
వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. బరువు తగ్గేందుకు చాలా మంది రోజువారిగా కఠినమైన వ్యాయామాల చేస్తుంటారు. మానసిక ఉల్లాసం కోసం మరియు వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి సైతం వ్యాయామాలు దోహదం చేస్తాయి. వ్యాయామం రోజువారిగా చేసేవారిలో కండరాలు, ఎముకలు బలంగా తయారవ్వటంతోపాటుగా శారీరక సామర్థ్యం పెరుగుతుంది. అలాగే గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
కేలరీలను బర్న్ చేయటం ద్వారా బరువు తగ్గడానికి వ్యాయామం ఉపకరిస్తుంది. నడక, జాగింగ్, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాల వల్ల గుండె , ఊపిరితిత్తులకు ఎంతో మేలు కలుగుతుంది. అలాగే బరువులు ఎత్తడం, యోగా, పుషప్స్ వంటి వ్యాయామాలు కండరాలను బలోపేతం చేయటంలో దోహదం చేస్తాయి. అయితే చాలా మంది వ్యాయామం తర్వాత కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల వ్యాయామం వల్ల శరీరానికి కలగాల్సిన ప్రయోజనాలు దక్కకుండా పోతున్నాయని నిపుణులు అంటున్నారు.
వ్యాయామం తరువాత పాటించాల్సిన జాగ్రత్తలు ;
- వ్యాయామం చేసే సందర్భంలో శరీర ఉష్ణోగ్రతతోపాటుగా, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఎక్సర్‌సైజ్ చేయటం పూర్తయిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ మోడ్ విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఇలా చేయటం ద్వారా శరీర ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగం సాధారణ స్థితికి చేరుకుంటాయి. అలాగే అప్పటి వరకు వత్తిడికి గురైన కండరాలకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. ఏమాత్రం విశ్రాంతి ఇవ్వకున్నా కండరాలు నొప్పితో బాధపడాల్సి వస్తుంది.
- వ్యాయామం తర్వాత కొంతమందిలో విపరీతమైన ఆకలి వేస్తుంది. ఆసమయంలో కడుపు నిండుగా ఆసమయంలో ఏది దొరికితే అది లాగించేస్తుంటారు. ఇలా కడుపు నిండా తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ బాగా ఆకలిగా ఉంటే ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే కూరగాయలు వంటి వాటిని తీసుకోవాలి. అయిల్ ఫుడ్ తోపాటు, జంక్ ఫుడ్ లను తీసుకోరాదు.
- ఎక్కువ సమయం వ్యాయామం వల్ల చెమట అధికంగా పడుతుంది. శరీరం నుంచి ద్రవ రూపంలో అనేక లవణాలు బయటికి పోతాయి. కాబట్టి వ్యాయామం తరువాత కొద్ది మోతాదులో నీరు తీసుకోవాలి. ఇలా చేయటం ద్వారా శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే వ్యాయామం తరువాత చాలా మంది చల్లని నీటితో స్నానం చేయడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిదికాదు.
- ఎక్కువ సమయం వ్యాయామం తర్వాత వెంటనే కూర్చోవడం చేయరాదు. ఇలా చేయటం వల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాయామం తర్వాత కొద్ది సేపు నడవడం మంచిది.
- వ్యాయామాలు చేయటానికి ముందు వైద్యుడితో సంప్రదించటం ఉత్తమం. ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నవారు వైద్యుల సూచనలు ముందుగా తీసుకుని వ్యాయామాలు ప్రారంభించటం మంచిది.