిడ్నీ సమస్యలు, లక్షణాలు

Kidney Problems and Symptoms : మూత్రపిండాలు (Kidneys) మన శరీరంలో వ్యర్థాలను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే ద్రవ, ఇలెక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటంలో, రక్తపోటును నియంత్రించడంలో, ఎరుపు రక్తకణాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు, బీ.పీ తగ్గిపోవడం , డెంగూ, మలేరియా, హెచ్‌ఐవీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, మూత్ర పిండాల్లో ఏర్పడే రాళ్లు, వివిధ సమస్యల కోసం తీసుకునే కొన్ని రకాల మందులు అంటే నొప్పి తగ్గడానికి వాడే మాత్రలు, స్టెరాయిడ్ మాత్రలు, యాంటీబయాటిక్స్ వల్ల కిడ్నీ సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంటుంది.

మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తున్నాయా , లేదా అన్న విషయాన్ని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) ప్రారంభ దశల్లో సైలెంట్ గా ఉంటుంది. అయితే ముందస్తు సంకేతాలను గుర్తిస్తే దీర్ఘకాలిక కిడ్నీ జబ్బులను నియంత్రించటం తేలిక.

మూత్ర పిండ సమస్యల లక్షణాలు ;

  1. అలసట మరియు బలహీనత

మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే రక్తంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. వీటి వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది. మూత్రపిండాలు ఎరుపు రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన ఎరిథ్రోపోయెటిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి మందగించటం వల్ల రక్తహీనత ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో అలసట, ఏకాగ్రత లోపించటం, చిన్న పనిచేసినా ఊపిరి అందకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది వయస్సు పైబడటం వల్లే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని బావిస్తుంటారు. ఇది ఏమాత్రం సరైంది కాదు.

  1. మూత్రం రంగులో మార్పు

మూత్రం రంగు, వాసనలో మార్పులు మూత్రపిండ సమస్యలకు తొలి సంకేతం. రాత్రిపూట తరచుగా మూత్రానికి వెళ్ళాల్సి రావటం. మూత్రం పోస్తున్నప్పుడు అధికంగా బుడగలతో కూడిన నురగ కనిపిస్తుంది. ఎక్కువ నురగ కనిపిస్తే మనశరీరం నుండి ప్రోటీన్లు యూరిన్ ద్వారా బయటకు పోతున్నాయని గుర్తించాలి. మూత్రంలో రక్తం కనిపించం, మూత్రం ముదురు రంగు లో ఉండటం ఇలాంటి లక్షణాల్నీ మూత్రపిండ జబ్బులకు సూచనలు.

  1. కాళ్లు, ముఖం ఉబ్బిపోవడం

శరీరంలోని సోడియం నిల్వలు పెరగటం, అదనపు సోడియాన్ని మూత్రపిండాలు తొలగించలేని సందర్భంలో శరీరంలోని వివిధ భాగాలు ఉబ్బుతాయి. దీనిని ఎడిమా అంటాం. ఇది ముఖ్యంగా కాళ్లలో, కళ్ల చుట్టూ నీరు చేరి ఉబ్బినట్లు కనిపిస్తుంది. కొందరు ఎక్కువ సేపు నిలబడటంవల్ల, కూర్చోవటం వల్ల ఇలా నీరు వచ్చిందని పొరబడుతుంటారు. ఇలా నీరు చేరి ఉండటం మూత్ర పిండాల సమస్యకు సంకేతం కావచ్చు.

  1. చర్మంలో మార్పులు

చర్మం పై దురద అనించటం, ఎక్కువ సార్లు గీరుకోవాలని అనిస్తుంది. చర్మం పొడిగా మారిపోతుంది. మూత్రపిండాల వ్యర్థ పదార్థాలు శరీరంలో పేరుకుని ఉండి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాల సమతుల్యత లేనప్పుడు ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి. చర్మ సమస్యలు లేకోయినప్పటికీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం పరీక్ష చేయించుకోవాలి.

  1. ఆకలిగా లేకపోవటం, నోటిలో మెటల్ రుచి, వాంతులు

మూత్రపిండాలు పనిచేయని సందర్భంలో శరీరంలో యూరియా వంటి విష పదార్థాలు పేరుకుంటాయి. దీంతో చాలా మందిలో నోటిలో మెటల్ రుచి కనిపిస్తుంది. మనం ఇనుప ముక్కను నోటిలో పెట్టుకుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి రుచి కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో కనిపిస్తుంది. అలాగే శ్వాస దుర్వాసనతో కూడి ఉంటుంది. వికారంగా, ఆకలి లేకపోవటం తినాలని అనిపించకపోవటం, వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ జీర్ణ సంబంధ సమస్యలుగా చాలా మంది భావిస్తారు. అసలు కారణం మూత్రపిండ సమస్య అయి ఉండవచ్చు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

మీ ఫ్యామిలిలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది. అలాగే ప్రత్యేకంగా డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్, ఉన్నవారిలో వంశపారంపర్య మూత్రపిండ వ్యాధులు ఉన్నవారు, నొప్పి నివారణ మందుల ఎక్కువగా వాడేవారు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. రక్తపరీక్ష ,క్రియాటినిన్,మూత్ర పరీక్ష అల్బ్యుమిన్ ద్వారా సమస్యను గుర్తించి చికిత్స పొందవచ్చు.

×