
Andhrapradesh Census ; ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జనగణన నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రప్రభుత్వం జారీ చేసిన జనగణన నోటిఫికేషన్‌ను అనుగుణంగా జనగణకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నోటిఫికేషన్ జారీ చేసింది. 2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ ఏడాది జూన్ 16న కేంద్రహోంశాఖ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కాబోతుంది.
ఈసారి నిర్వహించే జనగణన కోసం కేంద్రం డిజిటల్ విధానంలో చేపట్టనుంది. ఇందులో భాగంగా ఇంటి నుంచే వివరాలు నమోదు చేసుకునేలా ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను నెలకొల్పనున్నారు. ఇళ్ల స్థితిగతులు, సౌకర్యాలు, ఆస్తుల వివరాలతోపాటు ఇతర వివరాలను అందులో నమోదు చేస్తారు. ఈ 16వ జనాభాలెక్కల సేకరణ డిజిటల్ యాప్‌ల విధానం ద్వారా సులభతరం కానుంది. ఉపాధ్యాయులు, స్వీయధ్రువీకరణతో ప్రజలే ఈ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

2027 మార్చి 1 నుంచి ఏపీ వ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభించనున్నట్లు జీఎడీ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు భారత జనాభా లెక్కల ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయంతీసుకుంది. మొదటి దశ అక్టోబర్ 1, 2026 నుంచి మొదలుకానుండగా, తొలిదశలో జమ్మూ కశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో జనగణన జరుగనుంది. ఇక రెండవ దశ మార్చి 1, 2027 నుంచి దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.