Greenfield Airports in AP : ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తిరిగి తెచ్చేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటినుంచి కృషి చేస్తుంది. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు, రైలు, వాయు మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాజాగా కొత్తగా 4 విమానాశ్రయాల అభివృద్ధికి వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో ద్వారా తీసుకోనున్న ఈ వెయ్యి కోట్ల రుణానికి ప్రభుత్వం హామీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.

రాష్ట్రంలోని కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాల అభివృద్దికి ఈ రుణాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. భూసేకరణతోపాటుగా, మౌలిక సదుపాయాల కల్పనకు, వయబులిటీ గ్యాప్ ఫండ్, అత్యవసర ఖర్చు కోసం ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర మౌలిక సదుపాయాలు,పెట్టుబడి విభాగం కార్యదర్శి ఎన్. యువరాజ్ ఆమేరకు ఆదేశాలు జారీ చేశారు.
కొత్తగా 7 ఎయిర్ పోర్టులు :
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 7 విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం విమానాశ్రయాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. కర్నూల్ ఎయిర్‌పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో,అలాగే పుట్టపర్తిలో ప్రైవేటు ఎయిర్ స్ట్రిప్ పరిధిలో ఉంది. వీటికితోడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం రెడీఅవుతుంది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్తగా మరో 7 కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే భాగంగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో నూతన ఎయిర్‌పోర్టులను నిర్మించేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. ఎయిర్‌పోర్టుల విస్తరణ, నిర్మాణం, కొత్త విమానాశ్రాయాల నిర్మాణంపై సీఎం చంద్రబాబు పలు పర్యాయాలు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాల అభివృద్ది కోసం వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్‌కు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
మరో రెండు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు ;
రాష్ట్రంలో రెండు గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్స్ రెడీ చేస్తుంది. అందులో ఒకటి రాజధాని అమరావతిలో , మరొకటి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రీ-ఫీజిబిలిటీని పరిశీలించేందుకు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక (టీఈఎఫ్‌ఆర్) రూపొందించేందుకు కన్సల్టెంట్ల నియామకానికి ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (APADC) టెండర్లను పిలిచింది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ఏ ప్రాంతం అనుకూలమో కూడా కన్సల్టెన్సీ సంస్థే సూచించనుంది.
శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయాన్ని ఈశాన్య దిశలో, నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో, సముద్ర తీరానికి సమీపంలో నిర్మించనున్నట్లు ఏపీఏడీసీ ప్రతిపాదించింది. ఈ రెండు ఎయిర్‌పోర్టుల నిర్మాణం, నిర్వహణకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక అంశాలను కన్సల్టెన్సీ సంస్థలు గుర్తించాలని పేర్కొంది. విమానాశ్రయాల నిర్మాణానికి కాన్సెప్ట్ మాస్టర్‌ప్లాన్, ఫైనాన్షియల్ మోడల్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్లను సిద్ధం చేయాలని అదేశించింది.
