మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.0…రికార్డు దిశగా

  • రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కానున్న 2 కోట్ల మంది విద్యార్థులు-తల్లితండ్రులు- ఉపాధ్యాయులు
  • పుట్టపర్తిలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు హాజరు కానున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్

Mega Parent Teacher Meet 2.0 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకే రోజున 2 కోట్ల మందితో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం నిర్వహించబోతుంది. విద్యార్థులు, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు అందరినీ ఒక చోటుకు చేర్చనుంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది రెండో కార్యక్రమం. పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. విద్యార్థులు, వారి తల్లితండ్రులు, ఉపాధ్యాయులతో సమక్షంలో సీఎం మాట్లాడనున్నారు.

లోకేష్ ఆలోచనతో కార్యరూపం

ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, జూనియర్ కాలేజీలలో మెగా పీటీఎం 2.0ను ఒక పండుగలా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,92,456 మంది తల్లిదండ్రులు, దాతలు ఈ వేడుకలో పాల్గొనున్నారు. మొత్తంగా 2.28 కోట్ల మంది భాగస్వాములు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ మెగా పేరెంట్ టీచర్ సమావేశం సరికొత్త రికార్డు సృష్టించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు కార్పొరేట్ స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ను ప్రభుత్వ అధీనంలో నడిచే పాఠశాలలో నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ ఆలోచనకు కార్యరూపాన్ని ఇచ్చారు. వరుసగా రెండో ఏడాది సైతం పండుగ వాతావరణంలో విద్యార్ధుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర భాగస్వాములతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

పిల్లల చదువు పురోగతి తల్లిదండ్రులకు వివరించటమే లక్ష్యం..

పిల్లలు చదువులో ఎంత పురోగతి సాధిస్తున్నారు, వారి ప్రవర్తన , సామాజిక సమస్యలపై అవగాహన చేసుకుంటున్నారా అనే అంశాలపై తల్లిదండ్రులు తెలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలగనుంది. అలాగే విద్యార్థుల చదువులకు సంబందించిన సమగ్ర పురోగతి కార్డులను తల్లిదండ్రులకు అందిస్తారు. తల్లిదండ్రులు కూడా వారి అభిప్రాయాలను, సూచనలనుఈ సమావేశంలో పంచుకోవచ్చు. పాఠశాల విద్యలో పనితీరు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై చర్చించుకునే ఈ కార్యక్రమం వేదిక కానుంది.

×