బెంగుళూరు నుంచి దేశవ్యాప్తంగా… అయ్యంగార్ బేకరీల ప్రస్థానం

బేకరీలు బెంగుళూరు సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగంగా చెప్పవచ్చు. ఈ బేకరీలకు శతాబ్ధానికిపైగా చరిత్ర ఉంది. తొలిసారిగా 1898వ సంవత్సరంలో కర్ణాటకలోని హాస్సన్ అనే గ్రామం నుండి తిరుమలచార్ అనే వ్యక్తి తన సోదరుడితో కలసి ఉపాది కోసం బెంగుళూరు వచ్చాడు. అలా వచ్చిన ఆ ఇద్దరు సోదరులు బెంగళూరులో ఒక స్వీట్ షాప్ పెట్టారు. అలా మొదలైన స్వీట్ షాప్ ఆతరువాత కాలంలో బేకరీ దుకాణంగా మారిపోయింది. దీని వెనుక ఓ పెద్దకధే ఉంది. స్వీట్ షాపుకు చాలా మంది నిత్యం వచ్చిపోతుంటారు. ఆ రోజుల్లో బెంగుళూరు బ్రిటిష్ పాలనలో ఉండటంతో ఆంగ్లేయుల ఆహారపు అలవాట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. అదే సమయంలో ఓ ఆంగ్లేయుడు ప్రతిరోజూ వారి స్వీట్ షాప్‌కి రావడం మొదలుపెట్టాడు. అతని ద్వారా బేకింగ్ అనే కొత్త వంటకం గురించి వారు తెలుసుకున్నారు. అతను ఈ ఇద్దరు సోదరులకు బేకింగ్ ఆహారపదార్ధాల గురించి చెప్పటంతో వాటి తయారీపై ఆసక్తి చూపించారు. బేకింగ్ గురించి తెలుసుకోవటంతోపాటు, తయారీ విధానాన్ని నేర్చుకున్న ఆ ఇద్దరు సోదరులు బెంగళూరు బ్రదర్స్ పేరుతో తొలి బేకరీని నెలకొల్పారు.

బెంగుళూరు ప్రాంతంలో ఈ బేకరీ పదార్ధాలు కొత్తకావటంతో ప్రజలు వీటిని తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపసాగారు. దీంతో వీరి వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగింది. బెంగుళూరులో తమ వ్యాపారం ఊపందుకోవటంతో హస్సన్ గ్రామం నుండి బేకరిలో పనిచేసేందుకు కొందరిని పనికోసం తెచ్చుకున్నారు. అలా వారు బేకరీ దుకాణంలో ఉంటూ అక్కడ బేకరీ పదార్ధాల తయారీని నేర్చుకున్నారు. అక్కడ పనిచేసిన అనుభవంతో బెంగుళూరులో బేకరీలను ఏర్పాటు చేశారు.

హస్సన్ ప్రాంతం నుండి ఉపాధికోసం వలస వచ్చిన వారంతా హస్సన్ గ్రామానికి చెందిన అయ్యంగార్లు కావటంతో వారు నెలకొల్పిన బేకరీలను బెంగుళూరులో అయ్యంగార్ల బేకరీలు అనిపిలిచేవారు. ఇలా క్రమేపి అయ్యంగార్ల చేత ఏర్పాటు చేయబడిన బేకరీలకి బెంగళూరు అయ్యంగార్ బేకరీలుగా పేరు పెట్టుకునే వారు. కాలక్రమంలో బెంగుళూరు అయ్యంగార్ల బేకరీలు దేశమంతా పేరుగాంచటంతో దేశంలో ఏప్రాంతంలో బేకరీలు ఏర్పాటు చేసిన వాటికి బెంగుళూరు అయ్యంగార్ బేకరీలుగా పేరు పెట్టటం ద్వారా ఒక బ్రాండ్ ను క్రియేట్ చేశారు. చాలా మంది బెంగుళూరుకు చెందిన కన్నడ వాసులు దేశంలోని దక్షిణాది రాష్ట్రాలకు వలస వెళ్ళి అక్కడ బెంగుళూరు అయ్యంగార్ల పేరుతో బేకరీలను ప్రారంభించి వ్యాపారంలో సక్సెస్ అయ్యారు.

అయితే ప్రస్తుతం చాలా మంది అయ్యంగార్లు పెరును అడ్డంపెట్టుకుని బేకరీ రంగంలో దిగి బేకరీలు నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. అయితే వాస్తవానికి బెంగుళూరు అయ్యంగారి బేకరీలో కేకుతో సహా ఏ రకమైన పదార్ధంలో కోడి గ్రుడ్డు ఉపయోగించేవారు కాదట. ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియదుకాని, అయ్యంగార్లు అంటే వైష్ణవ సాంప్రదాయాలను పాటించే శుద్ధశాకాహారులు. అసలుఅయ్యంగార్ బేకరీ అని పేరు పెట్టడంలో అంతరార్ధం కూడా ఇదేనని బెంగుళూరు వాసులు చెబుతుంటారు. అయ్యంగార్ బేకరీల్లో సాంప్రదాయ వంటకాలతోపాటుగా,ప్రత్యేకంగా రొట్టెలు, బిస్కెట్లు,ఇతర స్వీట్లు తయారుచేసి ఆహార ప్రియులకు అందుబాటులో ఉంచేవారు. ప్రస్తుతం బేకరీలలో పిజ్జా, పఫ్స్, కేకులు వంటి ఆధునిక పదార్థాలతోపాటు ఖారాబిస్కెట్లు, బ్రెడ్ రోల్స్, స్పెషల్ కాజా లాంటి సాంప్రదాయ వంటకాలు అందుబాటులో ఉంటున్నాయి.

అయ్యంగార్ బేకరీలు బెంగుళూరు నగరంలో సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉండటంతోపాటు, అవి ఇక్కడి ప్రజల జీవితాల్లో ముఖ్యమైన భాగంగా మారాయనే చెప్పాలి. బెంగుళూరు పట్టణంలోని వివిధ ప్రాతాల్లో రోడ్డు కూడళ్ళల్లో ఏర్పాటు చేయపడిన ఈ బేకరీలు, ప్రతిరోజు ఆప్రాంతంలో నివశించే వారు ఉదయం, సాయంత్రం ఏదో ఒక సమయంలో అక్కడి చేరి కలుసుకోవటం ద్వారా వారి వారి సాధకబాధలతోపాటు, ఇతర సమాచారం పంచుకునేందుకు వేదికలుగామారాయి. పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఛాయ్ తాగుతూ బేకరీ బిస్కెట్లు తింటూ సరదాగా గడపాలనుకునే వారందరికి బెంగుళూరు అయ్యంగార్ బేకరీలు అడ్డాలుగా మారాయి. ఉదయం టీతో బిస్కెట్ ముచ్చట్లు, సాయంత్రం ఖారా బ్రెడ్‌తో కబుర్లు ఇవన్నీ ఈ బేకరీ అడ్డాలుగా చేసుకునే సాగేవి.

బ్రాండ్‌గా మారిన బెంగుళూరు పేరు

కాలక్రమంలో అనేక కొత్త బేకరీలు వచ్చినా, బెంగుళూరు అయ్యంగార్ బేకరీలకు నేటికీ బెంగుళూరులోనే కాదు దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయనే చెప్పాలి. కాలక్రమంలో బెంగుళూరు అయ్యంగార్ బేకరీలు రాష్ట్ర హద్దులు దాటి దేశం నలుమూలలకూ వ్యాపించాయి. దక్షిణాది రాష్ట్రాలలో, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోను “బెంగుళూరు అయ్యంగార్ బేకరీ” పేరుతో అనేక కొత్త బేకరీలు ప్రారంభించారు. ఈ పేరు ఒక నమ్మకానికి, నాణ్యతకు మారుపేరుగా మారింది. ప్రస్తుతం ఈ బేకరీలలో సమస్త చిరుతిళ్ళుతో పాటు, ఇతర ఆహారపదార్ధాలు అందుబాటులో ఉంటున్నాయి. పాత బెంగుళూరు ప్రాంతంలోని మల్లేశ్వరం, జయనగర్, చంద్రలే అవుట్ లలో ఇప్పటికీ అయ్యంగార్ బేకరీలు అమితమైన ఆదరణ పొందుతున్నాయి.

×