రాయలసీమలో ఫేమస్..గువ్వల చెరువు పాలకోవ

పాలకోవ ఇది తినటానికి ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాదు మన శరీరానికి శక్తిని అందిస్తుంది. పిల్లలు మరియు పెద్దలు ఎంతో ఇష్టంగా దీనిని తింటారు. ఒకప్పుడు పెద్దాపురం అంటే పాలకోవ తయారీకి పెట్టింది పేరు..అయితే ప్రస్తుతం అదే కోవలోకే చెందుతుంది ఉమ్మడి కడప జిల్లా రామాపురం మండలంలోని గువ్వల చెరువు గ్రామం. కొత్తవారు ఎవరైనా ఆగ్రామంలోకి అడుగు పెట్టగానే గుభాయించి వాసన వస్తుంది. వాసన పీలిస్తేనే తెలియకుండానే నోరూరిపోతుంది. గ్రామానికి చెందిన అనేక మంది పాలకోవ తయారీని ఉపాధిగా చేసుకుని తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. ఇక్కడ తయారైన పాలకోవ దేశాలు దాటి వెళుతుందంటే అతిశయోక్తికాదు.

గువ్వల చెరువు గ్రామంలో పాలకోవ తయారీ అనేది కుటీరపరిశ్రమగా సాగుతుంది. 50 ఏళ్ల క్రితం నుండే పాలకోవా తయారీ మొదలైనట్లు గ్రామ పెద్దలు చెబుతున్నారు. రాయచోటి- కడప మార్గంలోని ఘాట్‌రోడ్డు దిగువనే గువ్వలచెరువు గ్రామంలో ఒకనాడు ఒకరిద్దరితో ప్రారంభమైన పాలకోవ తయారు ఆతరువాత కాలంలో గ్రామంలో చాలా మంది దీనిని తయారీ వైపు అడుగులు వేసేలా చేసింది. రుచిలోనే కాదు, నిల్వ సామర్థ్యం కూడా ఉండటంతో ఈ కోవాను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపటంతో గువ్వల చెరువు పాలకోవకు డిమాండ్ పెరిగింది. స్వచ్ఛమైన పాలను ఈ కోవా తయారీకి ఉపయోగిస్తారు. ప్రత్యేకంగా దీని తయారీలో మెలకువలు పాటించటంవల్ల వారం పది రోజుల పాటు ఈ పాలకోవ నిల్వ ఉంటుంది.

కర్నూలు- చిత్తూరు జాతీయరహదారి మార్గంలో ఏప్పుడైనా వెళుతుంటే సుమారు 100 పాల కోవా విక్రయించే దుకాణాలు రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తాయి. రాత్రిపగలు తేడాలేకుండా నిరంతరం గ్రామస్తులు పాలకోవ విక్రయాలు సాగిస్తుంటారు. జాతీయరహదారిపై ప్రయాణించేవారు తమ వాహనాలు నిలిపిమరీ ఈ పాలకోవను కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా మరికొందరు గ్రామస్తులు ఆటోలు, ద్విచక్ర వాహనాలపై పరిసరప్రాంతాలైన కడప, రాయచోటి, చిత్తూరు, మదనపల్లి, పీలేరు వెళ్ళి విక్రయాలు సాగిస్తుంటారు.

చక్కెర, బెల్లం వంటి పదార్థాలు ఈ పాలకోవలో వినియోగిస్తూ రుచికరంగా తయారు చేస్తారు. నిత్యం 600 నుంచి 800 కిలోల వరకు పాలకోవను విక్రయిస్తామని స్ధానికులు చెబుతున్నారు. ప్రతిరోజు పాలకోవ తయరీకోసం 4 నుంచి 8 వేల లీటర్లు పాలు ఉపయోగిస్తున్నారు. గల్ఫ్‌ దేశాలకు సైతం ఈపాలకోవాను పంపిస్తున్నారంటే సామాన్యమైన విషయంకాదు. గ్రామంలోని కొందరు పాలకోవాను స్వీట్ షాపుల వారికి అర్డర్లపై అందిస్తున్నారు. కొందరు టెక్నాలజీ సాయంతో ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా ఇంటికి పంపే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

×