
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతం నుంచి ఉత్పత్తి అయ్యే ఉద్ధానం జీడిపప్పుకు (Uddanam Cashew)కు 2025 సంవత్సరానికి “వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్” (ODOP) జాతీయ అవార్డు లభించింది. ఈ నెల 14న ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి అవార్డుల ప్రదానోత్సవంలో శ్రీకాకుళం జిల్లా అధికారులు అవార్డును అందుకోనున్నారు. ప్రాంతీయ ప్రత్యేక ఉత్పత్తులను ప్రోత్సహించటం ద్వారా ఆర్థిక అభివృద్ధిని పెంచేందుకు, స్థానిక ఉద్యోగాలను మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ గుర్తింపును ఇస్తుంది. శ్రీకాకుళం ఉద్ధానం జీడిపప్పుకు లభించడం గర్వకారణంగా ఉందని జిల్లా అధికారులు అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతం పరిధిలోని పలాస, వజ్రపుకొత్తూరు, మండస, సోంపేట, కావిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాల్లో పెద్ద ఎత్తున జీడి సాగవుతుంది. ఈ ప్రాంతంలో ఒక లక్ష ఎకరాలకుపైగా జీడిపంట సాగు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలోనే జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఒక లక్ష ఐదు వేల కుటుంబాలు ప్రత్యక్షంగా , పరోక్షంగా జీడి సాగు, ప్రాసెసింగ్ పై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు.
అనునిత్యం ఈ ప్రాంతం నుండి సుమారు 3,000 కిలోల జీడిపప్పు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించేందుకు తరలివెళుతుంది. ఇక్కడి వారు వివిధ రకాలైన జీడి పంటలను సాగుచేస్తున్నారు. సంకరజాతి రకాలైన బీపీపీ-8, బీపీపీ-6, వీ-4 వంటి అధిక దిగుబడినిచ్చే రకాలే కాకుండా వంశపారంపర్య రకాలను సాగు చేస్తున్నారు. ఉద్యానవనశాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలతో రైతులు హైబ్రిడ్ రకాలతో పాటు ఆధునిక సాంకేతికతను సాగులో వినియోగిస్తున్నారు.
కేంద్ర బృందం ఫిబ్రవరిలో ఉద్దానం ప్రాంతాన్ని సందర్శించి, జీడిమామిడి తోటలతోపాటుగా, ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించి, ఈ అవార్డు కోసం సిఫార్సు చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజారపు అచ్చన్నాయుడు ఈ అవార్డును అధికారులు, రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ యజమానుల సామూహిక విజయంగా అభివర్ణించటంతోపాటు, జీడు పరిశ్రమపై నమ్మకాన్ని మరింత పెంపొందిస్తుందని తెలిపారు.

ఈ అవార్డును జులై 14న శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ డింకర్ పుంద్కర్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రత్నాల వరప్రసాదరావులు న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు.