
2-in-1 Transport Vehicle : చదువులేకపోతేనేం…తెలివితేటలకు మాత్రం కొదవలేదు….ఆ తెలివి తేటలతోనే విన్నూత్న ఆలోచనలు చేస్తూ అందరితోనే శభాష్ అనిపించుకుంటున్నాడు కాకినాడ కుర్రోడు. తన టాలెంట్ ను ఉపయోగించి ప్రత్యేకమైన వాహనాన్ని తయారు చేశాడు. బ్యాటరీ శక్తితో పని చేసే 2 ఇన్ 1 ట్రాన్స్ పోర్ట్ వెహికల్ తయారు చేసి తన సత్తాను చాటుకున్నాడు. ఇంతకీ ఆవిశేషాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
విజయవాడకు చెందిన సుధీర్ కుటుంబం కొన్నేళ్ళ క్రితం కాకినాడ ప్రాంతానికి వలస వెళ్ళారు. ఇంజనీరింగ్ చదవాలన్న కోరిక ఉన్నప్పటికీ, తన తండ్రి మరణంతో ఆకోరిక నెరవేరలేదు. 2014లో ఉపాధికోసం కంప్యూటర్ కోర్సు పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్ వెళ్లాడు. హైదరాబాద్, బెంగళూరులో పని చేస్తున్న సందర్భంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఆయనలో సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టేలా చేశాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ రద్దీని సులభంగా దాటగలిగే ప్రత్యామ్నాయ రవాణా రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినప్పుడు బైక్‌లు ఏ విధంగా చిన్న దారిలో కూడా దూసుకుని ముందుకు వెళ్తున్నాయో గమనించి అందుకు తగ్గట్టుగానే ఒక వాహనాన్ని రూపొందించాడు.
ఈ వాహనం ప్రత్యేకత విషయానికి వస్తే ఇది కారు గా, అలాగే బైక్ గా ఉపయోగించవచ్చు. ఆటోమేటిక్ గా మారగల వాహనం ఇది. వాహనం బ్యాటరీ శక్తితో , హైడ్రాలిక్ వ్యవస్థపైనా పని చేస్తుంది. వాహనం 7 అడుగుల పొడవు, కాంపాక్ట్‌గా ఉన్నప్పుడు 2.11 అడుగుల వెడల్పు.. 4.2 అడుగుల వెడల్పు వరకు సర్దుబాటు అయ్యేలా డిజైన్ చేశాడు. రెండు మడతపెట్టుకునే సీట్లు ఉంటాయి. సర్దుబాటు చేస్తే అవినాలుగు సీట్లుగా మారతాయి. వాటిలో ఒకటి డ్రైవర్ కోసం. మూడు ప్రయాణీకుల కోస మని సుదీర్ చెప్తున్నాడు.
వాహనం బరువు 410 కిలోలు. ఒక్కొక్కరు 80 కిలోల బరువున్న నలుగురు ప్రయాణీకులు కూర్చొంటే దాదాపు 730 కిలోలకు దాని బరువు చేరుకుంటుంది. దీనికోసం సుదీర్ 2 లక్షలు ఇప్పటి వరకు వెచ్చించాడు. ఇంజిన్, టైర్లు, బ్యాటరీ, హైడ్రాలిక్ సిస్టమ్, మెటల్ బాడీ, పెయింట్, సీట్లు, స్టీరింగ్, బ్రేకింగ్ సిస్టమ్ వంటి భాగాల కొనుగోలు కోసం ఈ మొత్తాన్ని వెచ్చించాడు. సుధీర్ దానికి BMW తరహాలోనే MZ అని అంటే మెల్చి జెడాక్ అని పేరు పెట్టారు. ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించాడు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆ వీడియోలను పోస్ట్ చేయటంతో ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. JNTU, ఆదిత్య విశ్వవిద్యాలయం నిపుణులు ఈ వినూత్న వాహనాన్ని పరిశీలించి సుదీర్ కు సత్కారం కూడా చేశారు. 75 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ కోసం యూఏఈకి చెందిన ఒక కంపెనీతో సుదీర్ చర్చలు జరుపుతున్నాడు. ప్రభుత్వం తనకు మద్దతు ఇస్తే, ఈ వినూత్న ప్రాజెక్టు పట్టాలెక్కిస్తానంటున్నాడు సుదీర్…