గ్రీన్ కాఫీ తో క్యాన్సర్ రాకుండా నివారించవచ్చా ?

నిద్రలేవగానే కప్పు కాఫీతో రోజువారి దినచర్యను ప్రారంభించటం చాలా మందికి అలవాటు. గొంతులోకి వేడి వేడి కాఫీ వెళితే కాని మనలోని నవనాడులు యాక్టివ్ కావని చాలా మంది బావిస్తుంటారు. అందుకే రోజువారిగా కాఫీని తాగేందుకు ఇష్టపడతారు. కొందరైతే రోజుకు రెండు , మూడు సార్లు కాఫీని సేవిస్తుంటారు. కాఫీ తాగితే బ్రెయిన్ యాక్టీవ్ గా పనిచేయటమే కాకుండా, పనిలో కూడా చురుకుదనం ఉంటుందట. అయితే ప్రస్తుతం గ్రీన్ కాఫీ ఇటీ వలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ గ్రీన్ కాఫీ తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న ప్రచారంతో చాలా మంది దీనిని రోజువారిగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

సాధారణంగా కాఫీ గింజల్ని వేయించి కాఫీ పొడిని తయారు చేస్తారు. అయితే గ్రీన్ కాఫీకోస కాఫీ గింజలను వేయించాల్సిన పనిలేదు. వాటిని పచ్చిగానే ఉంచి కాఫీని తయారు చేసుకుంటారు. కాఫీ గింజలను రాత్రి నానబెట్టి, తరువాత రోజు మరగించి వడకట్టి తీసుకుంటారు. ఇదే గ్రీన్ కాఫీ అన్నమాట. ఈ పచ్చి కాఫీ గింజలలో క్లోరోజెనిక్ ఆమ్లం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధిక కొవ్వులను కరిగించటంలో ఇది బాగా తోడ్పడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతం చేయటంతోపాటు, సౌందర్యాన్ని మెరుపరుస్తాయి. అలాగే పెద్ద వయస్సువారిలో త్వరగా వచ్చే మతిమరుపును తగ్గిస్తుంది.

బరువు తగ్గాలనుకునే ప్రయత్నాల్లో ఉన్నవారికి గ్రీన్ కాఫీ గింజలు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియలు వేగవంతమై ఆరోగ్యకరమైన బరువుకు సహాయపడుతుంది. గ్రీన్ కాఫీ ఊబకాయం ఉన్నవారిలో బరువు నియంత్రణకు తోడ్పడుతుందని అధ్యయనంలో తేలింది. జీర్ణవ్యవస్థలో కార్బోహైడ్రేట్లు, కొవ్వును గ్రహించే ప్రక్రియను నెమ్మదించేందుకు గ్రీన్ కాఫీ అనేది సహాయపడుతుంది.

గ్రీన్ కాఫీలోని క్లోరోజెనిక్ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. టైప్​ 2 డయాబెటిస్ వారు రోజు తీసుకోవటం వల్ల మేలు కలుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, గ్రీన్ కాఫీ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించుకోవచ్చు.

గ్రీన్ కాఫీలోని క్లోరోజెనిక్ యాసిడ్ రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించటంలో దోహదం చేస్తుంది. గ్రీన్ కాఫీ అనేది రక్తపోటుకు కారణమయ్యే ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తగ్గిస్తుంది. ఇదే విషయం అధ్యయానాల్లో తేలింది. గ్రీన్ కాఫీలో క్లోరోజెనిక్ శరీరంలో మంటను తగ్గించడంలో తోడ్పడుతుంది.

గ్రీన్​ కాఫీ గింజలలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. క్లోరోజెనిక్ యాసిడ్‌కు ఉన్న శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్ నివారణలో,క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయని అధ్యయనాల్లో తేలింది.

అయితే దీనిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ తాగడం మంచిది కాదు. టిఫిన్ తీసుకున్న తర్వాత గ్రీన్ కాఫీ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ కాఫీని డాక్టర్లు సూచించన మేరకు రోజుకి ఒకటి లేకుంటే రెండు కప్పులు మాత్రమే తీసుకోవాలట.

NOTE : అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమచారం సేకరించి అందించటమైనది. కేవలం ఇది అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.

×