
అమరావతి : పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, నాయకత్వం,శ్రేణుల మధ్య అనుబంధాన్ని పెంపొందించడం లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వారి కుటుంబసభ్యులతో ఆత్మీయ విందు సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించారు.
ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే… రోజుకు ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసి, ఆ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు, సంబంధిత ఎమ్మెల్సీలను వారి కుటుంబాలతో సహా ఆహ్వానించి డిన్నర్ మీట్ ఏర్పాటు చేయడం…. ఈ డిన్నర్ మీట్ లలో రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా, వ్యక్తిగత స్థాయిలోనూ పరస్పర అవగాహన పెంపొందించే వేదికగా రూపొందిస్తున్నారు.
సాధారణంగా రాజకీయ సమావేశాలు అనేవి భవిషత్ పార్టీ కార్యాచరణ, ఎన్నికల వ్యూహాలు, పాలన అంశాలపైనే జరుగుతుంటాయి. అయితే ఈ సారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆత్మీయ వాతావరణంలో డిన్నర్ మీట్ లో చర్చలు జరపాలని లోకేష్ నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబసభ్యుల అభిప్రాయాలు, వారి అభిరుచులు, ఎదుర్కొంటున్న వ్యక్తిగత, ఇతర సవాళ్లను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే డిన్నర్ మీట్ కార్యక్రమాన్ని లోకేష్ చేపట్టారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నాయకుల యోగక్షేమాలు, నియోజకవర్గాల సమస్యలు, స్థానిక అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితులపై లోకేష్ నేరుగా తెలుసుకోనున్నారు. ముఖ్యంగా గ్రామ, మండల స్థాయి కార్యకర్తల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను ఎమ్మెల్యేల ద్వారా సేకరించే అవకాశం కూడా ఉంటుంది.
ఇటీవల రాజకీయంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అంతర్గత సమన్వయం కీలకంగా మారింది. కొత్త తరహా రాజకీయ సంస్కృతిని నెలకొల్పాలనే లక్ష్యంతో ఈ ఆత్మీయ విందు సమావేశాలు చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేల మధ్య పరస్పర అనుభవాలను పంచుకోవటం, ఒకరికొకరు మద్దతు, సమన్వయంతో ముందుకు సాగేందుకు ఇది దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సమావేశాల్లో ప్రధానంగా వచ్చే ఎన్నికల వ్యూహం, నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతం, యువత,మహిళలను పార్టీలో చేర్చుకోవడం, సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవటం వంటి అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రతి పార్లమెంట్ పరిధిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా ఈ డిన్నర్ మీట్లు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు.
సాంప్రదాయ రాజకీయ సమావేశాలకంటే భిన్నంగా, కుటుంబాలతో కలిసి జరిగే ఈ సమావేశాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నాయి. క్రింది స్థాయి క్యాడర్ కు నాయకత్వం అందుబాటులో ఉందన్న భావన కలిగించడమే కాకుండా, వ్యక్తిగత అనుబంధాన్ని పెంపొందించే దిశగా ఇది ఒక కొత్త ప్రయోగంగా నిలవబోతుందనే చెప్పుకోవాలి.
మొత్తంగా చూస్తే, నారా లోకేష్ చేపట్టిన ఈ డిన్నర్ మీట్ కార్యక్రమం పార్టీ అంతర్గత బలాన్ని పెంచడమే కాకుండా, నాయకత్వానికి, గ్రౌండ్ లెవల్ ఉన్న పరిస్థితులను, ఇప్పటికే సేకరించిన నియోజకవర్గాల వారీగా సమాచారాన్ని అందించే వేదికగా మారనుంది. రాజకీయంగా ఇది ఎంతవరకు ఫలితాలిస్తుందో వేచి చూడాల్సిన అంశమే అయినా , నారా లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం కొత్త రాజకీయ సంప్రదాయానికి నాంది పలుకుతుందనే చెప్పుకోవాలి…