
Vehicle Mystery : రాష్ట్ర పోలీసు శాఖలో అత్యంత కీలకమైన అష్టబాహువు కార్యాలయం అది…ఈ కార్యాలయ ప్రాగణంలో వాహనాల మధ్యలో ఆ శాఖకు ఎలాంటి సంబంధంలేని వాహనం ఉండటం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఇదేదో రెండు రోజుల క్రితమో, లేదంటే వారం క్రితం నుండో ఈ వాహనం ఇక్కడ ఉందంటే పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. గత ప్రభుత్వ హయాం నుండి ఈ వాహనం ఇక్కడే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా ఈ వాహనాన్ని అటు, ఇటు కదిలించింది లేదు. ఈ వాహనం తమదేనని వచ్చి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన వారు లేరు. మరి ఇంతకీ ఈ వాహనం ఎవరిది?..ఎందుకు ఇలా వదిలేశారు…? గత ప్రభుత్వ హయాంలో ఈ వాహనాన్ని ఎందుకు వినియోగించారు..? అష్టబాహువులో అసలేం జరుగుతుంది…
తీవ్రవాదుల దాడుల నుండి రక్షణ కోసం రాష్ట్ర పోలీసు శాఖలో అష్టబాహువు విభాగం ఉంది. ఎన్నో ఏళ్ళోగా ఈ విభాగం తమ కార్యకలపాలను కొనసాగిస్తున్నా పెద్దగా దీని గురించి ఎవరికీ అంతగా తెలియదనే చెప్పాలి. అయితే గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒక్కసారిగా దీనిపేరు తెరపైకి వచ్చింది. జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన తరువాత రోజు నుండే ఆయన భద్రతను కట్టుదిట్టం చేసే పేరుతో అష్టబాహువు బలగాలను రంగంలోకి దించారు. 30 మందితో కూడిన స్పెషల్ ఆపరేషన్స్ టీం కమాండో సభ్యులు జగన్ ఇంటి వద్ద, ఆయన పర్యటనల్లో ఆనాటి సియంకు భద్రత కల్పించారు. ఆరుగురు సభ్యుల చొప్పున ఐదు బృందాలుగా ఏర్పాటు చేసి వారికి విధులు కేటాయించేవారు.

దీంతో అష్టబాహువు విభాగం ఏర్పాటు లక్ష్యం జగన్ జమానాలో గాలిలో కలిపేశారు. ఇక అప్పటి నుండే ఆ విభాగం ఉన్నతాధికారుల మొదలు క్రింది స్థాయి అధికారుల వరకు తాడేపల్లికి జీ హుజూర్ లుగా మారిపోయారు. అష్టబాహువు కార్యాలయాన్ని అడ్డాగా చేసుకుని వైసీపీ ముఠా అడ్డగోలు వ్యవహారాలు సాగించినట్లు తెలుస్తుంది. ఇటీవలే విఆర్ ఎస్ తీసుకున్న ఓ ఐపీఎస్ అధికారి ఆ విభాగానికి అప్పట్లో బాస్ గా కొనసాగారు. ఈ సమయంలో అక్కడ పనిచేసిన క్రిందిస్ధాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించార్న వార్తలు అప్పట్లోనే వినిపించాయి. వైసీపీ వారికి చెందిన అనేక ప్రైవేటు వాహనాలకు ఇంధన సరఫరా మొదలు, వాటి రిపేర్ల వరకు అన్నీ ఇక్కడి ఎంటీఎస్ పర్యవేక్షించినట్లు తెలుస్తుంది.
అసలు ఆ వాహనం అక్కడెందుకుంది ?
ప్రస్తుతం చర్చ మొత్తం అష్టబాహువు కార్యాలయంలో వాహనాల మధ్య ఓ అనాధలా దర్శనమిస్తున్న ఓ ప్రైవేటు వాహానం గురించే.. ఇంతకీ ఈ వాహనం ఇక్కడ ఎందుకు ఉందన్నసమాచారం అందిన వెంటనే దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకుకే గత కొద్ది రోజులుగా డిజిటల్ టైమ్స్ అన్వేషణ చేపట్టింది…కొంత మేర సమాచారాన్ని సేకరించగలింది. AP26TL 1092 నెంబరు కలిగిన మహేంద్ర బోలేరో మ్యాక్సీ ట్రక్ వాహనాన్ని గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి వైసీపీ పార్టీ, ప్రభుత్వ ప్రచారాలకు వినియోగించినట్లు తెలుస్తుంది. అయితే దీనిని ప్రభుత్వం తరుపున డిజిటల్ స్క్రీన్ ప్రచార వాహనంగా వినియోగిస్తే సమాచార శాఖ అధీనంలో ఉండాలి. అయితే దీని నిర్వాహణ వ్యవహారాల్నీ అష్టబాహువు కార్యాలయం ఎందుకు పర్యవేక్షించిందో ఎవరికి అంతు చిక్కటంలేదు. దీనికి ఇంధనం మొదలు, రిపేర్ల వరకు మొత్తం అష్టబాహువు కార్యాలయమే చూసుకుందన్న వాదన వినిపిస్తుంది. సమాచార శాఖ అధ్వర్యంలో డిజిటల్ స్క్రీన్ వాహనం ఉంటే వారి కార్యాలయంలో ఉండాలి. అలా కాదని అష్టబాహువు కార్యాలయం ఆ వాహనం ఉండటం అంటే అనాటి వైసీపీ పార్టీ ప్రచార వ్యవహారాలన్నీ ఈ అష్టబాహువు కార్యాలయం నుండే పర్యవేక్షణ జరిగాయా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
వాహన ఆలనపాలన మొత్తం వారి కనుసన్నల్లోనే ?…

నేటీకి కొనసాగుతున్న ఎంటీఎస్ విభాగంలోని ఓ ఆర్ ఐ తోపాటు, ఓ రైటర్ కనుసన్నల్లో దీని ఆలనాపాలన చూసినట్లు తెలుస్తుంది. ఇదొక్కటే కాదు గత ప్రభుత్వ హయాంలో అనేక ప్రైవేటు వైసీపీ వాహనాలకు ఇంధనం ఈ కార్యాలయం నుండే సప్లై అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనేక మంది వైసీపి నేతలకు చెందిన ప్రైవేటు వాహనాలకు పాత టైర్లు మార్చి కొత్త టైర్లు వేయటం మొదలు, వాటి రిపేర్లు మొత్తం.. పైసా ఖర్చు లేకుండా అష్టబాహువు జమాఖర్చుల్లో రాసేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక వైపు అష్టబాహువు విభాగానికి చెందిన అనేక వాహనాలు రిపేర్లకు నోచుకోక మూలనపడి ఉండే వాహన విభాగానికి కేటాయించిన ఏడాది బడ్జెట్ మొత్తం వైసీపీ నేతల వాహనాల సేవలకే వినియోగించారన్న వార్తలు గుప్పు మంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలమైనా నేటికి AP26TL 1092 నెంబరు కలిగిన మహేంద్ర బోలేరో మ్యాక్సీ ట్రక్ వాహనానం అక్కడే ఉండటం…ఎవరు దానిని తీసుకువెళ్ళేందుకు రాకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ వాహనం నెల్లూరు జిల్లాకు చెందిన వాహనంగా తెలుస్తుంది. ప్రభుత్వం మారిపోయినా ఈ వాహనం ఇక్కడే ఉండటాన్ని చూస్తే దీనికి వెనుక ఏదో పెద్ద కధే ఉన్నట్లు అనిపిస్తుంది. తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టి దీని అసలు గుట్టు కనిపెట్టటంతోపాటు, అష్టబాహువులోని దొంగల భరతం పట్టాల్సిన అవసరం ఉంది. జగన్ జమానాలో రక్షణ విభాగంలో పనిచేస్తున్నామన్న విషయం మర్చిపోయి, సర్కారు సొమ్మును వైసీపీ నేతలకు దారాదత్తం చేసిన వారిపై పూర్తిస్థాయి విచారణ జరపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యహరించిన పోలీసు బాసే ప్రస్తుతం ఈ విభాగానికి హెడ్ కావటంతో అక్రమాలు బయటకు రావటం కష్టమేనన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. మరి రాష్ట్ర పోలీసు బాస్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే…