వికలాంగుడి జీవనోపాధికి చేయూత…ఎన్టీఆర్ స్టేడియం ఫ్రెండ్ సర్కిల్ ఉధారత

ఒక వైపు పేదరికం…మరోవైపు అంగవైకల్యం…అయితే ఇవేవి తన జీవన గమనాన్ని ముందుకు సాగకుండా అపలేవని నిరూపించుకుంటున్నాడు గుంటూరు నగరంలోని స్వర్ణభారతి నగర్ కు చెందిన బండారు లక్ష్మణ్…అతను పడుతున్న కష్టాన్ని చూసిన పలువురు అతనికి చేయూత అందించటం ద్వారా జీవనోపాధిని మరింత మెరుగుపరిచేందుకు ముందుకు వచ్చారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

స్వర్ణభారతి నగర్‌లోని ఓ చిన్న ఇల్లు…అందులో నివసించే బండారు లక్ష్మణ్ ఉదయాన్నే ఇంటి ముందర అద్దెకు తెచ్చుకున్న బల్లా బండి పై పండ్లు పేర్చుకుంటాడు. అంగవైకల్యంతో ఉన్నా బ్రతుకుపై కొండంత ఆశతో బండి నెట్టుకుంటూ బృందావన్ గార్డెన్స్ సెంటర్‌కి బయల్దేరతాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు రోడ్డుపక్కన నిలబడి పండ్లు అమ్ముకుంటాడు. ఇదే అతని రోజువారి దినచర్య…

రోజంతా పండ్లు అమ్మినా లక్ష్మణ్ కు వచ్చే లాభం అంతంత మాత్రమే…వచ్చిన దానిలో బల్లా బండి అద్దెకు కొంత వెళ్లిపోతే చేతిలో మిగిలేది కొద్ది మొత్తం మాత్రమే. అయినా, కుటుంబం కోసం తన బ్రతుకు తెరువుని అపకుండా లక్ష్మణ్, ప్రతీ రోజు జీవనోపాధి కోసం శ్రమిస్తూనే ఉన్నాడు.

కదిలించిన లక్ష్మణ్ బ్రతుకు పోరాటం ;

బండారు లక్ష్మణ్ స్టేడియం సమీపంలో పండ్లు అమ్ముకుంటున్న తీరు, అతను పడుతున్న కష్టాన్ని స్టేడియంకు వాకింగ్ నిమిత్తం వచ్చి , వెళ్ళే ఫోర్ ఫ్రెండ్స్ వాకర్స్ గ్రూప్ సభ్యులను కదిలించింది. అతని వివరాలు తెలుసుకున్న వారంతా అతనికి తమ వంతు సాయంగా ఎదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. కనీసం అద్దె బండి భారాన్ని తగ్గించగలిగితే అతనికి పెద్ద ఊరట లభిస్తుందన్నఆలోచన వారిలో కలిగింది. అందరూ కలిసి తలకొంత మొత్తాన్ని సమీకరించారు. అలా వచ్చిన మొత్తంతో ఒక కొత్త బల్లా బండిని కొనుగోలు చేశారు.

అర్భాటం లేకుండానే ఫోర్ ఫ్రెండ్స్ సాయం ;

ఫోర్ ఫ్రేండ్స్ తాము కొనుగోలు చేసిన బల్లా బండిని ఎలాంటి అర్హాటం లేకుండానే బండారు లక్ష్మణ్ కు అందజేశారు. ఆక్షణంలో అతని ముఖంలో వెలిసిన చిరునవ్వు, కన్నీళ్ళ రూపంలో కళ్ళల్లో కనిపించిన ఆ దృశ్యం చూసిన వారందరి హృదయాలను తాకింది. ఇకపై అద్దె భారం లేకుండా కష్టానికి నిజమైన ఫలితం దొరుకుతుందన్న ఆశతో సొంత బల్లా బండితో రేపటి నుండి ఫ్రూట్స్ అమ్ముకునేందుకు అక్కడి నుండి పయనమయ్యాడు లక్ష్మణ్… బండారు లక్ష్మణ్ కు చేయూత అందించిన ఫోర్ ఫ్రెండ్స్ ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ఒక చిన్న సహాయం ఒక మనిషి జీవితాన్ని ఎలా మార్చుతుందో ఈ చేయూతే అందుకు నిదర్శనమని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ నాగేశ్వరరావు, తోట పూర్ణ, తోట కోటేశ్వరరావు, మెట్రో శ్రీను, ఏలూరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

×