
అమరావతి: రాష్ట్ర సమాచార హక్కు వ్యవస్థను మరింత పారదర్శకంగా, ప్రజలకు సులభతరంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కీలక ముందడుగు వేస్తోంది. త్వరలోనే సమాచార శాఖ పరిధిలోని అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచార శాఖ ముఖ్య కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు వెల్లడించారు.
సమాచార హక్కు చట్టం–2005 కింద ప్రజలు తమ దరఖాస్తులు, మొదటి అప్పీలు, రెండో అప్పీలు, ఫిర్యాదుల కోసం ప్రత్యక్షంగా కార్యాలయాలకు రావాల్సి వస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు RTI సేవలను పూర్తిగా డిజిటల్ విధానంలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ మేరకు రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో RTI ఆన్‌లైన్ పోర్టల్ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పోర్టల్ ద్వారా RTI దరఖాస్తులు స్వీకరణ, అప్పీల్లు, ఫిర్యాదుల నమోదు, వాటి స్టేటస్ ను స్పష్టంగా తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. అలాగే కేసుల నిర్వహణ, సమాచారం అందించటం, రికార్డుల భద్రపరిచే విధానాల్లోనూ డిజిటలైజేషన్ అమలు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టు అమలుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) సాంకేతిక సహకారం అందిస్తోంది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, పరీక్షలు (టెస్టింగ్), ధృవీకరణ (వాలిడేషన్), అమలు (డిప్లాయ్‌మెంట్) దశల్లో పనులు కొనసాగుతున్నట్లు వివరించారు.
ఇటీవల విడుదలైన G.O.Ms.No.25 (తేది: 18-02-2026) ప్రకారం RTI కేసులు, అప్పీల్స్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (RTIMIS)ను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానం అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు (PIOలు), ఫస్ట్ అప్పిలేట్ అథారిటీలు (FAAలు)కి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని 2026 ఫిబ్రవరి 28లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆన్‌లైన్ సేవలు ప్రారంభమైతే, RTI ప్రక్రియ మరింత వేగవంతం అవడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. సమాచార హక్కు చట్టం అమలులో ఇది ఒక కీలక సంస్కరణగా నిలవనుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.