
Nimisha Priya Execution Postponed : భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరి వ్యవహారం అనూహ్యంగా నిలిచిపోయింది. మరికొన్ని గంటల్లోనే యెమెన్‌లో భారతీయ నర్సు నిమిష ప్రియను ఉరి తీయబోతున్నారన్న వార్తల నేపద్యంలో భారతీయులంతా ఎంతో ఉత్కంఠ, వేదనను అనుభవించారు. అయితే నిమిషను ఉరి నుండి తప్పించేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. చివరి నిమిషయంలో ఆమె ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది.
ఉరి వాయిదాకు సంబంధించి విదేశాంగ శాఖ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. యెమెన్ జైలు అధికారులతోపాటు ప్రాసిక్యూషన్ కార్యాలయంతో తాము నిరంతంర సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. బాధితురాలికి సాయం చేసేందుకు తొలి నుండి భారత్ ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. నిమిష, బాధిత కుటుంబాల మధ్య పరస్పర అంగీకారంతో కేసు పరిష్కరించుకునేలా మరింత సమయం ఇవ్వాలని భారత అధికారులు కోరారు. ఈ విషయంలో స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్ ఆఫీసుతో జరిపిన సంప్రదింపులు ఫలించటంతో మరణశిక్ష అమలును వాయిదా వేస్తూ యెమెన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
నిమిష ప్రియకు ఉరి ఎందుకు విధించారు…అసలేం జరిగింది ?
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష నర్సు కోర్సు పూర్తి చేసి 2008లో ఉద్యోగం నిమిత్తం యెమెన్ వెళ్ళింది. 2011లో థామస్‌ను వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్ తెరిచారు. యోమెన్ నిబంధనలకు లోబడి స్థానిక తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష, థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేర్చుకున్నారు. అల్‌అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ పేరుతో క్లీనిక్ ను ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త, కుమార్తె కేరళకు తిరిగి వచ్చేశారు. నిమిష యెమెన్‌లోనే ఉంటూ సెంటర్‌ను కొనసాగిస్తుంది.

అప్పటి నుండి నిమిష ప్రియకు వేధింపులు ప్రారంభమయ్యాయి. మెహది, నిమిష ప్రియను తన భార్యగా చెప్పుకుంటూ వేధింపులకు గురిచేయసాగాడు. ఆమె పాస్‌పోర్టు ను తనవద్ద పెట్టుకుని ఇవ్వకుండా వేధించాడు. అతడిపై 2016లో ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అతని వేధింపులు ఎక్కువ కావటంతో 2017లో మెహదికి మత్తు మందు ఇచ్చి, తన పాస్‌పోర్టును తీసుకోవాలని పధకం రచించింది నిమిష. మత్తుమందు మోతాదు ఎక్కువ ఇవ్వడంతో అతడు మరణించాడు. మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్‌లో పడేసి, అక్కడి నుంచి సౌదీకి పారిపోతుండగా ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. నేరం రుజువుకావటంతో 2020లో ఆమెకు ఉరిశిక్ష విధించారు. 2023లో చివరి అప్పీల్‌ను అక్కడి ప్రభుత్వం తిరస్కరించగా, ప్రస్తుతం నిమిష ప్రియ యెమెన్ రాజధానిలోని సనా కారాగారంలో ఉంది. ప్రస్తుతం ఉరి వాయిదా నిర్ణయంతో ఆమెకు కొంత ఉపశమనం కలిగిగిందనే చెప్పాలి.