
Mega Parent Teacher Meet 2025 ; పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. తల్లితండ్రులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పాఠశాల అనేది విద్యను అందించే దేవాలయం , ఈ ఆధునిక దేవాలయాలను రక్షించుకునే బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. ఈ స్థాయిలో తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్న విద్యా శాఖ మంత్రి లోకేష్ ను అభినందించారు. తల్లితండ్రుల తర్వాత ఉపాధ్యాయుడినే ఆరాధించటం మన సంప్రదాయమన్న సియం, గురుపౌర్ణమి రోజున రాష్ట్రవ్యాప్తంగా 61 వేల పాఠశాలల్లో 2.28 కోట్ల మందితో ఈ సమావేశం నిర్వహించుకోవడం సంతోషదాయకమన్నారు.

లోకేష్ పాఠశాలలో ఉన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్ నేను ఎప్పుడూ వెళ్లలేకపోయానని, తన సతీమణి భువనేశ్వరి ఏ సమావేశాన్నీ విడిచిపెట్టకుండా వెళ్లి లోకేష్ ను కేంబ్రిడ్జి వరకూ చదివించటంలో శ్రద్ధ పెట్టారని చెప్పారు. డ్వాక్రా సంఘాలకు పొదుపు నేర్పించి కుటుంబ ఆదాయం పెరిగేలా చేయటంలో కీలకపాత్ర వహించి, తద్వారా మహిళల పొదుపు కోసం బలమైన వ్యవస్థకు రూపకల్పన చేసి అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చామన్నారు. కుటుంబంలో ఉన్న ప్రతీ పిల్లవాడినీ చదివించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకాన్ని అందరికీ వర్తింప చేశామన్నారు. ఎంతమంది ఉన్నా వారందరికీ ఈ పథకాన్ని అందించి ఆ కుటుంబాల్లో వెలుగులు తీసుకువచ్చామన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాశాఖ బాధ్యతను లోకేష్ ఏరికోరి తీసుకున్నారని పేర్కొన్నారు.

విద్యార్ధుల హాజరు,మార్కులు తెలుసుకునేందుకు లీప్ యాప్;
మొదటి దఫా పేరెంట్ టీచర్ మీటింగ్ ను 44 వేల పైచిలుకు పాఠశాలల్లో నిర్వహించాం. ఈసారి ప్రైవేటు స్కూళ్లలోనూ వీటిని నిర్వహించాలని ఆదేశించామన్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0కు 2.28 కోట్ల మంది హాజరయ్యారు. గిన్నీస్ రికార్డు సాధించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. తల్లిపేరిట ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటేలా చర్యలు తీసుకున్నామన్న సియం, వారికి గ్రీన్ పాస్ పోర్టు కూడా ఇచ్చినట్లు చెప్పారు.
తల్లితండ్రులు లీప్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోని, విద్యార్ధుల హాజరు, వారికి వచ్చిన మార్కులు , ప్రవర్తన అన్నీ యాప్ ద్వారా సమాచారం తెలుసుకోవాలని సూచించారు. విద్యార్ధులకు మంచి నాణ్యమైన యూనిఫాం, బూట్లు, బెల్టు, బ్యాగ్ ఇచ్చామని గత ప్రభుత్వం లాగా విద్యార్ధులకు ఇచ్చిన కిట్లపై ఎలాంటి వ్యక్తుల ఫోటోలు పెట్టలేదన్నారు.
డ్రగ్స్ , గంజాయి విక్రయించేవారికి సంక్షేమపధకాలు కట్;

గత ప్రభుత్వ హయాంలో విశాఖ ఏజెన్సీలో గంజాయి పెద్ద ఎత్తున పండించారు. డ్రగ్స్ , గంజాయి విక్రయించినా పండించినా అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం ద్వారా దీన్ని నియంత్రించటంతోపాటుగా, డ్రగ్స్ , గంజాయి విక్రయించే వారి ఆస్తిని కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు. డ్రగ్స్ , గంజాయి విక్రయించేవారి కుటుంబాలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక మెగాడీఎస్సీ నిర్వహించి 16,347 మంది ఉపాధ్యాయులను నియమిస్తున్నామని, ఆగస్టు నాటికల్లా వారంతా పాఠశాలలకు వస్తారని అన్నారు.
భవిష్యత్ అంతా నాలెడ్జ్ ఎకానమీదే;

ఇక అంతా హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ చేయాలి. ఐటీ వల్ల మన తెలుగువాళ్లు దేశవిదేశాల్లో బాగా సంపాదించగలుగుతున్నారు. పిల్లలను బాగా చదివిస్తే ఊహించని విధంగా వారి జీవితాల్లో మార్పు వస్తుంది. భవిష్యత్ అంతా నాలెడ్జ్ ఎకానమీదే. దానికి అనుగుణంగా మన విద్యార్ధులను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
అనంతరం కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ మధ్యాహ్న భోజనం చేశారు.