
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హాజరు నమోదు వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచే అసెంబ్లీలో ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నైజేషన్ హాజరు విధానం అమల్లోకి రానుంది. గత సమావేశాల్లో హాజరు వివాదాల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇకపై కేవలం రిజిస్టర్‌లో సంతకం చేస్తే సరిపోదు… సభ్యులు తమ కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే హాజరు నమోదవుతుంది. రేపటి నుంచే ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అమల్లోకి రానుంది. సభ్యుల ముఖాన్ని గుర్తించే సాంకేతిక వ్యవస్థ ద్వారా హాజరు నమోదు చేయనున్నారు.
గత రెండు అసెంబ్లీ సమావేశాల్లో కొందరు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకపోయినా బయట ఉన్న రిజిస్టర్‌లో సంతకాలు చేసి హాజరైనట్లు నమోదు చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయ్. ఈ ఘటనలతో హాజరు వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో హాజరు నమోదు జరిగేలా ప్రభుత్వం ఈ సాంకేతిక విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా ముఖ గుర్తింపు తప్పనిసరి. ఇదే విధానాన్ని భవిష్యత్తులో పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
మొత్తానికి, అసెంబ్లీ వ్యవహారాల్లో పారదర్శకత పెంపు… సాంకేతికత వినియోగం… ప్రజల్లో చట్టసభల పట్ల నమ్మకం పెంచటం వంటి మూడు లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.