ఒంగోలు గడ్డ బాలినేని అడ్డానా ? వచ్చే ఎన్నికల నాటికి ఆయన దారెటు ?

వైసీపీ అధినేత జగన్‌కు బంధువు, అత్యంత సన్నిహితుడు, ఒకప్పటి వైసీపీ కీలక నేత, ప్రస్తుతం జనసేన లో ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ నేత రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పేరుకు అధికారంలో ఉన్న కూటమి పార్టీలో ఒకటైన జనసేనలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఆయన తనలోని రెండో మనిషిని నిద్రలేపుతుండటం కూటమి పార్టీల నేతలకు అంతుచిక్కటంలేదు. వైసీపీ ని వీడి జనసేనలో చేరటంపై తొలి నుండి స్థానికంగా ఉన్న టిడిపి నేతలకు ఏమాత్రం రుచించటం లేదు. ఒంగోలు కూటమి రాజకీయాల్లో ఆయన అరంగెట్రంతో ఒకరకంగా అగ్గిరాజుకున్నట్లైంది. ఇంతకీ ఆయనెవరో ఈ కధనం చదవితే మీకే తెలుస్తుంది.

బాలినేని శ్రీనివాస రెడ్డి…ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో ఇతనెవరో తెలియని వారుండరు. 5 సార్లు(1999 నుండి 2019) వరకు ఒంగోలు నుండి శాసనసభ్యునిగా గెలుపొందిన బాలినేని కాంగ్రెస్ ప్రభుత్వంలో సియంగా రాజశేఖరరెడ్డి ఉండగా ఆయన మంత్రి వర్గంలో పనిచేశారు. ఆతరువాత ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తరువాత వైసీపిలో చేరి ఆపార్టీ నుండి పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మంత్రి వర్గంలో కూడా చోటు సంపాదించాడు. వైయస్ కుటుంబానికి వీర విధేయునిగా ఉంటూ ప్రకాశం జిల్లాలో వైసీపీని చాలా కాలం పాటు అన్నీ తానై నడిపించాడు.

వైసీపీ అధికారం కోల్పోవటంతో జనసేనలోకి ;

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్ శాఖ లో అనేక అవకతవకలు, కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. తాము అధికారంలోకి వస్తే బాలినేని లెక్కలు సరిచేస్తామని అప్పట్లోనే టిడిపి , జనసేన నేతలు బాహాటంగానే ప్రకటించారు. అయితే జగన్ అధికారం కోల్పోయాక బాలినేని ఏం ఆలోచించారో ఏమో తెలియదు కాని జగన్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేసి జనసేన పార్టీలోకి అరంగెట్రం చేశారు. ఆయన జనసేనలోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి ఒంగోలు కూటమి పార్టీలైన టిడిపి, జనసేనల మధ్య రాజకీయ పోరు ప్రారంభమైంది. తొలి నుండి టిడిపి రాజకీయాలు నడిపిస్తున్న దామేచర్ల జనార్ధన్ కు, బాలినేని శ్రీనివాసరెడ్డికి రాజకీయ వైరం ఉంది. 2024 ఎన్నికల్లో దామేచర్ల జనార్ధన్ ఒంగోలు నియోజకవర్గం నుండి గెలుపొందారు. అదే నియోజకవర్గంలో వైసీపి తరుపున పోటీ చేసి బాలినేని జనార్ధన్ చేతిలో ఒటమి పాలయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య రాజకీయ వైరం పీక్స్ కు చేరింది.

అవకాశం దొరినప్పుడల్లా హట్ కామెంట్లతో ప్రకాశం రాజకీయాల్లో బాలినేని కాక రేపుతున్నారన్న చర్చ సాగుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన చేసిన ప్రకటన సర్వత్రా ఆసక్తికరంగా మారింది. తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుండే జనసేన తరుపున పోటీ చేస్తానని, ఒక వేళ టిక్కెట్ ఇవ్వని పక్షంలో ఇండిపెండెంట్ గా బరిలోకి తిగుతానని ప్రకటించారు. ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రకటనపై కూటమిలోని ప్రధాన తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే దామేచర్ల జనార్ధన్ సైతం బాలినేని స్టేట్ మెంట్ పై గుర్రుగా ఉన్నారు.

బాలినేని కామెంట్ల కలకలం ;

బాలినేని చేసిన ఈ వ్యాఖ్యల వెనక పెద్ద పొలిటికల్ గేమ్ ఉండి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు. జనసేన అధిష్టానం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవచ్చన్న అంచనాలతోనే బాలినేని ఇండిపెండెంట్‌గానైనా పోటీచేస్తానంటూ ఒక రకంగా పవన్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న వాదన లేకపోలేదు. వాస్తవానికి 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నియోజకవర్గాలు పెరుగుతాయని తద్వారా ఇప్పుడున్న ఒంగోలు నియోజకవర్గం సిటీ, రూరల్ గా ఏర్పడుతుందన్న అంచనాతో బాలినేని ఉన్నారు. అయితే జనగణన పూర్తయ్యేంత వరకు నియోజకవర్గాల పునర్విభజన జరిగే పరిస్ధితి లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో తన పోటీ ఎక్కడి నుండన్న దానిపై ఆయనలో అంతర్మధనం మొదలైంది.

బాలినేనికి సీటు పక్కాగా దక్కేనా ?

ప్రకాశం జిల్లాలో గుర్తింపు ఉన్న నేత కావటం వల్ల బాలినేనికి టిక్కెట్ మాత్రం పక్కాగానే దక్కుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ఇదే కూటమి పార్టీల నడుమ పొత్తు కొనసాగితే బాలినేనికి ఒంగోలు నుండి పోటీ చేసే అవకాశం ఆయనకు దక్కటం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని జనసేనకు ఆ సీటును టిడిపి త్యాగం చేసే అవకాశం ఉండదు. అయితే బాలినేనికి మాత్రం మరో నియోజకవర్గం నుండి టిక్కెట్ కేటాయించే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి.

గత ఎన్నికల్లో దర్శి నియోజకవర్గాన్ని టిడిపి చేజార్చుకుంది. అక్కడి నుండి కమ్మ సామాజిక వర్గానికి చెందిన గొట్టిపాటి లక్ష్మీని బరిలోకి దించా ఆమె ఒటమి పాలయ్యారు. అయితే బాలినేనిని దర్శి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపితే కుల సమీకరణల్లో ఈజీగా దర్శి సీటును గెలవచ్చన్న అంచనాలో కూడా పవన్ , చంద్రబాబులు ఉన్నట్లు తెలుస్తుంది. బాలినేనిని పోటీ చేస్తే నియోజకవర్గంలో గెలుపును డిసైడ్ చేసే కాపు, కమ్మ, రెడ్డి ఓట్లతో ఈ సీటును ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందన్న అంచనాలు కూటమి పార్టీల్లో లేకపోలేదు.

అలాగే ప్రకాశం జిల్లాలోని మరో నియోజక వర్గం గిద్దలూరు అభ్యర్థిగానైనా బాలినేని బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదు. నియోజకవర్గాల్లో పునర్విభజన జరుగుతుందని, ఒక వేళ జరగకుంటే మార్కాపురం,దర్శిలలో ఏదో ఒక నియోజకవర్గంలో ఆయన్ను సర్దుబాటు చేసే ఆలోచనతోనే ఆయన్ను జనసేనలోకి చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వాదన గతంలోనే వినిపించింది. మరి ప్రస్తుతం బాలినేని వచ్చే ఎన్నికల్లో తన సీటు ఎక్కడో పక్కాగా తేల్చుకునేందుకే ప్రస్తుతం ఈ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాననే స్టేట్ మెంట్ ఇచ్చాడా అన్న ప్రశ్నకలుగుతుంది. జనసేన అధిష్టానం పిలిచి మాట్లాడి ఒక భరోసా ఇవ్వాలని బాలినేని కోరుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ సీటు దక్కకపోతే ఆరోజు ఉన్న పరిస్ధితుల్లో వైసీపీ పుంజుకుంటే తిరిగి జగన్ చెంతకు చేరతారన్న ప్రచారం లేకపోలేదు. రాజకీయాల్లో ఏ క్షణంలో ఏంజరుగుతుందో ఎవరూ ఊహించలేరు. భద్ధ శత్రువులే మిత్రులై చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా బాలినేని రాజకీయ భవిష్యత్తు రానున్న రోజుల్లో ఎన్ని మలుపులు తిరగబోతుందో వేచి చూడాల్సిందే!

×