
సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ ను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్నిచర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ ముసుగులో కొందరు తెలివిగా నేరాలు చేస్తూ దాన్ని ప్రభుత్వంపై నెడుతున్నారని, పోలీసులకు సహకరించకుండా చట్టం కళ్ళుకప్పే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు, నేతల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అలాంటి వారి విషయంలో సాంకేతితకను ఉపయోగించుకోవాలన్నారు. క్రైమ్ హాట్ స్పాట్లపై సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టి శాంతిభద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేయాలన్నారు.
అమరావతి సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సీఎం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో మన రాష్ట్రం ఉపయోగిస్తున్న సాంకేతికత ఓ మోడల్ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నచోట్ల ముందుగానే సైరన్ హెచ్చరికలు జారీ చేయాలన్నారు. ప్రైవేట్ సీసీ కెమెరాల ఫుటేజ్ విషయంలో నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. నేర నియంత్రణలో ప్రైవేట్ కెమెరాలను వినియోగించుకునేలా చూడాలన్నారు. ప్రజల భద్రత కోసం, నేరాల నియంత్రణ కోసం, దర్యాప్తులో భాగంగా షాపింగ్ మాల్స్, థియేటర్లు, హోటళ్ల వద్ద ఉండే సీసీ కెమెరాల్లోని ఫుటేజీని కలెక్ట్ చేసే విషయంలో పబ్లిక్ సేఫ్టీ యాక్ట్‌ను వర్తింపజేయాలన్నారు. వివిధ రంగాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాల వినియోగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ పురోగతిపైనా అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
డేటా భద్రతకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ
ప్రభుత్వ రికార్డుల భద్రత పరిచేందుకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఉపయోగించాలన్నారు. రెవెన్యూ రికార్డులను కూడా పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి నూతన సాంకేతికతనే వినియోగించి భద్రపరచాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని డేటా లేక్ ద్వారా సమన్వయం చేయాలన్నారు. 517 పౌరసేవల్ని వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తుండగా, అన్ని సేవలన్నీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ధేశించారు.