
Guntur NTR Stadium Closed : గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ ట్రాక్ మరమత్తు పనులు వాకర్స్ పాలిట శాపంగా మారాయి. రోజులు గడుస్తున్న ట్రాక్ నిర్మాణపనుల్లో ఏమాత్రం పురోగతి కనిపించటంలేదు. స్టేడియం మూసివేయటంతో రహదారులపైనే వాకింగ్ చేస్తూ వాకర్స్ ప్రమాదాల బారిన పడుతున్నారు. అదే సమయంలో స్టేడియంలో జరుగుతున్న వాకింగ్ ట్రాక్ మరమత్తుపనులు క్వాలిటీగా లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాకింగ్ ట్రాక్ మరమత్తుల పేరుతో గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం మూసివేయటంతో వాకర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 15 రోజుల్లో పూర్తి చేయాల్సిన పనులను నెలరోజులు కావస్తున్నా నేటికీ పూర్తి చేయకపోవటంతో స్ధానిక ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన పనుల్లో ఏమాత్రం నాణ్యత లేదని పలువురు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వాకింగ్ ట్రాక్ మరమత్తులు చేయటానికే నెలరోజుల సమయం పడితే నగరంలోని శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ నిర్మాణం కనీసం 5ఏళ్ళు పట్టటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది.
ఎన్టీఆర్ స్టేడియం వాక్ ట్రాక్ మూసివేయటంతో వృద్ధులు, మధ్యవయస్సులు, యువకులు సుదూర ప్రాంతాల్లో ఉన్న వాకింగ్ ట్రాక్ లకు వెళ్ళలేక నగరంలోని రోడ్లపైనే వాకింగ్ చేయాల్సి వస్తుంది. రోడ్లపై నడుస్తున్న సందర్భంలో పలువురు వాహనాలు ఢీకొట్టటం వల్ల గాయాలపాలైన ఘటనలు ఉన్నాయి. అదే క్రమంలో పలువురు ఉదయం తెల్లవారు జామున రోడ్లపై వాకింగ్ చేస్తూ కుక్కకాటుకు గురైన ఘటనలు లేకపోలేదు. మరోవైపు రోజువారి వ్యాయామాలు లేకపోవటంతో పలురకాల ఆరోగ్య పరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు.

ప్రస్తుతం వర్షాలు లేని సమయంలో త్వరితగతిన చేయాల్సిన పనులను నాన్చుడు ధోరణితో నెలలకొద్ది చేస్తుండటం పట్ల అసంతృప్తి వ్యక్తమౌతుంది. మరోవైపు ట్రాక్ మరమత్తు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఈ పనుల్లో తనకు పెద్దగా లాభం మిగిలేది లేదని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడన్న ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవ మెంతే కార్పోరేషన్ అధికారులు, పాలకులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.