సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు…ముఖ్యమంత్రి చంద్రబాబు

శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరటంతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీశైలం చేరుకున్న సియం తొలుత జలాశయం వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ప్రస్తుతం ఎగువ నుండి వస్తున్న ప్రవాహం వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత స్ధానిక రైతులతో కలిసి చంద్రబాబు జలాశయం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 6, 7, 8, 11 నంబర్‌ గేట్లను ఓపెన్ చేయటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహించింది.

దీనికి ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. మల్లన్న సన్నిధికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. శ్రీశైల మల్లికార్జున స్వామిని, శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని అర్చన కార్యక్రమంలో అనంతరం , ఆలయ ప్రాంగణంలో ఉన్న గోశాలను సందర్శించారు. దర్శన అనంతరం స్వామివారి మండపంలో వేదపండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనంతోపాటుగా, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తన జీవితంలో ఇది ఎంతో సంతోషకరమైన రోజని అన్నారు. జులై తొలివారంలోనే శ్రీశైలం నిండుకుండా మారటం శుభపరిణామమని, పైనుంచి వచ్చిన జలాలతో ప్రస్తుతం జలాశయంలో 200 టీఎంసీలు నీరు ఉన్నట్లు చెప్పారు. రాయలసీమ రతనాల సీమ కావాలని శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించానని చెప్పారు. మల్లన్న ఆశీస్సులతో రాయలసీమ సుభిక్షంగా ఉంటుందని, జలాలే మన సంపద వాటితోనే రైతుల కష్టాలు తీరతాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలుగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభివర్ణించారు.

రాయలసీమలో స్థితిగతులు మార్చేందుకు ఎన్టీఆర్‌ ఆనాడు నడుం బిగించగా తాను అధికారం చేపట్టిన తరువాత రాయలసీమ అభివృద్ధికి నావంతు కృషి చేస్తున్నానట్లు చెప్పుకొచ్చారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.68,000ల కోట్లు ఖర్చు చేశానన్న సియం, గత ప్రభుత్వం ఐదేళ్లపాటు రాయలసీమను పట్టించుకోలేదని విమర్శించారు. జీడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు, స్పష్టం చేశారు.

పోతిరెడ్డిపాడు, గాలేరు-నగరి, గండికోట అన్నీ ప్రాజెక్టులు తెలుగుదేశం హయాలోనే తీసుకు వచ్చామని, తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్‌వన్‌ కావాలనేది తలంపుతో పనిచేస్తున్నాన్నారు. ఈ నెల 15నాటికి జీడిపల్లికి నీళ్లు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన , ఈ నెల 30 కల్లా కుప్పం, మదనపల్లెకు నీళ్లు వచ్చేలా చేస్తామన్నారు. సముద్రంలో కలిసే నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకుంటే రైతులకు మేలుకలుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

పోలవరం వల్లే రాయలసీమకు నీళ్లు వస్తున్నాయని, సముద్రంలోకి వెళ్లే బదులు ఆ నీరు, వరద జలాలను వాడుకుంటే మంచి జరుగుతుందన్నారు. రాయలసీమ అభివృద్ధికి తన వద్ద బ్లూప్రింట్ ఉందన్న సియం, దేశంలో ఎక్కడా లేని రోడ్ల వ్యవస్థ ఈ ప్రాంతంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియతోపాటు పలువురు పార్టీనేతలు, అధికారులు పాల్గొన్నారు.

×