
అమరావతి: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ రేపు అమరావతికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బిల్ గెట్స్ రావటం ఇదేం కొత్తకాదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కూడా, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు బిల్ గేట్స్ రాష్ట్రాన్ని సందర్శించారు. బిల్ గేట్స్‌తో 1995 నుండి తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అనే సందర్భాల్లో వెల్లడించారు.
ఆయన ఉమ్మడి ఏపికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైక్రోసాఫ్ట్ ను హైదరాబాదులో స్థాపించడానికి బిల్ గేట్స్ తో ఒప్పందం కుదుర్చుకోవడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. గతంలో హైదరాబాదుకు వచ్చిన బిల్ గేట్స్… నేడు అమరావతికి వస్తున్నారు. రెండు పర్యటనలు భిన్నమైనప్పటికీ కానీ వాటి లక్ష్యం మాత్రం అభివృద్ధే. అప్పటి బిల్ గేట్స్ పర్యటన ఐటీ రంగానికి దిశానిర్దేశం చేస్తే… నేటి పర్యటన ఆరోగ్యం, వ్యవసాయం, డిజిటల్ గవర్నెన్స్ రంగాలపై దృష్టి సారిస్తోంది.
2002 ప్రాంతంలో బిల్ గేట్స్ హైదరాబాదును సందర్శించారు. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్‌గా ఎదుగుతోంది. HITEC సిటీ, ఈ-గవర్నెన్స్ సేవలు, డిజిటల్ సేవల విస్తరణ ప్రధాన అజెండాగా ఉన్నాయి. ఆ రోజు మైక్రోసాఫ్ట్ పెట్టుబడుల విస్తరణ , ఈ-గవర్నెన్స్, డిజిటల్ సర్వీసులపై భాగస్వామ్యం, ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విద్యా, ఆరోగ్య రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ప్రారంభ చర్చలు జరిపేందుకు హైద్రాబాద్ కు బిల్ గేట్స్ రావటం జరిగింది. ఆ పర్యటన తరువాత రాష్ట్రంలో ఐటీ రంగం మరింత వేగం అందుకుంది. హైదరాబాదు దేశంలో ప్రముఖ టెక్ హబ్‌గా ఎదగడంలో బిల్ గెట్స్ పర్యటన కీలకంగా మారిందనే చెప్పుకోవాలి.
ప్రస్తుతం బిల్ గెట్స్ పర్యటన విషయానికి వస్తే మూడు రంగాల్లో ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ కు కొత్త దిశ,దశ చూపించనున్నారు. హైదరాబాద్ లో ఆరోజు బిల్ గెట్స్ పర్యటన ద్వారా ఐటీ కంపెనీల ఆహ్వానం, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, ఈ-సేవలు వంటి కార్యక్రమాలు ఉమ్మడి ఏపి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపాయి.
డిజిటల్ గవర్నెన్స్ ; రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌ను పరిశీలించనున్నారు. డేటా ఆధారిత పాలన మోడల్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనేదే లక్ష్యంగా గెట్స్ పర్యటన కొనసాగనుంది. అమరావతిలో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డేటాను ఒకే వేదికపై సమీకరించి, నిర్ణయాలను వేగంగా తీసుకునే విధానం అమలు చేస్తున్నారు. ఇది పరిపాలనలో పారదర్శకత, సమర్థత పెంచే ప్రయత్నంగా చెప్పవచ్చు.
సంజీవనీ ప్రాజెక్ట్ ; ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, గ్రామీణ వైద్య సేవల విస్తరణపై చర్చలు జరపనున్నారు. తద్వారా గేట్స్ ఫౌండేషన్ అనుభవం రాష్ట్రానికి దోహదపడే అవకాశముంది.సంజీవని వంటి ప్రాజెక్టుల ద్వారా ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కల్పించడం, గ్రామీణ ప్రాంతాలకు టెక్నాలజీ ఆధారిత వైద్య సేవలు అందించడం వంటి చర్యలు, ఆరోగ్య రంగాన్ని ఆధునికీకరించే ప్రయత్నంగా నిలబోనున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిల్ గేట్స్ వంటి వ్యక్తి ఆసక్తి చూపడం ఈ ప్రాజెక్టులకు మరింత విస్తరించే అవకాశం ఉంటుంది.
వ్యవసాయం – స్మార్ట్ ఫార్మింగ్; ఉండవల్లిలో డ్రోన్లు, AI ఆధారిత సాగు విధానాల పరిశీలన. రైతుల ఆదాయం పెంపు లక్ష్యం తదితర విషయాలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. డ్రోన్లు, సెన్సర్లు, AI ఆధారిత పంట పర్యవేక్షణ విధానాలు రైతుల ఉత్పాదకతను పెంచే దిశగా ముందడుగుగా భావించవచ్చు. ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రయత్నాలు, సాంకేతికతను గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేస్తయనే చెప్పవచ్చు.
బిల్ గేట్స్ గత హైద్రాబాద్ పర్యటన ఐటీ రంగానికి పునాది వేయగా, నేటి పర్యటన సామాజిక రంగాలపై దృష్టి సారిస్తోంది. ఇది అభివృద్ధి వ్యూహంలో మార్పును సూచిస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలోలాగా ఈ పర్యటన కూడా దీర్ఘకాల ఫలితాలు ఇస్తుందా? ఒప్పందాలు, భాగస్వామ్యాలు, అమలు దశలు ఎంతవరకు ముందుకు సాగుతాయి అనేదే తేలాల్సి ఉంది. అయితే బిల్ గెట్స్ పర్యటన రాష్ట్రానికి మరో గ్లోబల్ కనెక్ట్ కు అవకాశంగా మారబోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాదు నుంచి అమరావతి వరకు… బిల్ గేట్స్ పర్యటనలు రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో కీలక ఘట్టాలుగా మిగులు తాయనే చెప్పుకోవాలి. ఈసారి పర్యటన రాష్ట్ర భవిష్యత్తుకు ఎంత మేలు చేస్తుందో మరికొంతకాలం వేచిచూడాల్సిందే…ఏదిఏమైన రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు పట్టుదల గురించి చెప్పేందుకు బిల్ గెట్స్ అమరావతికి రాక స్పష్టం చేస్తుంది.
గుంటుపల్లి రామకృష్ణ, జర్నలిస్ట్