
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమరావతికి రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన పలు కీలక ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. ముఖ్యంగా రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్, సంజీవని ఆరోగ్య ప్రాజెక్ట్, అలాగే ఉండవల్లిలో టెక్నాలజీ ఆధారిత వ్యవసాయ విధానాలను వీక్షించనున్నారు.
అమరావతి కేంద్రంగా బిల్ గేట్స్ పర్యటనకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. పర్యటనలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలవనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న డిజిటల్ గవర్నెన్స్ విధానాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ అధికారులు ఇవ్వనున్నారు.
పర్యటనలో భాగంగా అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌ను బిల్ గేట్స్ సందర్శించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డేటాను ఒకే వేదికపై సమీకరించి, ప్రజలకు సేవలను వేగవంతంగా అందించే విధానాన్ని ఆయన పరిశీలించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రభుత్వం ఎలా నిర్ణయాలు తీసుకుంటుందో వివరించనున్నారు అధికారులు.
అదే సమయంలో ఆరోగ్య రంగంలో అమలు చేస్తున్న “సంజీవని” ప్రాజెక్టుపై కూడా బిల్ గేట్స్‌కు సమగ్ర వివరణ ఇవ్వనున్నారు. ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణ, టెక్నాలజీ ఆధారిత ఆరోగ్య నిర్వహణ వంటి అంశాలు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.
అలాగే అమరావతి సమీపంలోని ఉండవల్లి వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, సెన్సర్లు, AI ఆధారిత పంట పర్యవేక్షణ విధానాలను బిల్ గేట్స్ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. రైతుల ఉత్పాదకత పెంపు, ఖర్చుల తగ్గింపు, ఆధునిక సాగు పద్ధతులపై చర్చలు జరగనున్నాయి.
బిల్ గేట్స్ పర్యటనతో రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఆరోగ్యం, వ్యవసాయం, టెక్నాలజీ రంగాల్లో మరిన్ని భాగస్వామ్యాలకు ఇది దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.