
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతోంది ఒక పేరు… ఆమే అంబటి మౌనిక…. అంబటి రాంబాబు కుమార్తె అయిన మౌనిక , రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలే ఈ చర్చకు కారణంగా మారాయి. తన తండ్రి అరెస్టు, ఇంటిపై దాడి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో మౌనిక తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన తీరు, చూపిన ఆత్మవిశ్వాసం రాజకీయ విశ్లేషకులను ఆకట్టుకుంది.
కష్టకాలంలో తండ్రి కోసం బయటకు
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మౌనిక భావోద్వేగాలకు లోనవకుండా, స్పష్టమైన మాటలతో స్పందించారు.
“న్యాయం కోసం పోరాడతాం” అన్న ఆమె వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇదే సమయంలో ఆమె రాజకీయాల్లోకి రావాల్సిందే అన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలపడుతోంది.
వైసీపీ ఇప్పటికే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే వ్యూహంలో ఉంది. ఈ క్రమంలో అంబటి మౌనిక ఎంట్రీ, పార్టీకి కొత్త బలాన్ని ఇచ్చే అవకాశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించే శక్తి ఆమెకు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువత, మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మౌనిక రాజకీయ అరంగేట్రం వైసీపీ వ్యూహంలో భాగమేనా అన్న చర్చ కూడా నడుస్తోంది.
తండ్రి అరెస్టు, ఇంటిపై దాడి జరిగిందన్న ఆరోపణలతో అధికార పార్టీపై ఆమె పరోక్షంగా విమర్శలు చేశారు. ఇది ఆమె రాజకీయంగా తొలి అడుగుగా మారిందా..? లేక కేవలం కుటుంబ పరిరక్షణ కోసమేనా..? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
ముందు.. ముందు ఏమి జరగబోతోంది..?
ఇప్పటికైతే మౌనిక అధికారికంగా రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేయలేదు. కానీ మీడియా ముందుకు రావడం, స్పష్టమైన రాజకీయ వ్యాఖ్యలు, పార్టీ శ్రేణుల్లో వస్తున్న మద్దతు,ఈ మూడు అంశాలు ఆమె రాజకీయ ఎంట్రీకి సంకేతాలా..? అన్న ప్రశ్నకు బలం చేకూరుస్తున్నాయి.
అంబటి మౌనిక రాజకీయాల్లోకి వస్తే అది కేవలం ఒక నేత కుమార్తె రాజకీయ ప్రవేశం మాత్రమే కాదు…వైసీపీకి కొత్త యువ రక్తం, మహిళా నాయకత్వానికి ప్రతీకగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒకటే చర్చ “మౌనిక మాటల వరకేనా..? లేక రాజకీయాల్లోకి అడుగుపెట్టటం ఖాయమా..?” ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే….