
Andhra Pradesh new districts : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులతోపాటు పేర్ల మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఏడుగురు మంత్రులతో ఈ సబ్‌కమిటీని ఏర్పాటైంది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, జనార్ధన్‌రెడ్డి, రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ ఉన్నారు.
ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్లు మార్పులు చేర్పుల నిమిత్తం స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఏడుగురు మంత్రులతో ఏర్పాటు చేసిన ఈ మంత్రివర్గ ఉపసంఘానికి కన్వీనర్ గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరించనున్నారు. పాలన సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో సూచించింది.
జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకోనన్నారు. సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంత చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోని మాత్రమే ముందుకు వెళ్ళాలని అదేశాలిచ్చింది. సామాజిక, ఆర్థిక, అభివృద్ధి కోసం అంతరాలు లేకుండా ప్రాంతాలను నిర్ణయించాలని సూచించింది. సరిహద్దులు నిర్ణయించేటప్పుడు జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సరిహద్దులు, పేర్ల మార్పు చేసే ముందు ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని స్ఫష్టం చేసింది.