
వరి సాగులో వెదజల్లే పద్ధతి సత్ఫలితాలిస్తుంది. పనులు ముమ్మరంగా ఉన్న సమయంలో కూలీలు దొరక్క రైతులు ఇబ్బంది పడే సందర్భాల్లో ప్రత్యామ్నాయం వైపు చూస్తుంటారు. ఈ సమయంలో వెదజల్లే పద్ధతిపై రైతులు దృష్టిసారిస్తున్నారు. ఫలితంగా కూలీల ఖర్చు తగ్గటంతోపాటుగా, పంట దిగుబడి ఆశించినస్ధాయిలోనే వస్తుందని రైతులు నమ్ముతున్నారు. నాట్లు వేసే పద్దతి పాత తరానికే పరిమితంగా ప్రస్తుతం వెదజల్లే పద్ధతినే రైతులు అనుసరిస్తున్నారు.
ఒకప్పుడు మహిళు నాట్లు వేసేందుకు ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం మహిళలు నాట్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో రైతులకు కూలీల కొరత ఎదుర్కోవాల్సి వస్తుంది. సకాలంలో నాట్లు వేయక ఆప్రభావం దిగుబడిపై పడుతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా వెదజల్లే పద్ధతి వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. అటు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు సైతం విస్తృతంగా ప్రచారం కల్పించడంతో అన్నదాతలు ఆవిధానంవైపు ఆసక్తి చూపుతున్నారు.

రైతులంతా ఒకేసారి నారు పోయటం, అనంతరం ఒకేసారి నారు ఎదిగి నాటుకు వస్తుంది. రైతులంతా ఒకేసారి నాట్లు వేయాలన్న ఆలోచన చేసిన సందర్భంలో రైతులు, కూలీల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలే కూలీల కొరత ఒకవైపు ఉంటే దీన్ని ఆసరగా చేసుకుని తమ కూలీరేట్లను ఇష్టానుసారంగా పెంచి డిమాండ్ చేయటం పరిపాటైంది. దీంతో ఈ సమస్య నుంచి రైతులు బయటపడేందుకు వరిసాగులో నాట్లువేసే పద్ధతికి స్వస్తికి పలికి వెదజల్లే విధానం వైపు చాలా మంది రైతులు దృష్టి సారించారు. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల నాటువేసే మిషన్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి వల్ల ఆశించిన ఫలితాలు రావటంలేదు. పురాతన కాలం నాటి వెదజల్లే పద్ధతి అనుకూలంగా ఉండటంతో ప్రస్తుతం రైతులు ఇదే విధానాన్నిఫాలో అవుతున్నారు.
ఎకరా పొలం నాటు వేసేందుకు కూలీలు రూ.3500 నుండి రూ.4000వరకు ఖర్చవుతుంది. వెదజల్లితే ఎకరాకు కేవలం రూ.400 నుండి రూ.500 ఖర్చు మాత్రమే అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. భూమి కలిగిన రైతే స్వయంగా వెదజల్లితే ఆ ఖర్చు కూడా తగ్గుతుందని వ్యవసాయ రంగంపై అనేక వార్త కధనాలు రాసిన సీనియర్ పాత్రికేయులు కందిమళ్ళ వెంకట్రావు అంటున్నారు. నాట్లు వేసే పద్దతికంటే వెదజల్లే పద్ధతితో దిగుబడులు ఎకరాకు 35 నుంచి 45బస్తాల వరకు వస్తున్నట్లు రైతుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎక్కువ మంది రైతులు వెదజల్లే పద్ధతివైపు మొగ్గు చూపుతున్నారు.