నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టంగా భావిస్తున్న బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. సరిగ్గా ఉదయం 10:05 గంటలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభమై, గంటసేపుకు పైగా కొనసాగనుంది. ఈ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్రంగా రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు.

గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎన్ని వర్కింగ్ డేస్ ఉండాలి, ఏ బిల్లులు ప్రవేశపెట్టాలి, ఏ అంశాలపై చర్చ జరగాలి వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం సుమారు 18 నుంచి 20 వర్కింగ్ డేస్ పాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.

14న 2026–27 ఆర్థిక బడ్జెట్ పెట్టే అవకాశం

ఈ నెల 14వ తేదీన 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ. 3.50 లక్షల కోట్ల పరిమాణంలో బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చిన కేటాయింపులు, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను పరిగణనలోకి తీసుకుని ఈ బడ్జెట్ రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది.

వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మహిళలకు ప్రత్యేక కేటాయింపులు ఉండే అవకాశముంది. రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, అలాగే ఇప్పటికే అమలులో ఉన్న “సూపర్ సిక్స్” పథకాల కోసం గణనీయమైన నిధులు కేటాయించే అవకాశం ఉంది. అభివృద్ధి మరియు సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్న దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

తిరుమల లడ్డూ అంశంపై హాట్ చర్చ?

ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డూ వ్యవహారం అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు వచ్చే అవకాశముంది. ఈ అంశంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుందని సమాచారం. ఈ చర్చలో ప్రతిపక్ష వైసీపీ పాల్గొంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు, వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే వైసీపీ హయాంలో జరిగినట్టు ఆరోపణలు ఉన్న భూముల అక్రమాలు, మద్యం అక్రమాలు, దాడుల వంటి అంశాలపై కూడా చర్చ జరగవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

వైసీపీ హాజరు కీలకం

గత రెండు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ప్రతిపక్ష వైసీపీ, ఈసారి గవర్నర్ ప్రసంగానికి మాత్రం హాజరవాలని నిర్ణయించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పార్టీ ఎమ్మెల్యేలు మొదటి రోజు సభకు హాజరవుతారు. అనంతరం వైసీపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి, మిగిలిన రోజుల్లో సమావేశాలకు హాజరు కావాలా లేదా అన్న అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉందని పలుమార్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల హాజరు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

మండలిలో పోరాటం.. అసెంబ్లీలో సందేహం

అసెంబ్లీకి దూరంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, శాసన మండలిలో మాత్రం చురుకుగా పాల్గొంటున్నారు. మండలిలో తమకు బలం ఉందని, ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేస్తామని వైసీపీ చెబుతోంది. అయితే అసెంబ్లీలో బలం లేకపోవడం వల్లే సభకు హాజరవడం లేదన్న అధికారపక్ష విమర్శలకు వైసీపీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కీలక మలుపు దిశగా సమావేశాలు

మొత్తానికి ఈసారి బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముంది. అభివృద్ధి-సంక్షేమ అజెండా, తిరుమల లడ్డూ వివాదం, ప్రతిపక్ష వైఖరి, అనర్హత చర్చలు ఇవన్నీ కలిపి అసెంబ్లీ సమావేశాలను హాట్ హాట్‌గా మార్చనున్నాయి. రాబోయే రోజుల్లో సభలో జరిగే చర్చలు రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేయనున్నాయి.

×